కరోనావైరస్: వుహాన్‌లో 2019 ఆగస్టులోనే పుట్టిందా? హార్వర్డ్‌ యూనివర్శిటీ నివేదిక ఏం చెబుతోంది?

    • రచయిత, క్రిస్టోఫర్‌ గ్లైస్‌, బెంజమిన్‌ స్ట్రిక్‌, వాన్‌యువాన్‌ సాంగ్‌
    • హోదా, బీబీసీ రియాల్టీ చెక్‌

గత ఏడాది ఆగస్టులోనే చైనా నగరం వూహాన్‌లో కరోనా వైరస్‌ పుట్టిందంటూ అమెరికాలో విడుదలైన ఒక నివేదికపై అనుమానాలు, విమర్శలు వినిపిస్తున్నాయి. హార్వర్డ్ యూనివర్సిటీ రూపొందించిన ఈ నివేదిక ఇప్పుడు చర్చనీయాంశంగా మారగా, ఈ నివేదికలోని వాదనలను చైనా ఖండిస్తోంది. అసలు ఆ నివేదికను తయారు చేసిన విధానమే తప్పంటున్నారు కొందరు ఇండిపెండెంట్‌ సైంటిస్టులు

హార్వర్డ్ నివేదిక ఏం చెబుతోంది?

ఈ జబ్బు లక్షణాల గురించి ఆన్‌లైన్‌లో నిర్వహించిన సెర్చ్‌లు, వూహాన్‌ నగరంలో ట్రాఫిక్‌ కదలికలపై శాటిలైట్లు ఇచ్చిన చిత్రాలను ఆధారంగా చేసుకుని ఈ నివేదికను రూపొందించారు. అయితే నిపుణులు ఇంత వరకు దీనిని పరిశీలించలేదు.

ఆగస్టు నెల ఆఖరు నుంచి డిసెంబర్‌ 1, 2019 వరకు వూహాన్‌ నగరంలోని ఆరు ప్రముఖ ఆసుపత్రుల ముందు వాహనాల పార్కింగ్‌లో గణనీయమైన మార్పు కనిపిస్తోందని, ఇక్కడ ఆగస్టులోనే కరోనా వ్యాధి మొదలైందనడానికి ఇదే నిదర్శనమని నివేదిక చెబుతోంది.

దీనితోపాటు కరోనా వైరస్‌ లక్షణాలైన దగ్గు, విరోచనాలకు సంబంధించి ఆన్‌లైన్‌లో సెర్చ్‌ విపరీతంగా జరిగిందని కూడా హార్వర్డ్‌ తన నివేదికలో పేర్కొంది.

డిసెంబర్‌ మొదటి వారం వరకు వూహాన్‌లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు కాబట్టి ఈ పరిశీలన చాలా కీలకమైందిగా చెబుతున్నారు.

''వైరస్‌ అప్పుడే పుట్టిందనడానికి ఇదే పరిపూర్ణ ఆధారం అని మేం అనడం లేదు. కానీ హూనన్‌ సీఫుడ్‌ మార్కెట్‌లో ఇది ప్రబలడానికి ముందే దీని అస్తిత్వం ఉందనడానికి ఈ ఆధారాలు బలాన్ని చేకూరుస్తాయి'' అని హార్వర్డ్ పరిశోధకులు చెప్పారు.

హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన ఈ రీసెర్చ్‌‌ను ఆన్‌లైన్‌లో చూడటానికి చాలామంది ప్రయత్నించారు.

వైరస్‌ విషయంలో చైనాపై అగ్గిమీద గుగ్గిలమయ్యే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూడా దీనిపై ఫాక్స్‌ న్యూస్‌లో వచ్చిన ఒక వార్తా కథనాన్ని జోడిస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను 30లక్షలమంది చూశారు.

ఈ ఆధారాలు పరీక్షకు నిలబడతాయా ?

చైనాలో బాగా పాపులరైన సెర్చ్‌ ఇంజిన్‌ బైడులో కరోన లక్షణాలు.. ప్రధానంగా విరోచనాలకు సంబంధించిన చాలామంది సెర్చ్‌ చేసినట్లు, ఆగస్టు డిసెంబర్‌ మధ్యకాలంలో ఈ సెర్చ్‌ ఎక్కువగా జరిగినట్లు నివేదిక పేర్కొంది.

అయితే బైడు కంపెనీ అధికారులు మాత్రం డయేరియా(విరోచనాలు)కు సంబంధించిన సెర్చ్‌ ఈ మధ్యకాలంలో బాగా తగ్గిందని చెబుతున్నారు. హార్వర్డ్ నివేదికను వారు తప్పుబడుతున్నారు.

అసలు ఏం జరుగుతోంది?

'డయేరియా లక్షణాలు' అని అర్దం వచ్చే చైనా పదాన్ని మాటను హార్వర్డ్ యూనివర్సిటీ నివేదిక పేర్కొంది.

దాన్ని మేం బైడు సెర్చ్‌ ఇంజిన్‌లో పరిశీలించాం. ఎంతమంది దాని గురించి చెక్‌ చేశారో గూగుల్ ట్రెండ్స్‌ తరహాలో పరిశీలించి చూశాం .

'డయేరియా లక్షణాలు' అనే పదంపై ఆగస్టు 2019 నుంచి సెర్చ్‌ ఎక్కువగా సాగినట్లు తేలింది.

అయితే కేవలం 'డయేరియా' అనే మాటకు సంబంధించి ఆన్‌లైన్‌లో జరిగిన సెర్చ్‌ గురించి పరిశీలిస్తే, ఆగస్టు 2019 నుంచి ఆ పదంపై సెర్చ్‌ చాలా తక్కువగా జరిగినట్లు మేం గుర్తించాం.

''డయేరియా అనే మాటను ఎందుకు ఉపయోగించామంటే కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల్లో ఎక్కువసార్లు ఈ మాటను వాడారు. ఇది కరోనా వైరస్‌కు చాలా దగ్గరి సంబంధం ఉన్న పదం'' అని హార్వర్డ్ పరిశోధనకు నాయకత్వం వహించిన బెంజమిన్‌ రాడెర్‌ బీబీసీతో అన్నారు.

మేం ఇంకా 'ఫీవర్‌'(జ్వరం), డిఫికల్టీ ఇన్‌ బ్రీతింగ్‌'(శ్వాస పీల్చడంలో ఇబ్బంది) అనే రెండు సర్వసాధారణ లక్షణాలపై జరిగిన సెర్చ్‌ గురించి కూడా పరిశీలించి చూశాం.

ఆగస్టు తర్వాత జ్వరంపై సెర్చ్‌ కొంత ఎక్కువగా జరిగినట్లు గుర్తించగా, దగ్గు, శ్వాస ఇబ్బందులకు సంబంధించి తక్కువగా సెర్చ్‌ జరిగినట్లు తేలింది.

ఇవి కాకుండా కేవలం డయేరియా అనే పదాన్నే ఈ వ్యాధికి కారకంగా భావించడంపై సందేహాలు వ్యక్తమయ్యాయి.

యూకేలో దాదాపు 17,000మంది రోగులను పరిశీలించగా ప్రధాన వ్యాధి లక్షణాలలో డయేరియా ఏడో స్థానంలో నిలిచింది. దగ్గు, జ్వరం, శ్వాస ఇబ్బందులకు ఇది చాలా దూరంలో ఉంది.

పార్కింగ్‌లో పెరిగిన కార్ల సంగతేంటి ?

ఆగస్టు నుంచి డిసెంబర్‌ వరకు ఆరు ప్రధాన ఆసుపత్రుల ముందు కారు పార్కింగ్‌లో గణనీయమైన పెరుగుదల ఉన్నట్లు హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన చెబుతోంది. అయితే ఇందులో కూడా కొన్ని లోపాలున్నట్లు మేం గుర్తించాం.

లెక్కించడంలో ఇబ్బంది లేకుండా ఉండేందుకు చెట్ల కింద , బిల్డింగ్‌ నీడన ఉన్న వాహనాలను పరిగణనలోకి తీసుకోలేదని పరిశోధకులు తమ నివేదికలో చెప్పారు. వాస్తవానికి వారు విడుదల చేసిన శాటిలైట్‌ చిత్రాలను గమనిస్తే, చాలా ఆసుపత్రులలో ఎక్కువ ప్రాంతాలు పెద్ద పెద్ద భవనాలతో నిండి ఉన్నాయి. దీన్నిబట్టి చూస్తే ఇక్కడ ఎన్ని కార్లు పార్కింగ్‌ చేసి ఉన్నాయన్నది అంచనా వేయడం దాదాపు అసాధ్యం .

కింది ఇచ్చిన ట్వీట్‌లో తెలుపు రంగు బాక్సులలో ఉన్న ప్రాంతాలు ఎత్తయిన బిల్డింగ్‌లను సూచిస్తాయి.

టియాన్‌యూ ఆసుపత్రిలో అండర్‌ గ్రౌండ్ పార్కింగ్‌ కూడా ఉంది. ఇది బైడు స్ట్రీట్‌ వ్యూ ఆప్షన్‌లో కూడా కనిపిస్తుంది. కానీ దీని ప్రవేశద్వారమే తప్ప లోపలున్న కార్లు శాటిలైట్‌కు కనిపించవు.

''మా స్టడీలో అండర్‌ గ్రౌండ్ పార్కింగ్‌లో కార్లను పరిశీలించలేకపోయాం. మా పరిశోధనకున్న పరిమితుల్లో ఇదొకటి'' అని హార్వర్డ్‌ పరిశోధనకు నాయకత్వం వహించిన బెంజమిన్‌ రాడెర్‌ అన్నారు.

పరిశోధనకు ఎంచుకున్న ఆసుపత్రుల వ్యవహారంలోనూ పలు అనుమానాలున్నాయి. హుబే విమెన్‌ అండ్‌ చిల్డ్రన్‌ ఆసుపత్రిని కూడా పరిశోధకులు ఎంచుకున్నారు. కానీ కరోనా వైరస్‌ చిన్నపిల్లలకు సోకడం చాలా అరుదు.

అయితే తాము ఎంచుకున్న ఆసుపత్రులే కాకుండా దాదాపు చాలా ఆసుపత్రుల ముందు పార్కింగ్‌లో పెరుగుదల కనిపించిందని పరిశోధకులు వాదిస్తున్నారు.

మిగతా నగరాలతో పోలిస్తే వూహాన్‌ ఆసుపత్రులలో రద్దీ పెరిగిందని, అలాగే సెర్చ్‌ ఇంజిన్‌లో కూడా ఈ వ్యాధికి సంబంధించిన సెర్చ్‌ ఎక్కువగా జరిగిందని పరిశోధకులు మిగతా నగరాలలోనే డేటాను పోల్చి చూపిస్తున్నారు.

ఆ పోలికను పక్కనబెడితే, కరోనా గురించి ఆన్‌లైన్‌ సెర్చ్‌, ఆసుపత్రులలో చికిత్సలను గమనించినా వారి పరిశోధనలో అనేక లోపాలున్నట్లు స్పష్టమవుతుంది.

దీన్నిబట్టి వూహాన్‌లో ఈ వ్యాధి ఎప్పుడు పుట్టింది అనేదానిపై ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)