డోనల్డ్ ట్రంప్: ఎట్టకేలకు వెలుగు చూసిన మధ్యప్రాచ్య శాంతి ఒప్పంద ప్రణాళిక

ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ట్రంప్ మధ్యప్రాచ్య శాంతి ప్రణాళిక ఎట్టకేలకు వెలుగు చూసింది. జెరూసలెంను ఇజ్రాయెల్‌ అవిభాజ్య రాజధానిగా కొనసాగుతుందనే హామీతో ట్రంప్ తన ప్రణాళికను వెల్లడించారు.

ఈ ప్రకటనలో ఆయన స్వతంత్ర పాలస్తీనా దేశాన్ని ప్రతిపాదించారు. వివాదాస్పద వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో ఇప్పటికే 4 లక్షల మంది ఇజ్రాయిలీలు బతుకుతున్నారు. ఆ ప్రాంతం ఇజ్రాయెల్ ఆధీనంలోనే ఉంటుందని కూడా పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో కలసి ట్రంప్ తన శాంతి ప్రణాళికను ప్రకటించారు.

అయితే, పాలస్తీనా అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్ ఈ ప్రణాళిక 'ఒక కుట్ర' అని విమర్శించారు.

ఈ ప్రకటన తరువాత గాజా భూభాగంలో నిరసనలు చెలరేగాయి.

ప్రపంచంలో సుదీర్ఘ కాలంగా రగులుతున్న వివాదాల్లో ఒకటైన పాలస్తీనా సమస్య ను పరిష్కరించే లక్ష్యంతో సాగిన ఈ ప్రణాళిక రూపకల్పనకు ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నెర్ నాయకత్వం వహించారు.

అమెరికాలో అభిశంసన తీర్మానాలను ఎదుర్కొంటున్న ట్రంప్, తన దేశంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నెతన్యాహు కలిసి ఈ ప్రకటన చెయ్యడం ఆసక్తిని రేపింది.

ట్రంప్ చేసిన కీలక ప్రతిపాదనలు ఇవీ:

వైట్ హౌస్‌లో అధికారులు, విలేఖరులను ఉద్దేశించి మాట్లాడుతూ ట్రంప్, "ఇవాళ ఇజ్రాయెల్ శాంతి దిశగా ఒక పెద్ద ముందడుగు వేస్తోంది" అని అన్నారు.

"నా ప్రతిపాదన రెండు దేశాలకు పరస్పరం మేలు చేసేదిగా ఉంటుంది. ఇజ్రాయల్ భద్రతకు పాలస్తీనా నుంచి ఉన్న ముప్పును పరిష్కరించల రెండు దేశాల పరిష్కార మార్గమిది" అని ట్రంప్ వివరించారు.

ఇవీ ఆయన ప్రతిపాదనలు:

ఇప్పటికే ఇజ్రాయెల్ ఆధీనంలో ఉన్న ప్రాంతాన్ని ఆ దేశానికి ఇస్తారు. అలాగే, దీనికి గాను ట్రంప్ విడుదల చేసిన మ్యాప్ ప్రకారం ఇజ్రాయెల్ కూడా కొన్ని వివాదాస్పద ప్రాంతాల విషయంలో రాజీకి ఒప్పుకుంటుంది.

ప్రస్తుతం పాలస్తీనాకు ఉన్న భూభాగాన్ని రెండింతలు చెయ్యడమే కాకుండా తూర్పు జెరూసలేంను పాలస్తీనా రాజధానిని చేస్తారు. ఇక్కడ ఒక అమెరికన్ దౌత్య కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ట్రంప్ ప్రకటించారు.

1967లో మధ్య ప్రాచ్య యుద్ధం సమయంలో ఇజ్రాయెల్ ఆక్రమించిన తూర్పు జెరూసలేంను తమ దేశ రాజాధానిగా చూసుకోవాలని పాలస్తీనా ఎప్పటినుంచో కోరుకుంటోంది. అలాంటిది, జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా ఈ ప్రణాళికలో పేర్కొన్నారు.

ఇజ్రాయిలీలను కానీ పాలస్తీనా ప్రజలను కానీ వారి ఇళ్ళనుంచి తొలగించడం జరగదని ట్రంప్ ప్రకటించారు. ఇప్పటికే ఇజ్రాయెల్ ఆధీనంలో ఉన్న వెస్ట్ బ్యాంక్ ఇకమీదట కూడా ఇజ్రాయెల్ ఆధీనంలోనే ఉంటుందని దీని అర్ధం.

ఈ డీల్ ప్రకారం ఎప్పట్నుంచో సొంత దేశం కావాలనుకుంటున్న పాలస్తీనాకు తన కల నెరవేర్చుకునే అవకాశం దొరుకుతుందని ఈ ప్రతిపాదనలో ఉంది.

జోర్డాన్ వ్యవస్థీకరిస్తున్న జెరూసలెంలోని పవిత్ర స్థలాన్ని జోర్డాన్ రాజుతో కలిసి ఇజ్రాయెల్, పాలస్తీనా సంప్రదింపులు జరిపి ఆ స్థలాన్ని అలాగే ఉంచాలని ప్రతిపాదించారు.

ట్రంప్ తను విడుదల చేసిన ఒక మ్యాప్‌లో "పాలస్తీనాకు కేటాయించిన స్థలంలో నాలుగేళ్లపాటు ఎటువంటి అభివృద్ధి జరగకూడదు. ఇజ్రాయెల్‌తో మంతనాలు జరిపి ఈ ఒప్పంద ప్రణాళికను చదివి, అర్ధం చేసుకుని ఆ తరువాత పాలస్తీనా ఒక పూర్తి దేశంగా అభివృద్ధి చెందాలి" అన్నారు.

ఇజ్రాయెల్ అధికారుల ప్రకారం అమెరికా పర్యటన తరువాత నేరుగా పుతిన్‌ను కలవడానికి నెతన్యాహు రష్యా వెళ్తున్నారు.

బీబీసీ ప్రతినిధి జొనాథన్ మార్కస్ విశ్లేషణ

"ఇప్పటివరకు ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య జరిగిన వివాదంలో సరిహద్దులు, వెస్ట్ బ్యాంక్ సెటిల్మెంట్లు, జెరూసలేం హోదా, పాలస్తీనాకు చెందిన శరణార్థులు వంటివి కీలక అంశాలు. వాటిని ఇజ్రాయెల్, పాలస్తీనా కలిసి చర్చించుకున్నాయి. నెతన్యాహు పక్కనే ఉండగా ట్రంప్ ప్రకటించిన ఈ ప్రణాళిక ప్రకారం ఈ అంశాలన్నీ ఇప్పుడు ఇజ్రాయెల్ కు అనుకూలంగా మారతాయి." అని బీబీసీ డిఫెన్స్ కరెస్పాండంట్ జోనాథన్ మార్కస్ అంటున్నారు.

ఈ ప్రకటన తదనంతరం పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్ మాట్లాడుతూ, "జెరూసలేం రాజధానిగా లేని పాలస్తీనాను అరబ్బులు కానీ, ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ ఆమోదించరు" అని చెప్పారు.

గాజా స్ట్రిప్‌ను నియంత్రిస్తున్న పాలస్తీనాకు చెందిన మిలిటెంట్ దళం హామాస్ కూడా ఈ డీల్‌ను తిరస్కరిస్తూ "ఇది పాలస్తీనా దేశం కోసం పరితపిస్తున్న వారి ఆశలను నీరుగార్చే ప్రయత్నం" అని ప్రకటించింది.

తాము మాత్రం ఇజ్రాయెల్, పాలస్తీనా రెండు స్వత్రంత్ర దేశాలుగా ఉండడానికే ఆమోదం ఇస్తామని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. అయితే ఇది 1967లో జరిగిన యుద్ధానికి ముందు ఉన్న సరిహద్దుల ప్రకారమే జరగాలి. ఆ యుద్ధం సమయంలోనే గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్‌ను ఇజ్రాయెల్ ఆక్రమించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)