కరోనావైరస్: మహమ్మారిని నిరోధించటానికి వివిధ దేశాలు చేపడుతున్న చర్యలు ఏమిటి?

    • రచయిత, రియాలిటీ చెక్ టీమ్
    • హోదా, బీబీసీ న్యూస్

కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకునే ప్రయత్నంలో ప్రపంచ దేశాలు విభిన్న చర్యలు చేపడుతున్నాయి.

ఇప్పటివరకూ చైనాలోనే అత్యధికంగా ఈ వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇతర దేశాల్లో వేర్వేరు స్థాయుల్లో ఈ వైరస్ వ్యాపించింది.

ఈ వైరస్‌ను అదుపులో ఉంచటానికి ఆయా దేశాలు ఏం చేస్తున్నాయి?

విమానాశ్రయాల్లో పరీక్షలు

కొన్ని దేశాలు విమానాశ్రయాలు, ఇతర రవాణా కేంద్రాల్లో తమ దేశాలకు వస్తున్న ప్రయాణికులకు ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఇంకొన్ని దేశాలు ఈ పనిచేయటం లేదు.

ఇంగ్లండ్‌ ప్రజారోగ్య విభాగం.. చైనా, ఇరాన్, జపాన్, మలేసియా వంటి దేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల శరీర ఉష్ణోగ్రతలను తనిఖీ చేయటం కాకుండా.. వారిపై ''మెరుగైన పర్యవేక్షక'' విధానాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పింది.

''క్లినికల్ ఎంట్రీ స్క్రీనింగ్ (ఉదాహరణకు శరీర ఉష్ణోగ్రతను తనిఖీ చేయటం ద్వారా అనుమతించటం) చాలా పరిమితమైన ప్రభావమే ఉంటుందని, అతి తక్కువ కేసులు మాత్రమే తెలుస్తాయని నిపుణులు సూచిస్తున్నారు'' అని తెలిపింది.

వైరస్ సోకిన లక్షణాలు కనిపించటానికి ఐదు నుంచి ఏడు రోజుల వరకూ.. ఒక్కోసారి 14 రోజుల వరకూ సమయం పట్టటమే దీనికి కారణమని పేర్కొంది.

మెరుగైన పర్యవేక్షణలో భాగంగా.. విమానాశ్రయాల్లో వైద్య సిబ్బందిని నియమించి.. వైరస్ వల్ల తీవ్రంగా ప్రభావితమైన దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను కలిసి.. లక్షణాల గురించిన సమాచారం వారికి తెలియజేయటంతో పాటు.. అనారోగ్యంగా అనిపిస్తున్నట్లయితే అక్కడే ఉండి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.

విమానాశ్రయాల్లో ప్రయాణికుల శరీర ఉష్ణోగ్రతలను తనిఖీ చేయటం ద్వారా.. కరోనావైరస్ సోకిన వారిలో కేవలం సగం మందిని మాత్రమే గుర్తించగలుగుతున్నారని ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనం చెప్తోంది.

ఇటలీలోని విమానాశ్రయాల్లో ఫిబ్రవరి నుంచి ప్రయాణికుల శరీర ఉష్ణోగ్రతలను తనిఖీ చేస్తున్నారు. రైల్వే స్టేషన్లలోనూ ఈ పరీక్షలను ఇటలీ నిర్వహిస్తోంది. ఆసియా అంతటా విమానాశ్రయాల్లో థర్మోమీటర్లు సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి.

ఇక అమెరికా అయితే.. గత 14 రోజుల్లో చైనా, ఇరాన్‌లను సందర్శించిన విదేశీయులను తన దేశంలో అడుగు పెట్టటానికి అనుమతించటం లేదు.

చైనా నుంచి విమానాలన్నింటినీ అమెరికాలో 11 విమానాశ్రయాలకు మళ్లించారు. వాటిలో వచ్చిన ప్రయాణికులకు.. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు ఉన్నాయేమోనని తనిఖీ చేస్తున్నారు.

ప్రపంచమంతటా ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఉన్న వారు క్రూయిజ్ షిప్‌ల మీద ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కూడా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) సూచించింది.

స్కూళ్లు, కాలేజీల మూసివేత

మొత్తం 14 దేశాలు తమ తమ దేశాల్లో స్కూళ్లను పూర్తిగా మూసివేశాయని, మరో 13 దేశాలు కొన్ని స్కూళ్లను మూసివేశాయని ఐక్యరాజ్య సమితి విద్యా, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ యునెస్కో తెలిపింది.

జపాన్ ఈ విద్యా సంవత్సరం ముగిసే వరకూ.. అంటే మార్చి చివరి వరకూ స్కూళ్లను మూసివేసింది. ఫిబ్రవరి 27వ తేదీన దేశంలో 186 కేసులు నమోదైనట్లు నిర్ధరించినపుడు.. స్కూళ్ల మూసివేత నిర్ణయాన్ని ప్రకటించింది.

ఇటలీ ఏప్రిల్ 3వ తేదీ వరకూ స్కూళ్లను మూసివేసింది. దేశంలో 2,500 కేసులు నమోదైన మార్చి 4వ తేదీన ఈ ఆదేశాలు జారీ చేసింది.

స్పెయిన్ తమ దేశంలో మాడ్రిడ్ ప్రాంతంలోని అన్ని స్కూళ్లు, యూనివర్సిటీలను మూసివేసింది.

బ్రిటన్, జర్మనీల్లో.. కొన్ని స్కూళ్లలో ఎవరైనా సిబ్బంది కానీ, విద్యార్థులకు కానీ కరోనావైరస్ సోకినట్లు నిర్ధరణ అయినపుడు, లేదా హై-రిస్క్ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉన్నపుడు.. ఆయా స్కూళ్లను పూర్తిగా శుభ్రం చేయటం కోసం తాత్కాలికంగా మూసివేశారు.

ఫ్రాన్స్.. తమ దేశంలో తీవ్రంగా ప్రభావితమైన బ్రిటనీ, ఓయిస్ ప్రాంతాల్లోని స్కూళ్లను మార్చి 9వ తేదీ నుంచి 15 రోజుల పాటు మూసివేసింది.

కచేరీలు, క్రీడా కార్యక్రమాల రద్దు

కరోనావైరస్ ప్రభావం వల్ల అనేక క్రీడా కార్యక్రమాలు రద్దయ్యాయి. కొన్నిచోట్ల ఖాళీ స్టేడియంలలోనే ఈ క్రీడలను కొనసాగించారు.

రగ్బీ యూనియన్.. సిక్స్ నేషన్స్ మ్యాచ్‌లలో భాగంగా.. ఇటలీ - ఇంగ్లండ్‌ల మధ్య, ఫ్రాన్స్ - ఐర్లండ్‌ల మధ్య మార్చి 14న జరగాల్సిన మ్యాచులను రద్దు చేశారు.

కోచెల్లా వ్యాలీలో ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించటంతో కాలిఫోర్నియాలో ఇండియన్ వెల్స్ టోర్నమెంటును రద్దు చేశారు. మార్చి 9న క్వాలిఫయింగ్ మ్యాచులు మొదలుకావటానికి కొద్దిముందు ఈ టోర్నీని రద్దు చేశారు.

గ్రీస్‌లో.. రాబోయే రెండు వారాల పాటు జరగాల్సిన ప్రొఫెషనల్ క్రీడా కార్యక్రమాలన్నీ ప్రేక్షకులు లేకుండానే జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించింది.

బార్సిలోనా మారథాన్‌ను మార్చి 15వ తేదీ నుంచి అక్టోబర్ 25వ తేదీకి వాయిదా వేశారు.

ఇటాలియన్ ఫుట్‌బాల్ లీగ్ కూడా ఏప్రిల్ మూడో తేదీ వరకూ అన్ని పోటీలనూ రద్దు చేసింది. స్విస్ ఫుట్‌బాల్ లీగ్ మార్చి 23వ తేదీ వరకూ ఆటలను నిలిపివేసింది. మరికొన్ని ఫుట్‌బాల్ మ్యాచ్‌లను - ప్రత్యేకించి వివిధ దేశాల మధ్య జరిగే పోటీలను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించారు.

ఇదిలావుంటే.. జులై 24వ తేదీన మొదలు కావాల్సిన జపాన్ ఒలింపిక్ క్రీడలు యధాతథంగా మొదలయ్యేలా చూడటానికి శాయశక్తులా కృషి చేస్తున్నామని జపాన్ మంత్రి సీకో హషిమోటో చెప్పారు.

అయితే.. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీతో చేసుకున్న కాంట్రాక్టు ప్రకారం.. ఈ క్రీడలను ఈ ఏడాది చివరి వరకూ వాయిదా వేసే వెసులుబాటు ఉందని కూడా ఆయన తెలిపారు.

మ్యూజియంలు, పర్యటక కేంద్రాల మూసివేత

ప్రపంచ విఖ్యాత పర్యటక కేంద్రాలు మూతపడ్డాయి. కొన్ని చోట్ల పరిమిత ప్రవేశాలు కల్పిస్తున్నారు. మరికొన్నిచోట్ల ఇతరులకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

షాంఘైలోని అతి పెద్ద డిస్నీ రిసార్టును నెల రోజుల పైగా మూసివేసిన తర్వాత సోమవారం పాక్షికంగా తెరిచారు. అయితే.. హాంగ్ కాంగ్‌లోని డిస్నీల్యాండ్, జపాన్‌లోని డిస్నీ థీమ్ పార్కుల మూసివేత కొనసాగుతోంది.

ఆసియాలోని ఇతర దేశాల్లో మ్యూజియంలు, ఇతర పర్యటక క్షేత్రాలను కూడా మూసివేశారు.

ఇటలీ వ్యాప్తంగా పర్యటక కేంద్రాలను పాక్షికంగా మూసివేశారు. రోమ్‌లో కలోసియం, ఇతర పర్యటక క్షేత్రాలను ఏప్రిల్ మూడో తేదీ వరకూ మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

ఫ్రాన్స్‌లోని పారిస్‌లో మార్చి ఆరంభంలో మూసివేసిన లోవర్ మ్యూజియాన్ని తాజాగా తెరిచారు. అయితే.. పర్యటకులు అనారోగ్యంగా ఉన్నట్లు భావిస్తున్నా, ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చిన వారైనా.. మ్యూజియం సందర్శనకు రావద్దని కోరుతోంది.

ఈఫిల్ టవర్‌ సందర్శనకు వచ్చే యాత్రికులు బ్యాంక్ కార్డుల ద్వారా కానీ, ఆన్‌లైన్‌లో కానీ టికెట్లు కొనాలని సూచించారు. పారిస్‌లోని డిస్నీ ల్యాండ్‌లో కొంతమంది సిబ్బందికి కరోనావైరస్ ఉన్నట్లు నిర్ధరణ అయినప్పటికీ.. ఈ పర్యటక ప్రాంతాన్ని తెరిచేవుంచారు.

సౌదీ అరేబియాలోని పవిత్ర క్షేత్రాలకు వచ్చే తీర్థయాత్రికుల ప్రవేశాన్ని ఆ దేశం తాత్కాలికంగా నిలిపివేసింది. ఇరాక్ తమ దేశంలోని మత కేంద్రాలకు వచ్చే యాత్రికుల మీద ఆంక్షలు విధించింది.

ప్రాంతాల దిగ్బంధనం...

వైరస్ వ్యాప్తిని నిరోధించే ప్రయత్నాల్లో భాగంగా.. భారీ ప్రాంతాలను దిగ్బంధించిన చైనాను అనుసరిస్తూ కొన్ని దేశాలు ప్రజల కదలికల మీద పరిమితులు విధిస్తున్నాయి.

ఇటలీ ప్రధానమంత్రి గుసెపి కాంటే.. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసర ప్రయాణం అవసరమైనట్లయితే అనుమతి తీసుకోవాలని ఆదేశించారు.

రోడ్లు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలో తనిఖీలు నిర్వహిస్తారు.

ఈ చర్యలు తాజాగా అమలులోకి వచ్చాయి. కాబట్టి ఇవి ఎంతమేరకు ఫలిస్తాయనేది ఇప్పుడే అంచనా వేయటం కష్టం.

ఇరాన్.. ప్రధాన నగరాల మధ్య ప్రయాణాలను పరిమితం చేసింది. ఆయా నగరాల్లో నివాసం ఉండని వారిని ప్రవేశించేందుకు అనుమతించటం లేదు. అయితే.. వైరస్ ప్రబలంగా వ్యాపించిన పవిత్ర నగరం క్వామ్‌ను దిగ్బంధించలేదు.

దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. పార్లమెంటు డిప్యూటీ స్పీకర్, స్వయంగా వైద్యుడు అయిన మసూద్ పెజేష్కియాన్.. ''నేను గనుక ఆరోగ్యశాఖ మంత్రిని అయినట్లయితే.. క్వామ్ నగరాన్ని మొదటి రోజునే దిగ్బంధించి ఉండేవాడిని'' అని పేర్కొన్నారు.

మంగళవారం 54 మరణాలు సంభవిచింనట్లు ఇరాన్ ప్రకటించింది. దేశంలో వైరస్ ప్రబలిన తర్వాత ఒక రోజులో సంభవించిన మరణాల్లో ఇదే అధికం.

దక్షిణ కొరియాలో.. డేగు నగరంలో రెండు అపార్ట్‌మెంట్ బ్లాక్‌లను అధికారులు దిగ్బంధించారు. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో మూడో వంతు ఈ నగరంలోనే ఉన్నాయి. వైరస్ విజృంభణకు కేంద్ర బిందువుగా ఉన్న షిన్‌చియాన్జీ చర్చ్ ఆఫ్ జీసస్ సభ్యులు చాలా మంది ఈ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో నివసిస్తున్నారు.

380 మంది విదేశీయులను ఉత్తర కొరియా ప్రభుత్వం నెల రోజులకు పైగా వారి కాంపౌండ్లలోనే క్వారంటైన్ చేసింది. వారిలో ఎక్కువ మంది ప్యాంగ్యాంగ్ నగరంలో ఉండే దౌత్యాధికారులు, దౌత్య సిబ్బంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)