ఆఫ్రికా: లెసోటో ప్రధాని భార్య హత్య మిస్టరీ... ఆరోపణల్లో కూరుకుపోయిన ప్రధాని థామస్, ఆయన రెండో భార్య

లెసోటో- ఆఫ్రికా దక్షిణ భాగంలోని ఓ చిన్న దేశం. దీనికి ఒకే ఒక్క దేశంతో సరిహద్దులు ఉన్నాయి. గ్రామాలు, పర్వత ప్రాంతం ఎక్కువగా ఉండే లెసోటో చుట్టూ దక్షిణాఫ్రికానే ఉంది. దాదాపు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే లెసోటో ఒక హత్య కేసుతో వార్తల్లోకి ప్రముఖంగా వచ్చింది.

లెసోటో ప్రధాని, ఆయన ప్రస్తుత భార్య ఈ హత్య ఆరోపణల్లో కూరుకుపోయారు. హతురాలు ప్రధాని నుంచి విడిపోయిన భార్య. ప్రధానిగా ఆయన ప్రమాణ స్వీకారానికి కేవలం రెండు రోజుల ముందు ఆమె హత్య జరిగింది. క్రైమ్ నవలను తలపించే ఈ హత్యోదంతం, విచారణపై లెసోటో రాజధాని మసేరు నుంచి బీబీసీ ప్రతినిధి పుంజా ఫిహ్లానీ అందిస్తున్న కథనం ఇది.

పైకి చూస్తే లెసోటోలో అంతా సాధారణంగానే ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ దుకాణాల కిటికీలపై అతికించిన, దీపస్తంభాలకు కట్టిన పత్రికలను చూస్తే వాస్తవం అలా లేదని అర్థమవుతుంది. వాటిలో 'దేశ తొలి మహిళ(ఫస్ట్ లేడీ) కోసం గాలిస్తున్న పోలీసులు' అనే ఒక శీర్షిక, 'వైదొలగడానికి అంగీకరించిన ప్రధాని' అనే మరో శీర్షిక ఓ పెద్ద వార్త లోతుల్లోకి తీసుకెళ్తున్నాయి.

ఈ హత్య కేసులో లెసోటో ప్రధాని థామస్ థాబానే, ఆయన ప్రస్తుత భార్య మయేసయాను విచారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

2012లో థామస్‌ నుంచి విడిపోయి జీవనం సాగిస్తూ వస్తున్న 58 ఏళ్ల లిపోలెలో థాబానే 2017లో హత్యకు గురయ్యారు. 2017 జూన్ 16న ప్రధానిగా థామస్ ప్రమాణ స్వీకారం చేశారు. దీనికి రెండు రోజుల ముందు లిపోలెలో హత్య జరిగింది.

ఓ రోజు సాయంత్రం ఇంటికి తిరిగి వస్తున్న లిపోలెలోపై ఆగంతకులు ఆకస్మికంగా దాడి చేసి, అతి సమీపం నుంచి అనేకసార్లు కాల్పులు జరిపారు. ఓ మట్టి రోడ్డు పక్కన ఆమె ప్రాణాలు వదిలారు. లిపోలెలో హత్యతో దేశం దిగ్భ్రాంతి చెందింది. హత్యను థామస్ ఖండించారు. ఇది మతిలేని పనని వ్యాఖ్యానించారు.

గుర్తుతెలియని సాయుధులు ఈ హత్యకు పాల్పడ్డారని అప్పట్లో వార్తలు వచ్చాయి. లెసోటో పోలీసు విభాగాధిపతి హోలోమో మొలిబెలి ఇటీవల న్యాయస్థానానికి సమర్పించిన పత్రాలు లిపోలెలో హత్యపై అనుమానాలు కలిగించాయి.

ఈ పత్రాలను ఏఎఫ్‌పీ వార్తాసంస్థ పరిశీలించింది. ఇందులో 2019 డిసెంబరు 23 తేదీతో ఒక లేఖ ప్రతి ఉంది. ప్రధానమంత్రి థామస్‌కు పోలీసు విభాగాధిపతి రాసిన లేఖ అది. "నేరం జరిగిన చోట నుంచి ఫోన్ సంభాషణ సాగిందని, ఆగంతకులతో అవతలి వాళ్లు ఇంకో సెల్‌ఫోన్ నుంచి మాట్లాడారని దర్యాప్తులో తేలింది. ఆ సెల్‌ఫోన్ నంబరు మీదే" అని లేఖలో ఉంది.

థామస్‌ వయసు 80 ఏళ్లు. ఆయన భార్య మయేసయకు 42 ఏళ్లు.

ప్రధాని భార్య ఆచూకీ ఏమైంది?

లిపోలెలో హత్య కేసులో థామస్, మయేసయపై అభియోగాలేవీ నమోదు కాలేదు.

విచారణ నిమిత్తం తమ ఎదుట హాజరు కావాలని మయేసయకు పోలీసులు చెప్పారు. ఆమె రాలేదు. దీంతో ఆమె అరెస్టుకు ఈ నెల 10న వారెంటు జారీ అయ్యింది. రెండు వారాలుగా ఆమె బయట ఎక్కడా కనిపించలేదు. ఆమె ఆచూకీ తెలియడం లేదు. దీని గురించి ఎవరూ మాట్లడటానికి కూడా సిద్ధంగా లేరు.

భార్య జాడపై ప్రశ్నలకు ప్రధాని థామస్ సమాధానాలు ఇవ్వడం లేదు.

ఈ అంశంపై స్పందన తెలుసుకొనేందుకు ప్రభుత్వ అధికారులను బీబీసీ సంప్రదించింది. దీనిపై ప్రశ్నలకు బదులిచ్చేందుకు వారు అంగీకరించలేదు.

పోలీసులు తనను విచారించేందుకు ప్రధాని థామస్ గత వారం అయిష్టంగానే అంగీకరించారు.

బెదిరింపులు

పోలీసుగా తన 32 ఏళ్ల అనుభవంలో అత్యంత సంక్లిష్టమైన, ప్రమాదకరమైన కేసుల్లో ఈ కేసు విచారణ ఒకటని పోలీసు కమిషనర్ హోలోమో మొలిబెలి బీబీసీతో చెప్పారు. విచారణ సులువుగా సాగలేదని, దర్యాప్తును అడ్డుకోవడానికి చాలా ప్రయత్నాలు జరిగాయని ఆయన చెప్పారు.

తాము చేస్తున్నది సరైనదేనని తమ అంతరాత్మ చెబుతోందని కమిషనర్ వ్యాఖ్యానించారు. "లెసోటో ప్రజలు నిజమేమిటో తెలుసుకోవాలనుకొంటున్నారు. దర్యాప్తు జరిపి, నిజాన్ని నిగ్గు తేల్చాల్సిన బాధ్యత మాదే" అని ఆయన చెప్పారు. దర్యాప్తు సాగిస్తున్నందుకు తనను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయని, వీటికి తాను భయపడబోనని తెలిపారు.

తనకు అండగా నిలిచేవారు ఉన్నారని కమిషనర్ చెప్పారు. గతంలోనైతే సైన్యం నుంచి బెదిరింపులు వచ్చేవని, ఇప్పుడు అలాంటిదేమీ లేదని, సైన్యంతో తనకు మంచి సంబంధాలే ఉన్నాయని పేర్కొన్నారు. ఈ రొంపిలోంచి లెసోటోను బయటకు తీసుకురావాలని తామంతా అనుకొంటున్నామని తెలిపారు.

పోలీసులు తమ వద్దనున్న ఆధారాలేమిటనేది వెల్లడించడం లేదు. అయితే కేసు బలంగా ఉందని కమిషనర్ అంటున్నారు.

ప్రజల దృష్టి, మీడియా దృష్టి తన మీద ఉండటంపై లిపోలెలోకు ఆసక్తి లేదని, రాజధాని మసేరు శివారులోని హమసానాలో గ్రామీణ జీవితానికే ఆమె మొగ్గు చూపేవారని ఆమె గురించి తెలిసినవారు చెబుతారు.

చనిపోవడానికి నెలల ముందు లిపోలెలో గడ్డు కాలాన్ని ఎదుర్కొన్నారు. థామస్‌ నుంచి విడాకులు తీసుకొనే ప్రక్రియ సుదీర్ఘకాలం సాగింది. మరోవైపు లెసోటో తొలి మహిళగా గుర్తింపును తన పేరిటే కొనసాగించాలని కోరుతూ ఆమె దావా వేశారు. ఈ అంశాలపై వార్తలు తరచూ మీడియాలో ప్రధానంగా వచ్చేవి.

పూర్తికాని విడాకుల ప్రక్రియ

లిపోలెలో నుంచి విడిపోయిన తర్వాత థామస్ మయేసయాతో కలసి జీవించసాగారు. ఆమెనే తన భార్య అన్నట్లుగా. ప్రధాని భార్యగా లభించే ప్రయోజనాలన్నీ మయేసయాకే దక్కాయి. మరోవైపు లిపోలెలో అష్టకష్టాలు ఎదుర్కొన్నారు.

సుదీర్ఘ న్యాయ ప్రక్రియ తర్వాత 2015లో లిపోలెలోకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. మయేసయాకు ప్రభుత్వ నిధులను అందించడాన్ని నిలిపివేయాలని ఆదేశించింది.

తొలి జీవితభాగస్వామిగా లిపోలెలోకు లభించే హక్కులేవీ మయేసయ అనుభవించడానికి వీల్లేదని, లిపోలెలో విధులను కూడా ఆమె నిర్వహించకూడదని న్యాయస్థానం చెప్పింది. కోర్టు రూలింగ్ థామస్‌కు పెద్ద పరాభవం.

విడాకుల ప్రక్రియ పూర్తయ్యే వరకు చట్టప్రకారం లిపోలెలోయే థామస్ భార్య అని, ఆమె సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనని ఈ రూలింగ్ చెబుతోంది.

విడాకుల ప్రక్రియ పూర్తికాక ముందే లిపోలెలో హత్య జరిగింది.

30,355 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, కేవలం 22 లక్షల జనాభాగల లెసూటూ దాదాపు ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటుంది. అయితే ఉన్నతస్థాయి అధికారులు హత్యకు గురైన చరిత్ర ఈ దేశానికి ఉంది. సైన్యంలో లేదా రాజకీయ వర్గాల్లో వివాదాలు ఈ హత్యలకు కారణాలు.

తనపై సైన్యం కుట్ర పన్నుతోందని ఆరోపించి థామస్‌ కూడా గతంలో ఒకసారి పొరుగుదేశం దక్షిణాఫ్రికాకు పారిపోయారు.

లిపోలెలో రాజకీయాలతో సంబంధంలేని వ్యక్తి. ఆమెకు రాజకీయ శత్రువులూ లేరు. ఆమె మరణం చాలా మందికి అనుమానాస్పదంగానే ఉంది.

"లిపోలెలోకు న్యాయం జరగాలి"

లిపోలెలో మరణవార్త తనకు దిగ్భ్రాంతి కలిగించిందని మసేరుకు చెందిన లెబహాంగ్ లిబాలో చెప్పారు. ఆమెకు జరిగింది అసాధారణమైనదని, ఆమె హత్య చుట్టూ గోప్యత కూడా అసాధారణంగానే ఉందని వ్యాఖ్యానించారు. ఆమెకు న్యాయం జరగాలన్నారు.

లిపోలెలో కేసులో పరిణామాలపై ప్రజల్లో ఆసక్తి ఉంది. ప్రతి మలుపు గురించీ వాళ్లు తెలుసుకొంటున్నారు. కానీ ఎక్కడో మూల వారిలో భయం వెంటాడుతోంది.

నాతో మాట్లాడటానికి సరేనన్నవారు తమ ఫొటోలు మాత్రం తీసుకోవద్దని చెప్పారు. లిపోలెలో హత్య దేశానికి తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితిని కల్పించిందని వీరిలో ఒకరైన బాక్వేనా మొఫోకా విచారం వ్యక్తంచేశారు. "ఇది మా దేశాన్ని ఇతరులు తప్పుగా అర్థం చేసుకొనేందుకు కారణమవుతోంది. ఆచూకీ తెలియకుండా పోయిన ప్రధాని భార్య తెరపైకి రావాలి" అన్నారు.

మయేసయపై జారీ అయిన అరెస్టు వారెంటును పక్కనపెట్టాలని ఆమె న్యాయవాదులు మసేరు హైకోర్టును కోరుతున్నారు. దీనిపై కోర్టు రూలింగ్ ఇంకా వెలువడలేదు.

పోలీసులకు సహకరించేందుకు మయేసయ ఎప్పుడూ సిద్ధమేనని, అయితే వారు ప్రశ్నించాలనుకొన్నరోజు ఆమె అధికారిక విధుల్లో తలమునకలై ఉన్నారని న్యాయస్థానంలో చెప్పారు. ఆమె ఆచూకీ బయటి ప్రపంచానికి తెలియకపోవడానికి కారణాలను వారు తెలపలేదు.

మయేసయకు వివాదాలు కొత్త కాదు. ప్రభుత్వ కార్యకలాపాల్లో ఆమె జోక్యం చేసుకొంటున్నారనే ఆరోపణలు గత రెండేళ్లుగా పదే పదే వస్తున్నాయి. ఆమె జోక్యాన్ని లెసూటూ ప్రజలు 'పడకగది కుట్ర'గా వ్యాఖ్యానిస్తుంటారు.

ఈ ఆరోపణలను ప్రధాని థామస్ తోసిపుచ్చుతూ వస్తున్నారు. అయితే వీటివల్ల పాలక ఆల్ బసూతూ కన్వెన్షన్(ఏబీసీ) పార్టీలో మయేసయ కొందరు నేతల మద్దతు కోల్పోయారు.

రాజీనామా ఎప్పుడో చెప్పని ప్రధాని

లిపెలెలో హత్యోదంతంతో ప్రధాని రాజకీయంగా చిక్కుల్లో పడ్డారు. విషప్రచారానికి తమ నాయకుడు బాధితుడు అవుతున్నారని థామస్ మద్దతుదారులు వాదిస్తున్నారు. దర్యాప్తు తీరునూ ప్రశ్నిస్తున్నారు.

ఈ ఉదంతం తీవ్రతరమవుతున్న తరుణంలో, ప్రధాని పదవి నుంచి తప్పుకోవడానికి థామస్ అంగీకరించారు. ఈ మేరకు ఈ నెల 17న రాజధానిలో మీడియా సమావేశంలో ప్రకటించారు. రాజీనామా ఎప్పుడనేది చెప్పలేదు.

తన వయసు దృష్ట్యానే రాజీనామా చేస్తున్నానని, కేసు దర్యాప్తుతో సంబంధం లేదని ఆయన చెప్పారు.

వాస్తవానికి పాలకపక్షం ఏబీసీలో తీవ్రస్థాయిలో విభేదాలున్నాయి. అయితే ప్రధాని దంపతులపై వివాదం తలెత్తినప్పటి నుంచి పాలకపక్షం నేతలు కలసికట్టుగా ఉన్నట్లు కనిపించేందుకు యత్నిస్తున్నారు. విపక్షాలకు అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు, తదుపరి ఏంచేయాలో నిర్ణయించుకొనేందుకు ప్రధానికి తగిన సమయం ఇచ్చేందుకు వారు ఇలా చేస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ ఆయన చేతిలో ఎక్కువ సమయం ఉండకపోవచ్చు.

ప్రధాని తక్షణం రాజీనామా చేయాలనే డిమాండ్‌తో గత వారం వందల మంది నిరసనకారులు రాజధానిలో ప్రదర్శన నిర్వహించారు.

ఆయన వైదొలగే వరకు నిరసనలు కొనసాగిస్తామన్నారు. తమను తాము బాధ్యతగల లెసూటూ పౌరులుగా వారు పేర్కొన్నారు.

థామస్ రాజీనామా వల్ల అస్థిరత తలెత్తిన పర్వాలేదని, కానీ దానికి ప్రధానే బాధ్యులని ప్రదర్శన నిర్వాహకుల్లో ఒకరైన రమహొవానా మతలోసా చెప్పారు.

థామస్ పట్ల ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను ఇది సూచిస్తుంది. అయితే లిపోలెలోను ఎవరు హత్య చేశారనే మిస్టరీ ఆయన రాజీనామాతోనే వీడకపోవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)