కరోనా వైరస్‌: 50 రోజుల తర్వాత బీజింగ్‌లో మళ్లీ తిరగబడ్డ కరోనా.. మిలిటరీని రంగంలోకి దించిన చైనా

దాదాపు 50 రోజుల తర్వాత మళ్లీ కరోనా వైరస్‌ బయటపడటంతో బీజింగ్‌లో ప్రధాన మార్కెట్‌ షిన్‌ఫాదిని మరోసారి లాక్‌డౌన్‌లో పెట్టారు.

ఈ ప్రాంతంలో 517మందికి టెస్టులు నిర్వహించగా 45మందికి వైరస్‌ సోకినట్లు గుర్తించారు. మిగిలిన వారెవరిలోనూ కోవిడ్‌ లక్షణాలు కనిపించలేదు.

చుట్టుపక్కల 11 వీధులను కూడా లాక్‌డౌన్‌ చేసి 10,000మంది మార్కెట్ ఉద్యోగులకు పరీక్షలు నిర్వహించబోతున్నారు. మార్కెట్‌లో పని చేస్తున్న వారితో కాంటాక్టులో ఉన్న వారందరితోపాటు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు కూడా టెస్టులు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. బీజింగ్‌లో 50 రోజుల తర్వాత మళ్లీ ఇవే తొలి కేసులు.

కొత్త కేసులను ఎలా అర్దం చేసుకోవాలి?

ఫెంగ్‌టాయ్‌ జిల్లా పరిధిలో ఉండే షిన్‌ఫాది మార్కెట్‌ను ఇటీవల సందర్శించిన ఓ మహిళకు కోవిడ్‌-19 పాజిటివ్‌ రావడంతో శనివారం ఉదయమే మార్కెట్‌ను మూసేశారు. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్నవారిలో 45మందికి కరోనా ఉన్నట్లు తేలింది.

''ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మేం వెంటనే షిన్‌ఫాది మార్కెట్‌ను మూసేశాం'' అని జిల్లా అధికారి జున్‌వీ విలేకరులతో అన్నారు. ప్రస్తుతం ఈ జిల్లాలో 'ఎమర్జెన్సీ' అమలులో ఉందని ఆయన తెలిపారు.

స్కూళ్లు మూసేశారు. రవాణా సదుపాయాలను బంద్‌ చేశారు. లాక్‌డౌన్‌ అమలు కోసం వందలమంది మిలిటరీ పోలీసు సిబ్బందిని రంగంలోకి దించారు. అన్ని క్రీడాకార్యక్రమాలను, ఆఫీసులను పూర్తిస్థాయిలో మూసేశారు.

వూహాన్‌లో తొలిసారి కరోనా వైరస్‌ బైటపడ్డాక, అత్యంత కఠినమైన లాక్‌డౌన్‌ నిబంధనలను చైనా అమలు చేసింది. జాన్స్ హాప్కిన్స్‌ యూనివర్సిటీ అంచనాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 426,000 మంది వైరస్‌బారిన పడి మరణించగా, చైనాలో సుమరు 4,600మంది ప్రాణాలు కోల్పోయారు.

బీజింగ్ నగరం మొత్తాన్ని మూసేస్తారా?

బీబీసీ చైనా ప్రతినిధిస్టీఫెన్ మెక్‌డోనెల్‌విశ్లేషణ

బీజింగ్‌కు అవసరమైన కూరగాయల సరఫరాలో 80శాతం సరుకును అందించే షిన్‌ఫాది మార్కెట్ మళ్లీ వైరస్‌బారిన ఎందుకు పడిందో చెప్పలేకపోతున్నారు చైనా అధికారులు.

ఎక్కడ వైరస్‌ ఉనికి కనిపించినా, ఆ నగరాన్ని పూర్తిగా దిగ్బంధం చేయాలని చైనా ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది.

ఈ ప్రయోగం బాగానే ఉన్నప్పటికీ ప్రస్తుతం వైరస్‌మకంట్రోల్‌లో ఉన్న సమయంలో బీజింగ్‌ మొత్తాన్ని తొందరపడి లాక్‌డౌన్‌ చేయడం అవసరమా అన్న ఆలోచనలో ఉన్నారు అధికారులు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)