You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
స్పేస్ ఎక్స్: ‘ఫాల్కన్’ రాకెట్ మీద ‘క్రూ డ్రాగన్’ అంతరిక్షయానం - నాసా ‘ప్రైవేటు’ మిషన్ గురించి 10 ప్రశ్నలు
- రచయిత, పాల్ రింకన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అమెరికా గత 9 ఏళ్లలో మొదటి సారిగా అంతరిక్ష కక్ష్యలోకి వ్యోమగాములను పంపిస్తున్న ‘క్రూ డ్రాగన్’ మిషన్ గురించి ఎన్నో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అందులో కొన్ని ప్రశ్నలకు బీబీసీ సమాధానాలు కనుగొంది.
ఎలాన్ మస్క్ సంస్థ స్పేస్ ఎక్స్.. ‘క్రూ డ్రాగన్’ అనే తమ అంతరిక్ష నౌకను మొదటిసారి వ్యోమగాములతో అంతరిక్షంలోకి ప్రయోగించబోతోంది.
నాసా వ్యోమగాములను ప్రైవేటు సంస్థ ఎందుకు పంపిస్తోంది?
నాసా తమ సిబ్బందిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపించాలని 2000 మొదటి నుంచీ ప్లాన్ చేస్తోంది. కొలంబియా షటిల్ 2003లో భూమికి తిరిగి వస్తూ పేలిపోయిన తర్వాత, దానికి ప్రత్యామ్నాయంగా చంద్రుడి దగ్గరకు ప్రయాణించగలిగే అంతరిక్షనౌకను తయారు చేయడంపై నాసా దృష్టి పెట్టింది.
తమ సిబ్బందిని, సరకులను ఐఎస్ఎస్‌కు చేర్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టిన నాసా ఆ కార్యక్రమం వ్యయం భరించేందుకు ప్రైవేటు సంస్థలకు చోటు కల్పించింది. నాసా తమ సిబ్బంది రవాణా సేవల కాంట్రాక్టు గెలుచుకున్న సంస్థలుగా ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్, ఏరోస్పేస్ జెయింట్ బోయింగ్‌ను ప్రకటించింది.
మొదట స్పేస్ ఎక్స్ తమ అంతరిక్ష నౌకను లాంచ్ చేస్తుంది. ఫాల్కన్ 9 రాకెట్ పైనున్న క్రూ డ్రాగన్ అంతరిక్ష నౌకను ఫ్లోరిడాలోని కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగిస్తారు.
స్పేస్ ఎక్స్ ఏమిటి?
స్పేస్ ఎక్స్ ఒక అమెరికా సంస్థ. అది తమ ఫాల్కన్ 9, ఫాల్కన్ హెవీ రాకెట్స్ ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన, వాణిజ్య పరంగా లాంచ్ సేవలను అందిస్తుంది. అంతరిక్ష రవాణా ఖర్చులను తగ్గించి, అంగారక గ్రహాన్ని నివాస యోగ్యంగా మార్చాలనే లక్ష్యంతో పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ 2002లో ఈ సంస్థను స్థాపించారు.
ప్రయోగించే రాకెట్‌ను అలా వదిలివేయకుండా స్పేస్ ఎక్స్ ప్రొపల్సివ్ పవర్ ద్వారా తమ ప్రయోగించిన రాకెట్ దశలను తిరిగి భూమికి తీసుకురాగలదు. అది తరచూ ఐఎస్ఎస్‌కు సరుకులను పంపుతూ వస్తోంది. ఇప్పుడు అది వ్యోమగాములను పంపడానికి సిద్ధమైంది. మనుషులను అంతరిక్షంలోకి తసుకెళ్లడానికి మస్క్ కంపెనీ స్టార్ షిప్ అనే పెద్ద అంతరిక్ష నౌకను కూడా తయారు చేస్తోంది. అది అంగారక గ్రహం మీద స్థిరపడే ప్రక్రియను ప్రారంభిస్తుంది.
ఎలాన్ మస్క్ ఎవరు?
దక్షిణ అమెరికాలో పుట్టిన ఎలాన్ మస్క్ తమ పేపాల్ ఆన్‌లైన్ పేమెంట్ సేవలను ఈబేకు అమ్మడం ద్వారా 160 మిలియన్ డాలర్లకు పైగా సంపాదించారు. నిజమైన అంతరిక్ష నాగరికత మానవులదే కావాలనే కోరికతో ఆయన స్పేస్ ఎక్స్ స్థాపించారు. కానీ ఆయన ఎలక్ట్రిక్ కారు టెస్లా తయారీ సంస్థ లాంటి ఎన్నో ఇతర సంస్థలకు నిధులు కూడా అందిస్తున్నారు.
పాడ్స్ ఉపయోగించి ట్యూబుల్లోంచి ప్రయాణించే హైపర్ లూప్ హై స్పీడ్ రవాణా వ్యవస్థ ప్రాజెక్టును కూడా ఆయన రూపొందించారు. మార్వెల్ కామిక్స్, సినిమాల్లో రాబర్ట్ డౌనీ జూనియర్ చేసిన టోనీ స్టార్క్ వంటి పాత్రలకు ఆయన విలాసవంతమైన వ్యక్తిత్వం, జీవనశైలి స్ఫూర్తిగా నిలిచింది. మస్క్ వివాదాలకు అతీతుడు కాదు. ఆయన చేసిన ట్వీట్లపై ఎన్నో కేసులు నమోదయ్యాయి. ఆయన టెల్సా చైర్మన్‌గా తప్పుకునేలా చేశాయి. (ఆయన ఇప్పుడు సీఈఓగా ఉన్నారు.)
ఈ ప్రయోగం ఎందుకంత ముఖ్యం?
2011లో తమ స్పేస్ షటిల్ రిటైర్ అయినప్పటి నుంచి నాసా తమ వ్యోమగాములను సూయజ్ అంతరిక్ష నౌకలో పంపేందుకు రష్యాకు కోట్ల డాలర్లు చెల్లిస్తోంది. ఫ్లోరిడా నుంచి ‘క్రూ డ్రాగన్’ ప్రయోగం 9 ఏళ్లలో అమెరికా నుంచి మనుషులను పంపించే మొదటి లాంచ్ అవుతుంది.
అందుకే మానవ అంతరిక్షయానంలో అమెరికా తిరిగి పరువు నిలబెట్టుకోవాలంటే ఇది చాలా కీలకంగా భావిస్తున్నారు. ఒక ప్రైవేటు సంస్థ వ్యోమగాములను కక్ష్యలోకి పంపించడం కూడా ఇదే మొదటిసారి.
క్రూ డ్రాగన్ అంటే?
క్రూ డ్రాగన్ ఒక అంతరిక్షనౌక. అది బుధవారం వ్యోమగాములను ఐఎస్ఎస్‌కు తీసుకెళ్తోంది. సరుకులను కక్ష్యలోకి తీసుకెళ్లడానికి నిర్మించిన డ్రాగన్ అంతరిక్షనౌక కంటే ఇది సన్నగా ఉంటుంది. గరిష్టంగా ఏడుగురు వ్యోమగాములను తీసుకెళ్లేలా క్రూ డ్రాగన్‌ను డిజైన్ చేసారు. కానీ నాసా తమ ప్రయోగంలో నలుగురిని మాత్రమే పంపుతోంది. మిగతా స్థలంలో వారికి అవసరమైన సరుకులను తీసుకెళ్తారు.
అంతరిక్షంలో కదలడానికి, తనకు తానుగా స్పేస్ స్టేషన్‌కు అటాచ్ కావడానికి వీలుగా దీనికి థ్రస్టర్స్ ఉన్నాయి. మనుషుల కోసం ఇంతకు ముందు రూపొందించిన వ్యోమనౌకల్లో ఆపరేట్ చేసేందుకు స్విచ్‌లు ఉండేవి. క్రూ డ్రాగన్ కాబిన్‌లో వాటి స్థానంలో టచ్ స్క్రీన్ కంట్రోల్స్ ఏర్పాటు చేశారు.
అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు ఎవరు?
బాబ్ బెహెంకెన్, డో హర్లీలు నాసా వ్యోమగాములు. వీరిద్దరూ 2000లో దీనికి ఎంపికయ్యారు. ఇద్దరూ రెండేసి సార్లు అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు. నాసా వ్యోమగాముల బృందంలో అత్యంత అనుభవం ఉన్న వీరిద్దరూ టెస్ట్ పైలెట్లుగా శిక్షణ పొందారు. ఈ సరికొత్త అంతరిక్షనౌకను నడపడానికి అది చాలా కీలకం. హర్లీ అంతరిక్షంలో మొత్తం 28 రోజుల 11 గంటలు గడిపితే, బెహెంకెన్ 37 గంటల స్పేస్ వాక్‌తో కలిపి మొత్తం 29 రోజుల 12 గంటలపాటు ఉన్నారు. ఇద్దరూ వివాహితులు.
అక్కడ వ్యోమగాములు ఏం చేయాలి?
వ్యోమగాములను తీసుకెళ్లడానికి డిజైన్ చేసిన అంతరిక్షనౌక వారు దానిని సురక్షితంగా ఆపరేట్ చేసేలా నిర్ధారించే ఒక ప్రక్రియ ద్వారా వెళ్లాలి. దానిని ధ్రువీకరించే ప్రక్రియలో చివరి దశ ఈ ప్రయోగమే. బెహెంకెన్, హర్లీ కక్ష్యలోకి చేరగానే, వారు క్రూ డ్రాగన్‌లో ఉన్న ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ సిస్టం, డిస్‌ప్లేలు, దానిని కదిలించే థ్రస్టర్లను పరీక్షిస్తారు.
స్పేస్ స్టేషన్‌ను చేరుకునే సమయంలో అది తనకు తానుగా అటాచ్ అయ్యే వ్యవస్థను వారు పరిశీలిస్తారు. ఐఎస్ఎస్ సిబ్బందిలో సభ్యులు అవుతారు. దాని చుట్టూ తిరుగుతూ క్రూ డ్రాగన్‌తో పరీక్షలు చేస్తూ దానితోపాటూ స్పేస్ స్టేషన్‌కు సంబంధించిన మిగతా పనులు కూడా పూర్తి చేస్తారు. తిరిగి భూమికి చేరుకునే సమయానికి క్రూ డ్రాగన్ పారాచూట్ ద్వారా అట్లాంటిక్ మహాసముద్రంలో పడుతుంది. తర్వాత కాప్స్యూల్, సిబ్బందిని ‘గో నావిగేటర్’ అనే నౌక ద్వారా తిరిగి తీసుకొస్తారు.
లాంచ్ సమయంలో ఏదైనా అనుకోనిది జరిగితే?
‘క్రూ డ్రాగన్’కు ఒక ‘బిల్టిన్ అబోర్ట్ సిస్టమ్’ ఉంది. అత్యవసర పరిస్థితుల్లో లోపల ఉన్న సిబ్బంది ప్రాణాలు కాపాడ్డానికి దానిని డిజైన్ చేశారు. ఇది పైకి వెళ్లే సమయంలో ఏదైనా సమస్య ఎదురైతే రాకెట్ ఇంజన్ కటాఫ్ అవుతుంది. క్రూ డ్రాగన్ ఇంజన్లు స్టార్ట్ అవుతాయి. వాహనం, అందులో ఉన్న వారు రాకెట్ నుంచి విడిపోయేలా చేస్తాయి. తర్వాత ఆ కాప్స్యూల్ పారాచూట్ ద్వారా సురక్షితంగా కిందికి వస్తుంది. 2020 జనవరి 19న స్పేస్ ఎక్స్ తన ఫ్లైట్ అబోర్ట్ సిస్టమ్‌ను విజయవంతంగా పరీక్షించింది.
స్పేస్ సూట్ల ప్రత్యేకత ఏంటి?
బెహెంకెన్, హర్లీ కాప్స్యూల్‌లో వేసుకునే స్పేస్ సూట్లు అంతకు ముందు డిజైన్ చేసినవాటి కంటే చాలా భిన్నంగా కనిపిస్తాయి. లావుగా, రంగురంగులుగా ఉండే సూట్లు, స్పేస్ షటిల్ యుగం నుంచి మనకు బాగా తెలిసిన గుండ్రంగా ఉండే హెల్మెట్లకు బదులు స్పేస్ ఎక్స్ తమ స్పేస్ సూట్లను నాజూకుగా రూపొందించింది. పలచగా ఉండే సింగిల్ పీస్‌తోపాటూ, త్రీడీ ప్రింటెడ్ హెల్మెట్లు రూపొందించింది. వ్యోమగామికి తగ్గట్టు ప్రతిదానినీ ప్రత్యేకంగా తయారు చేసింది.
హాలీవుడ్ కాస్ట్యూమ్ డిజైనర్ జోస్ ఫెర్నాండెజ్ రూపొందించడం వల్ల, ఇవి బహుశా మీకు సైన్స్ ఫిక్షన్ సినిమాలో సూట్లులా అనిపించవచ్చు. ఆయన బ్యాట్‌మాన్, ఎక్స్ మెన్, థార్ సినిమాలకు పనిచేశారు. కానీ ఇవి ప్రాక్టికల్‌గా కూడా పనిచేయగలగాలి. కాబిన్‌లో డీప్రెజరైజేషన్ జరిగినప్పుడు, అంటే అంతరిక్ష నౌకలోని గాలి కోల్పోయిన సమయంలో క్రూ సజీవంగా ఉండగలిగేలా వాటిని రూపొందించారు.
తర్వాతేం జరుగుతుంది?
‘క్రూ డ్రాగన్’ డెమో-2 మిషన్ విజయవంతం అయితే నాసాతో చేసుకున్న 2.6 బిలియన్ల కాంట్రాక్ట్ ప్రకారం ఐఎస్ఎస్‌కు పంపే తమ ఆరు ఆపరేషనల్ మిషన్లను స్పేస్ ఎక్స్ కొనసాగిస్తుంది. బోయింగ్ కూడా తమ సీఎస్‌టీ-100 స్టార్‌లైనర్ వెహికల్ ద్వారా వ్యోమగాములను స్పేస్ స్టేషన్ దగ్గరికి పంపించడానికి 4.2 బిలియన్ డాలర్ల విలువైన ఇలాంటి ఒప్పందమే చేసుకుంది.
ఇవి కూడా చదవండి:
- అంతరిక్షంపై ఆధిపత్యం కోసం అమెరికా 'స్పేస్ ఫోర్స్'
- చంద్ర మండల యాత్రకు వెళ్లే పర్యటకుడు యుసాకు మేజావా
- కరోనావైరస్: వ్యాక్సీన్ ప్రయోగాల్లో ఆఫ్రికా వాళ్ళు తప్పకుండా ఉండాలి... ఎందుకంటే?
- కరోనావైరస్: కోవిడ్ పరీక్షలు చేయడం ఎందుకంత కష్టం?
- కరోనావైరస్: ఈ మహమ్మారి మగవారినే ఎక్కువగా టార్గెట్ చేసిందా... మహిళల పట్ల పక్షపాతం చూపిస్తోందా
- కరోనావైరస్: లాక్డౌన్ వారికి కొత్త కాదు... ఆ అందమైన దేశంలో అదొక చిరకాల సంప్రదాయం
- కరోనావైరస్ 2005లో వస్తే ఏం జరిగి ఉండేది?
- ‘నా భర్త నుంచి నేను విడిపోవాలనుకుంటున్నా.. లాక్డౌన్ నాకు ఆలోచించుకునేంత సమయం ఇచ్చింది’
- కరోనావైరస్ సంక్షోభానికి మేధావులు చూపిస్తున్న 7 పరిష్కారాలు 'మిషన్ జైహింద్'
- తెలంగాణ: ‘రెండేళ్ల కిందట తప్పిపోయి, 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న నాన్నను టిక్‌టాక్ చూపించింది’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)