కరోనావైరస్: చిన్నారుల్లో కొత్త లక్షణాలు

చిన్నారుల్లో కనిపిస్తున్న వింత, ప్రమాదకరమైన లక్షణాలకు కరోనావైరస్‌తో సంబంధం ఉందేమో పరిశీలించాల్సిందిగా బ్రిటన్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ వైద్యులకు ఆదేశాలు జారీ అయ్యాయి.

లండన్‌తో పాటు బ్రిటన్‌లోని వివిధ ప్రాంతాల్లో అరుదైన వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న చిన్నారులకు ఇంటెన్సివ్ కేర్ విభాగాల్లో చికిత్స జరుగుతోందని జనరల్ ప్రాక్టీషనర్లకు పంపిన ఒక అత్యవసర హెచ్చరికలో ప్రభుత్వం వెల్లడించింది.

జ్వరం లాంటి లక్షణాలతోపాటు శరీరంలోని వివిధ అవయవాల్లో మంటపుట్టడం ఈ తరహా వ్యాధి లక్షణాలలో ఒకటి.

ఇలాంటి లక్షణాలున్న వారిలో కొందరికి కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే, సంఖ్యాపరంగా అలాంటి కేసులు తక్కువే అని భావిస్తున్నప్పటికీ ఈ లక్షణాలతో ఎంతమంది చిన్నారులు బాధపడుతున్నారన్న దానిపై ఇంకా స్పష్టత లేదు.

చిన్నారుల్లో ఈ అరుదైన, తీవ్రమైన వ్యాధి లక్షణాల విషయం తమ దృష్టికి వచ్చిందని ఇంగ్లండ్ నేషనల్ హెల్త్ సర్వీస్ మెడికల్ డైరెక్టర్ స్టెఫాన్ పావిస్ వెల్లడించారు.

''గత కొద్ది రోజులుగా చిన్నపిల్లల్లో ఇలాంటి అరుదైన లక్షణాలు కనిపిస్తున్నాయని మాకు తెలిసింది. ఈ విషయంపై అత్యవసరంగా దృష్టిసారించాలని మేం నిపుణులను కోరాం'' అన్నారు స్టెఫాన్ పావిస్.

కరోనావైరస్ లక్షణాలకు దగ్గరగా ఉన్న ఈ సరికొత్త రోగ లక్షణాలు యూకేలో పెరుగుతున్న విషయాన్ని గుర్తించామని ఈ హెచ్చరికలు జారీ చేసిన ఇంగ్లండ్ నేషనల్ హెల్త్ సర్వీస్ వెల్లడించింది. అయితే, దీనికీ కరోనావైరస్‌కు సంబంధం ఉందా లేదా అన్నది ఇంకా నిర్ధరణ కాలేదు.

వివిధ వయసుల చిన్నారులు ఈ వ్యాధితో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. టాక్సిక్ షాక్ సిండ్రోమ్ తరహా లక్షణాలు వారిలో కనిపిస్తున్నాయి. ఇలాంటి కేసుల్లో తీవ్రమైన జ్వరం, రక్తపోటు పడిపోవడం, చర్మం మీద దద్దుర్లు, మచ్చలు, శ్వాసలో ఇబ్బందులు కనిపిస్తాయి.

కొందరిలో జీర్ణకోశ సంబంధ సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు, గుండెల్లో మంట, రక్తపరీక్షల్లో అసాధారణమైన ఫలితాలు కనిపిస్తున్నాయి.

ఇవి శరీరం వైరస్‌తో పోరాడి అలసిపోయినట్లు కనిపించే లక్షణాల్లాంటివని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి కేసులను అత్యవసరంగా పరిశీలించాలని డాక్టర్లకు పంపిన అలర్ట్‌లో పేర్కొన్నారు.

అయితే కరోనావైరస్‌తో చాలా కొద్దిమంది పిల్లలు మాత్రమే ఇబ్బంది పడుతున్నారని, ప్రపంచవ్యాప్తంగా చూసినా చిన్నారుల్లో కోవిడ్-19 బాధితులు తక్కువగా ఉన్నారని నిపుణులు గుర్తు చేస్తున్నారు.

స్పెయిన్, ఇటలీలలోనూ కొందరు డాక్టర్లు ఈ తరహా లక్షణాలను గుర్తించారని కేంబ్రిడ్జ్‌లోని పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్‌లో కన్సల్టెంట్‌గా పని చేస్తున్న డాక్టర్ నజీమా పఠాన్ చెబుతున్నారు.

''సెప్టిక్ షాక్ తరహా అనారోగ్యం, చర్మం మీద దద్దులతో చాలామంది పిల్లలు మా వద్దకు వస్తున్నారు. ఇవి చూడటానికి టాక్సిక్ షాక్ సిండ్రోమ్, కవాసాకి (గుండె, రక్తనాళాలపై ప్రభావం చూపే) వ్యాధి లక్షణాల్లాగా ఉన్నాయి. మొత్తం మీద, ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్‌కు కరోనావైరస్ సోకిన చిన్నారులు సులభంగా గురవుతారు. అయితే ఈ వ్యాధి లక్షణాలతో ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స తీసుకుంటున్నవారి సంఖ్య చాలా తక్కువగా ఉంది'' అని నజీమా పఠాన్ అంటున్నారు.

దేశవ్యాప్తంగా ఇలాంటి కేసులు 20కి లోపే ఉన్నట్లు తమ వైద్యనిపుణులు గుర్తించారని నేషనల్ హెల్త్ సర్వీస్ వెల్లడించింది. అయితే పరిశోధన కొనసాగుతోందని, దానికి, కరోనావైరస్‌కు సంబంధమున్నట్లు ఇంతవరకు నిరూపణ కాలేదని ఆ సంస్థ ప్రతినిధి వెల్లడించారు.

ఈ వ్యాధి గురించి తల్లిదండ్రులు కంగారుపడొద్దని, చిన్నారుల్లో ఈ లక్షణాలు ఏమైనా కనిపించినా, లేక ఏవైనా అనుమానాలున్నా వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాల్సిందిగా సూచించామని ది రాయల్ కాలేజ్ ఆఫ్ పీడియాట్రిక్స్ అండ్ చైల్డ్ హెల్త్ (ఆర్‌సీపీసీహెచ్ ) వెల్లడించింది.

''తల్లిదండ్రులకు మేం కూడా ఇదే చెప్పాలనుకున్నాం. ఎవరైనా తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యంపై అనుమానాలుంటే, 111 నెంబర్‌కు కాల్ చేసి నేషనల్ హెల్త్ సర్వీస్ విభాగాన్ని సంప్రదించాలి, లేదంటే ఫ్యామిలీ డాక్టర్ సలహా తీసుకోవాలి. ఇంకా కావాలంటే 999కు కాల్ చేసి సలహా అడగాలి. సదరు నిపుణులు హాస్పిటల్ వెళ్లాలంటే వెంటనే వెళ్లిపోవాలి'' అని నేషనల్ హెల్త్ సర్వీస్ లో క్లినికల్ డైరక్టర్ ఫర్ చిల్డ్రన్ అండ్ యంగ్ పీపుల్ విభాగానికి డైరక్టర్ గా పని చేస్తున్న ప్రొఫెసర్ సైమన్ కెన్నీ సూచించారు.

సాయం ఎప్పుడు పొందాలంటే..

"కరోనా వైరస్ చిన్న పిల్లలకు కూడా సోకుతున్నప్పటికీ, వారికది చాలా తక్కువగా ప్రమాదకకారిగా మారుతుంది. మీ పిల్లలు ఆరోగ్యంగా లేకపోతే అది కరోనా వైరస్ వల్ల కావచ్చు, నాన్ కరోనా ఇన్ఫెక్షన్ వల్లా కావచ్చు. మీ చిన్నారులు కరోనా వైరస్ వల్ల, నాన్ కరోనా వైరస్ సమస్యలతో అనారోగ్యంగా కనిపిస్తే 999కు కాల్ చేయాలని, లేదంటే యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసుకు వెళ్లాలి" అని ఆర్‌సిపిసి హెచ్ తల్లిదండ్రులకు సూచించింది.

ఈ అరుదైన వ్యాధి లక్షణాలు ఇలా ఉంటాయి..

ఒళ్లంతా పాలిపోయినట్లు కనిపిస్తుంది. మచ్చలు ఏర్పడతాయి. ముట్టుకుంటే విపరీతమై చల్లగా తగులుతారు. ఊపిరి తీసుకోవడంలో విరామం ఎక్కువగా ఉండొచ్చు. శ్వాస లయ తప్పుతుంది. గొంతు గరగరలాడుతుంది. శ్వాస పీల్చుకోవడంలో విపరీతమైన ఇబ్బంది ఏర్పడుతుంది. ఒక్కోసారి స్పందనలు కూడా కనిపించవు. పెదవుల చుట్టు నీలిరంగు రింగ్ ఏర్పడుతుంది.

ఒక్కోసారి ఫిట్స్ రావచ్చు

ఒక్కోసారి విపరీతమైన బాధకు లోనవుతారు ( ఎంత సముదాయించినా ఆగకుండా ఏడుస్తారు ), అయోమయానికి గురవుతారు. నీరసంగా కనిపిస్తారు. ఒక్కోసారి స్పృహతప్పుతారు. గ్లాస్ టెస్ట్ చేసినా తగ్గిపోని స్థాయిలో దద్దుర్లు ఏర్పడతాయి. వృషణాల్లో నొప్పి, ముఖ్యంగా యువకుల్లో ఇలాంటి లక్షణం ఎక్కువగా కనిపిస్తుంది.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)