అధికారం పదిలం చేసుకోవడానికి కరోనాను వాడుకుంటున్నారా

కొన్ని యూరప్ దేశాల్లో నాయకులు.. తమ మీద అవిశ్వాసాన్ని అణచివేయటానికి, తమ అధికారాన్ని పదిలం చేసుకోవటానికి ప్రజారోగ్య సంక్షోభాన్ని అనుకూలంగా వాడుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

టర్కీలో సోషల్ మీడియా పోస్టులు చేసినందుకు వందలాది మందిని అరెస్ట్ చేస్తున్నారు. ఫేక్ న్యూస్ అని తాము భావిస్తున్న దానికి జైలులో పెడతామని రష్యా ప్రజలకు బెదిరింపులు జారీ అయ్యాయి.

పోలండ్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, హంగరీలో ప్రజాస్వామ్యం తుడిచిపెట్టుకుపోయిందనే భయాలు వ్యక్తమవుతున్నాయి.

అధికారాన్ని పిడికిట్లో బంధించటానికి కరోనావైరస్‌ను ముసుగుగా ఉపయోగించుకుంటున్నారా అనేది బీబీసీ ప్రతినిధులు విశ్లేషిస్తున్నారు.

హంగరీ: ఓర్బన్‌కు అసాధారణ అధికారాలు కట్టబెట్టి.. పార్లమెంటు ‘ఆత్మహత్య’

హంగరీలో శక్తివంతమైన ప్రధానమంత్రి విక్టర్ ఓర్బన్.. కరోనావైరస్‌ను ఉపయోగించుకుని మరింత అధికారాన్ని హస్తగతం చేసుకున్నారని దేశంలోనూ, వెలుపలా ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఆయన ప్రభుత్వం తొలత మార్చి 11వ తేదీన ప్రమాద పరిస్థితిని ప్రకటించింది. తద్వారా మహమ్మారిని ఎదుర్కోవటానికి విలువైన సమయం లభించింది. కానీ.. ఆ తర్వాత పార్లమెంటులో తమకు గల మెజారిటీని వాడుకుని దీనిని నిరవధికంగా పొడిగించింది. దీంతో తాను కోరుకున్నంత వరకూ ఉత్తర్వులు జారీ చేయటం ద్వారా పరిపాలించే అధికారం ప్రభుత్వానికి లభించింది.

హంగరీలో ప్రజాస్వామ్యం అంతమైపోయిందని విమర్శకులు అంటున్నారు. అయితే.. ‘అథరైజేషన్ యాక్ట్’ అవసరమని, ఇది అత్యవసర పరిస్థితి ముగియటంతోనే రద్దవుతుందని న్యాయశాఖ మంత్రి చెప్పారు.

ప్రభుత్వ అసాధారణ అధికారాలను కొనసాగించటానికి మహమ్మారిని ముసుగుగా ఉపయోగించుకునే అవకాశముందని రాజ్యాంగ చట్ట నిపుణుడు ప్రొఫెసర్ జోల్తాన్ హెచ్చరించారు.

‘ప్రమాదకర పరిస్థితి’ని ఎప్పుడు ముగించాలో నిర్ణయించే విశిష్టాధికారం ప్రభుత్వానికి ఉంది కాబట్టి.. ప్రభుత్వం మీద తన అధికారాన్ని వదులుకోవటం ద్వారా పార్లమెంటు నిజానికి ‘ఆత్మహత్య చేసుకుంది’.

అయితే.. నిబంధనల ప్రకారం విక్టర్ ఓర్బన్ అధికారం మీద ఇంకా మూడు నియంత్రణలు ఉన్నాయి:

  • మహమ్మారి అడ్డుకుంటే తప్ప పార్లమెంటు సమావేశాలు కొనసాగుతాయి
  • రాజ్యాంగ న్యాయస్థానం ఇంకా పనిచేస్తూనే ఉంది
  • 2022లో సాధారణ ఎన్నికలు జరుగుతాయి

పార్లమెంటులో ఓర్బన్‌కు చెందిన ఫిడెస్జ్ పార్టీకి నిర్ణయాత్మక మెజారిటీ ఉంది. ఉప ఎన్నికలు, ప్రజాభిప్రాయసేకరణలు అన్నిటినీ అత్యవసర పరిస్థితి ముగిసే వరకూ వాయిదా వేశారు.

రాజ్యాంగ న్యాయస్థానంలో ఇప్పటికే ఓర్బన్‌కు అనుకూలమైన వారితో నింపేశారు. కానీ.. ప్రధానంగా స్వతంత్రంగా వ్యవహరించే న్యాయవ్యవస్థ.. ఓర్బన్‌కు ముకుతాడు వేయటానికి ప్రయత్నించవచ్చు.

ఈ ఏడాది (2020) చివర్లో సుప్రీంకోర్టుకు కొత్త అధ్యక్షుడిని నియమించటానికి అధికార పార్టీకి పార్లమెంటులో మూడింట రెండు వంతుల మెజారిటీ ఉండటం అవసరం. అప్పుడు ఓర్బన్ అధికారం దాదాపు తిరుగులేనిదిగా మారుతుంది.

టర్కీ: ఎర్డోగన్‌కు ‘అందివచ్చిన అవకాశం’

టర్కీ నాయకుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ తన అధికారాన్ని బలోపేతం చేసుకోవటానికి కరోనావైరస్‌ను ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనకు ఇప్పటికే చాలా అధికారం ఉంది. ఇది ఇక్కడి మానవ హక్కుల ఉద్యమకారుల అభిప్రాయం.

‘‘ఇక్కడ ఎంత కేంద్రీకృత వ్యవస్థ ఉందంటే.. ఇక అధికారాన్ని మరింతగా చేజిక్కించుకోవాల్సిన అసరం లేదు’’ అంటారు హ్యూమన్ రైట్స్ వాచ్ టర్కీ డైరెక్టర్ ఎమ్మా సింక్లైర్-వెబ్.

అయితే.. సోషల్ మీడియా సంస్థల మీద నియంత్రణను పెంచటానికి కొన్ని ప్రతిపాదనలతో ‘పరిస్థితిని పరీక్షించే’ అవకాశవాద ప్రయత్నం జరిగిందని ఆమె చెప్పారు. వైరస్ ప్రభావాన్ని తట్టుకోవటం కోసం ప్రధానంగా ఉద్దేశించిన ఆర్థిక చర్యల చట్టంలో ఇవి అంతర్లీనంగా ఉన్నాయని పేర్కొన్నారు.

ప్రభుత్వ నియంత్రణకు, కోతలకు లొంగిపోయేలా సోషల్ మీడియా వేదికల మీద బలప్రయోగం చేయటం లక్ష్యమన్నారు. ఈ ముసాయిదా సవరణలను అకస్మాత్తుగా పక్కనపెట్టారని, కానీ భవిష్యత్తులో అవి మళ్లీ తెరపైకి వస్తాయని ఎమ్మా భావిస్తున్నారు.

ఈ సంక్షోభ సమయంలో ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని నియంత్రించాలని టర్కీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. కోవిడ్-19 గురించి సోషల్ మీడియాలో ‘రెచ్చగొట్టే పోస్టులు’ చేశారంటూ వందలాది మందిని అరెస్ట్ చేశారు.

కొంతమంది డాక్టర్లు గొంతు విప్పే ధైర్యం చేశారు. ‘‘దురదృష్టవశాత్తూ.. వాస్తవాలను దాచేయటం, సమాచారం మీద గుత్తాధిపత్యం కల్పించుకోవటం.. ఈ దేశాన్ని పరిపాలించే విధానంగా మారిపోయింది’’ అని టర్కిష్ మెడికల్ అసోసియేషన్‌కు చెందిన అలీ సెర్కెజోగ్లు విమర్శించారు.

‘‘డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది గత 20 ఏళ్లుగా దీనికి అలవాటుపడిపోయారు’’ అని పేర్కొన్నారు.

ఈ మహమ్మారి విజృంభణ.. అధ్యక్షుడు ఎర్డోగన్‌కు ఒక అవకాశంగా మారుతుందని న్యాయవాది హురెమ్ సోన్మెజ్ ఆందోళన వ్యక్తంచేశారు. ఆయన వాక్‌స్వాతంత్ర్యం కేసుల్లో నిందితుల తరఫున వాదించారు.

‘‘మహమ్మారి కారణంగా సమాజం, ప్రతిపక్షం బలహీనమయ్యాయి. ఇప్పుడు అందరికీ ఒకటే అజెండా ఉంది – వైరస్. మనుగడ సాగించటమే ప్రాధాన్యం. ఈ పరిస్థితిని ప్రభుత్వం దుర్వినియోగం చేసుకుంటుందనే తీవ్ర ఆందోళన నెలకొంది’’ అని ఆయన పేర్కొన్నారు.

రష్యా: పుతిన్ ఆకాంక్షలను నీరుగారుస్తున్న కరోనా

మొన్న జనవరిలో.. అన్నీ తమకు అనుకూలంగా మలచుకున్నామని అధ్యక్ష భవనం భావించింది.

ముఖ్యంగా వ్లాదిమిర్ పుతిన్‌కు మరో రెండేళ్లు అధికారం కట్టబెట్టటానికి రష్యా రాజ్యాంగాన్ని తిరగరాయాలని తలచింది. ఈ మార్పులకు ప్రజల మద్దతు కూడగట్టటానికి ఏప్రిల్ 22న ‘జాతీయ ఓటింగ్’ నిర్వహించాలని తలపెట్టింది.

ఇది ‘రాజ్యాంగ కుట్ర’ అని అధ్యక్షుడి విమర్శకులు అభివర్ణించారు. అంతా అయిపోయినట్లే కనిపించింది.

కానీ.. కోవిడ్-19 దీనినంతటినీ నిలిపివేసింది. అధ్యక్షుడు పుతిన్.. ఓటింగ్‌ను వాయిదా వేయాల్సి వచ్చింది. మహమ్మారి స్వైరవిహారం చేస్తున్నపుడు జనాన్ని బయటకు వచ్చి ఓటు వేయండని ఎలా చెప్పగలరు?

ఇప్పుడు అధ్యక్ష భవనం ఎదుర్కొంటున్న సమస్య ఏమిటంటే.. ఓటింగ్ ఎప్పుడు జరిగినా కానీ - కొత్త రాజ్యాంగానికి ఆమోదం తెలపటం అనేది జనం ఊసులో ఉండదు.

ఇక్కడ ఆర్థిక వ్యవస్థను కరోనావైరస్ లాక్‌డౌన్ నేలకూల్చుతోంది. రెండేళ్ల పాటు మాంద్యం కొనసాగుతుందని, కోట్లాది ఉద్యోగాలు పోతాయని అంచనాలు వేస్తున్నారు.

రష్యన్లు తమ రోజు వారీ సమస్యలకు.. స్థానిక అధికారులను తప్పుపడుతుంటారు. కేంద్ర అధికారాన్ని కాదు. కానీ.. తీవ్రమైన వ్యక్తిగత ఆర్థిక బాధలను అనుభవించినపుడు జనం తమ ఆగ్రహాన్ని దేశ నాయకుడి మీదకు మళ్లిస్తారని చరిత్ర చెప్తోంది. అటువంటి బాధ ఇప్పుడు అనివార్యంగా కనిపిస్తోంది.

కరోనావైరస్ మీద పోరాటంలో.. అధ్యక్షుడు ఇటీవల ప్రాంతీయ గవర్నర్లకు అధికారం పంచటం వెనుక కారణాన్ని ఇది వివరిస్తుంది: వారు కూడా బాధ్యతను పంచుకుంటారు.

ప్రభుత్వ మీడియా సహా పుతిన్ మద్దతుదారులు.. జాతీయ సంక్షోభంలో రష్యాకు బలమైన, స్థిరమైన నాయకత్వం చాలా అవసరమని వాదిస్తాయి. మరో మాటలో చెప్తే.. పుతిన్ శకాన్ని పొడిగించాల్సిన అవసరం ఉందంటాయి.

ఇక అధ్యక్షుడిని విమర్శించే వాళ్లు.. అధికార వ్యవస్థ తన నియంత్రణను బలోపేతం చేసుకోవటానికి ఈ మహమ్మారిని వాడుకుంటున్నారని ఇప్పటికే ఆరోపించారు.

కరోనావైరస్ గురించి తప్పుడు సమాచారం అని భావించే ఫేక్ న్యూస్‌ను వ్యాప్తి చేస్తే కఠిన శిక్షలు విధించటానికి పార్లమెంటులో ఒక కొత్త చట్టాన్ని హడావుడిగా ఆమోదించారు. ఈ చట్టం కింద 25,000 డాలర్ల వరకూ జరిమానాలు కానీ, ఐదేళ్ల వరకూ జైలు శిక్ష కానీ విధించవచ్చు.

క్వారంటైన్‌ను అమలు చేయటానికి నిఘా వ్యవస్థలను మోహరించటం మీద కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

లాక్‌డౌన్ అంటే.. ప్రతిపక్ష నిరసనలు కూడా జరగటానికి వీలు లేదు: వైరస్ వ్యాప్తిని నిరోధించటం కోసం.. ప్రస్తుతం సమావేశాలను, గుమికూడటాలను నిషేధించారు.

పోలండ్ ప్రభుత్వం.. కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తన్న తరుణంలో మే నెలలో జరగాల్సిన ఎన్నికలను నిర్లక్ష్యపూరితంగా నిర్వహించటానికే ముందుకు వెళుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మహమ్మారి సమయంలో దేశాధ్యక్షుడు ఆంద్రెజ్ డుడాకు తన ప్రజామోదం స్థాయి పెరిగింది. ఆయన గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఎన్నికలు నిర్వహించాల్సిన రాజ్యాంగ బాధ్యత తమ మీద ఉందని అధికార లా అండ్ జస్టిస్ పార్టీ వాదిస్తోంది. లాక్‌డౌన్‌లో పోస్టల్ విధానంలో మాత్రమే ఓటింగ్ నిర్వహించటం సురక్షితమైన పద్ధతి అని చెప్తోంది.

పార్టీ దీనికే మొగ్గుచూపుతోంది. కానీ.. అధ్యక్షుడు డుడా పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పొడిగించటానికి రాజ్యాంగాన్ని సవరించాలన్న ప్రతిపాదనకు కూడా అధికార పార్టీ మద్దతు తెలుపుతోంది.

పోస్టల్ ఓటింగ్ వల్ల ఓటర్లు, పోస్టల్ సిబ్బంది, ఎన్నికల సిబ్బంది ప్రమాదంలో పడతారని ప్రతిపక్షం అంటోంది. ఎన్నికల నిర్వహణ గురించి యూరోపియన్ యూనియన్‌, పోలండ్ సొంత ఎన్నికల కమిషన్ కూడా ఆందోళనలు లేవనెత్తాయి.

ఎన్నికలను వాయిదా వేయటానికి చట్టబద్ధమైన మార్గం ఉందని ప్రతిపక్షం గట్టిగా వాదిస్తోంది. ప్రకృతి విపత్తు పరిస్థితిని ప్రకటించటం ద్వారా, అసాధారణ చర్యలు అమలులోకి తీసుకువస్తే.. ఆ సమయంలోను, అది ముగిసిన 90 రోజుల తర్వాతి వరకూ ఎన్నికలు నిర్వహించరాదని రాజ్యాంగం చెప్తున్న విషయాన్ని ఉటంకించింది.

కానీ అసాధారణ చర్యలను ప్రకటించినట్లయితే.. పరిహారాలను చెల్లించాలనే క్లెయిములకు తాము బాధ్యత వహించాల్సి వస్తుందని ప్రభుత్వం చెప్తోంది.

మే నెలలో యథావిధిగా ఎన్నికలు జరిగితే అవి నిష్పక్షపాతంగా ఉండవని మానవ హక్కుల బృందాలు అంటున్నాయి. దీనికి కారణం.. అభ్యర్థులు ప్రచారం చేయటానికి వీలు లేదని, అధికారంలో ఉన్న వారికి విస్తృత మీడియా ప్రచారం లభిస్తుందని, అది ప్రభుత్వానికి లాభిస్తుందని ఆ సంస్థలు చెప్తున్నాయి.

ఒకవేళ ఎన్నికలను వాయిదా వేసినట్లయితే.. పోలండ్ మాంద్యంలో చిక్కుకున్న తర్వాత డుడా పునరెన్నిక అవకాశాలు గణనీయంగా పడిపోయే పరిస్థితి రావచ్చు. ప్రతిపక్ష నాయకుడు ఎన్నికయినట్లయితే.. కొత్త అధ్యక్షుడికి గల వీటో అధికారంతో.. ప్రభుత్వ కార్యక్రమాన్ని రాబోయే మూడున్నరేళ్ల పాటు అమలు చేసే సామర్థ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది.

‘‘అధికారంలో కొనసాగటానికి ఈ సంక్షోభం నుంచి అత్యంత ప్రయోజనం పొందటం ఎలా అనటానికి ఇది సరైన ఉదాహరణ’’ అని.. వార్సాలోని హెల్సింకి ఫౌండేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ న్యాయవాది మల్గోర్జాటా సులేక బీబీసీతో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)