You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'పర్యటకులు మమ్మల్ని అసభ్యంగా తాకారు': థీమ్ పార్కు డిస్నీ పాత్రల ఫిర్యాదు
మిక్కీ మౌస్, మిన్నీ మౌస్, డొనాల్డ్ డక్‌ల వేషధారణతో పనిచేసే వాల్ట్ డిస్నీ వరల్డ్ ఉద్యోగులు.. తమను పర్యటకులు అసభ్యంగా తాకుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ పాత్రలు ధరించే ముగ్గురు మహిళా సభ్యులు.. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఆర్లాండో వద్ద గల థీమ్ పార్కుల్లో తమకు ఎదురైన చేదు అనుభవాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఒక బామ్మ తన తల మీద తట్టటంతో తాను గాయపడ్డానని మిక్కీ మౌస్ వేషం ధరించిన మహిళ చెప్పారు.
పర్యటకులు తమ శరీరాలను అసభ్యంగా తడిమారని మిన్నీ మౌస్, డొనాల్డ్ డక్ వేషాలు ధరించిన మహిళలు ఆరోపించారు.
ఈ మూడు సంఘటనల మీద ఆరెంజ్ కౌంటీ షరీఫ్ ఆఫీస్ దర్యాప్తు చేసింది. అయితే.. మిన్నీ మౌస్, డొనాల్డ్ డక్ వేషాలు ధరించిన మహిళలు ఆరోపణలు నమోదు చేయరాదని నిర్ణయించుకున్నట్లు అధికారులు చెప్పారు.
మిక్కీ మౌస్ వేషం ధరించిన మహిళకు.. ఆ సంఘటన సివిల్ వివాదమని, క్రిమినల్ కేసు కాదని పోలీసులు చెప్పారు.
డిస్నీ ప్రిన్సెస్ పాత్ర ధరించిన ఒక ఉద్యోగిని.. ఒక 51 ఏళ్ల వ్యక్తి తనతో ఫొటో దిగే సాకుతో తన వక్షోజాలను తాకాడని ఆరోపించటంతో నిందితుడిని గత నవంబర్‌లో అరెస్ట్ చేశారు. ఇప్పుడు తాజా సంఘటనలు వెలుగుచూశాయి.
''పనిచేసేటపుడు ప్రతి ఒక్కరికీ సురక్షితంగా ఉన్నామనే భావన ఉండాలి. డిస్నీ పాత్రలు ధరించే వాళ్లు ఎటువంటి అసౌకర్యవంతమైన పరిస్థితి ఎదురైనా ఫిర్యాదు చేయాలని మేం ప్రోత్సహిస్తున్నాం'' అని డిస్నీ అధికార ప్రతినిధి బీబీసీతో పేర్కొన్నారు.
''మా దగ్గర వేషధారణ చేసే ఉద్యోగుల సంక్షేమనికి, వారి భద్రతకు మేం అనేక వనరులు అందిస్తున్నాం. పనిచేసే ప్రాంతంలో అవసరమైనపుడు అందుబాటులో ఉండటానికి పోలీసు అధికారులు కూడా ఉంటారు'' అని తెలిపారు.
ఇటీవలి ఈ మూడు సంఘటనలు డిసెంబర్ 3, 4 తేదీల్లో జరిగాయని ఆర్లాండో సెంటినల్ తొలుత వెల్లడించింది.
మొదటి సంఘటన డిసెంబర్ 3న యానిమల్ కింగ్‌డమ్ దగ్గర ఒక రెస్టారెంట్‌లో జరిగింది. అప్పుడు పోలీసులను పిలిపించారు.
డొనాల్డ్ డక్ వేషధారణలో ఉన్న మహిళను.. ఓ 60 ఏళ్ల మహిళ ముద్దు పెట్టుకోవచ్చా అని అడగటంతో అందుకు ఆ పాత్రధారిణి అంగీకరించినట్లు పోలీసులు చెప్పారు.
అయితే.. ఆ వృద్ధురాలు డొనాల్డ్ డక్ పాత్రధారిణి అనుమతి లేకుండానే ఆమె శరీరం మొత్తం తడమటం ప్రారంభించిందని.. ఆమె అక్కడి నుంచి వెళ్లిపోవటానికి ప్రయత్నించగా సదరు మహిళ ఆమెను గట్టిగా పట్టుకుని ఆమె దుస్తుల్లోకి చేతులు పెట్టి ఆమె ధరించిన బ్రా మీదుగా ఛాతీని గట్టిగా తడిమిందని పేర్కొన్నారు.
కానీ.. ఆ వృద్ధ మహిళ డిమెన్షియా (మతిమరుపు)తో బాధపడుతున్నట్లు కనిపించిందని చెప్పిన డొనాల్డ్ డక్ పాత్ర ధారిణి.. ఆమె మీద కేసు నమోదు చేయలేదు.
మ్యాజిక్ కింగ్‌డమ్ థీమ్ పార్కు వద్ద మిక్కీ మౌస్ పాత్ర ధరించిన ఉద్యోగిని దగ్గరకు డిసెంబర్ 4న ఒక బామ్మ, ఆమె మనవరాలు, మనవడితో కూడిన ముగ్గురు కుటుంబ సభ్యులు వచ్చారు.
''మిక్కీ తనను తిరిగి కొట్టదని తన మనవడికి చూపించటం కోసం'' ఆ బామ్మ మిక్కీ మౌస్ తల మీద ఐదు సార్లు కొట్టింది.
దీనివల్ల తనకు మెడ నొప్పి కలిగిందని, ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నానని మిక్కీ మౌస్ పాత్రధారిణి పోలీసులకు చెప్పారు.
అయితే.. ఆ బామ్మకు తనను గాయపరచాలన్న ఉద్దేశం ఉన్నట్లుగా ఈ ఉద్యోగిని భావించలేదు. ఈ సంఘటన గురించి ఫిర్యాదు చేసినపుడు.. అది సివిల్ వివాదం అవుతుంది కానీ, క్రిమినల్ కేసు కాదని పోలీసులు బదులిచ్చారు.
అదే రోజు మాజిక్ కింగ్‌డమ్‌లోనే రెండో సంఘటన జరిగింది. మిన్నీ మౌస్ పాత్ర ధరిస్తున్న ఉద్యోగిని.. ఒక పురుషుడు అతడి భార్యతో కలిసి తనతో ఫొటో దిగేటపుడు తన ఛాతీని మూడు సార్లు అసభ్యంగా తాకాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆ సంఘటన రోజు తీసిన ఫొటోల ద్వారా ఆ 61 ఏళ్ల వ్యక్తిని మినిసొటా నివాసిగా గుర్తించారు. అతడు డిస్నీ వెకేషన్ క్లబ్ సభ్యుడని.. అతడి మీద సదరు ఉద్యోగిని ఆరోపణలు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.
అయితే.. ఆ 61 ఏళ్ల వ్యక్తి డిసెంబర్ 5వ తేదీన మరో డిస్నీ పాత్ర ధారిణితో అసభ్యంగా ప్రవర్తించటంతో అతడిని నిషేధించాలని డిస్నీ నిర్ణయించింది.
ఇవి కూడా చదవండి:
- మహిళల్లో 'సున్తీ': పలు దేశాల్లో నిషేధించినా భారత్లో ఎందుకు కొనసాగుతోంది
- మీతో అధికంగా ఖర్చు చేయించే బిజినెస్ ట్రిక్... దాదాపు అందరూ ఈ 'వల'లో పడే ఉంటారు
- శాండా బల్లి: మనుషుల 'మగతనం' కోసం ప్రాణాలు అర్పిస్తున్న ఎడారి జీవి
- ఫేస్బుక్కు ఒక కోడ్ పంపించారు.. భారీ మొత్తంలో నగదు బహుమతి కొట్టేశారు..
- భారత్లో ‘దేవతల గుహ’: వెళ్తే తిరిగిరాలేరు.. ఎందుకు? ఏముందక్కడ?
- ఏడాదిలో జార్ఖండ్ సహా ఐదు రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి నరేంద్ర మోదీ, అమిత్ షా వైఫల్యమా?
- మద్యం తాగేవాళ్లు తమ భార్యలు, గర్ల్ఫ్రెండ్స్ను హింసించే అవకాశం ‘ఆరు రెట్లు ఎక్కువ’
- క్రిస్మస్ కార్గో అద్భుతం: 60 మందిని తీసుకెళ్లేలా డిజైన్ చేసిన ఓడలో 14,000 మంది ఎక్కారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)