You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఐస్ బకెట్ చాలెంజ్ ద్వారా రూ. వందల కోట్లు సమీకరించిన పీట్ ఫ్రేటస్ మృతి
ఇటీవలి కాలంలో వైరల్‌గా మారిన 'ఐస్ బకెట్ చాలెంజ్'కు స్ఫూర్తినిచ్చిన మాజీ కాలేజ్ బేస్‌బాల్ స్టార్ పీట్ ఫ్రేటస్ అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన వయసు 34 సంవత్సరాలు.
ఆయన కొంతకాలంగా మోటార్ న్యూరాన్ వ్యాధిగా పిలిచే అబియోట్రోఫిక్ లేటరల్ సెలరోసిస్ (ఏఎల్ఎస్) లేదా లో జెహ్రిగ్స్ వ్యాధితో బాధపడుతున్నారు. ఫ్రేటెస్‌కు ఈ వ్యాధి ఉన్నట్లు 2012లో గుర్తించారు.
ఆయన సోమవారం (డిసెంబర్ 9వ తేదీ) కుటుంబ సభ్యుల మధ్య శాంతియుతంగా కన్నుముశారని ఆయన కుటుంబం ఒక ప్రకటనలో తెలిపింది. పీట్ అంత్యక్రియలు శుక్రవారం బోస్టన్‌లో జరిగాయి.
మోటార్ న్యూరాన్ వ్యాధి మీద ముఖ్యమైన పరిశోధనకు నిధులు సమకూర్చటానికి.. ఐస్ బకెట్ ఛాలెంజ్ లక్షలాది డాలర్ల విరాళాలను సమీకరించటం ద్వారా సాయపడింది.
''పీట్.. తన ధైర్యం, పోరాటం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందికి స్ఫూర్తినిచ్చారు'' అని ఆయన కుటుంబం పేర్కొంది.
''పీట్ సహజ సిద్ధమైన నాయకుడు.. సిసలైన టీంమేట్.. అందరికీ ఆదర్శం. ప్రత్యేకించి యువ క్రీడాకారులు.. ప్రతికూల పరిస్థితుల్లోనూ సాహసోపేతంగా, అచంచలమైన సానుకూల స్ఫూర్తిని ప్రదర్శించే పీట్‌ను మార్గదర్శిగా భావిస్తారు'' అని నివాళులర్పించింది.
అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రంలో గల బోస్టన్ కాలేజ్‌లో అగ్రశ్రేణి బేస్‌బాల్ క్రీడాకారుడు ఫ్రేటస్. ఆయన కాలేజీలో ఉన్న చివరి ఏడాది టీమ్ కెప్టెన్‌గా పనిచేశారు.
అనంతరం జర్మనీలో ప్రొఫెషనల్ బేస్‌బాల్ ఆడారు. తర్వాత అమెరికా తిరిగివచ్చి అమెచ్యూర్ లీగ్ పోటీల్లో ఆడారు.
2011లో ఒక ఆట సమయంలో స్వల్పంగా గాయపడ్డ తర్వాత.. ఆయనకు మోటార్ న్యూరాన్ వ్యాధి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మెదడు, వెన్నుపూసలోని నాడీ కణాల మీద ప్రభావం చూపటం ద్వారా.. శరీర కదలికలు లేకుండా పోయే వ్యాధి ఇది. దీనికి ఎటువంటి చికిత్సా లేదు.
ఐస్ బకెట్ చాలెంజ్ ఫ్రేటెస్‌తో మొదలుకాలేదు. కానీ.. 2014 వేసవిలో ఈ చాలెంజ్ మీద దేశవ్యాప్తంగా ప్రజలు దృష్టి సారించటానికి.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారటానికి ఆయన, ఆయన కుటుంబం దోహదం చేశారు.
ఈ చాలెంజ్ పూర్తిచేయటానికి.. జనం ఒక బకెట్ ఐస్ వాటర్‌ను తమ తల మీద పోసుకుని.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. అదే సమయంలో ఇతరులను కూడా ఇలా చేయటమో లేదంటే ఏఎల్ఎస్ పరిశోధనకు విరాళం ఇవ్వటమో చేయాలని చాలెంజ్ కూడా చేస్తారు. చాలా మంది ఈ రెండు పనులూ చేశారు.
ఫేస్‌బుక్‌లో 1.7 కోట్ల మందికి పైగా జనం ఐస్ బకెట్ చాలెంజ్ వీడియోలు అప్‌లోడ్ చేశారు.
మాజీ దేశాధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్, ఒప్రా విన్‌ఫ్రే, లేడీ గాగా, ప్రస్తుత దేశాధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వంటి ఉన్నతస్థాయి ప్రముఖులు కూడా ఈ చాలెంజ్‌లో పాల్గొన్నారు.
ఏఎల్ఎస్ అసోసియేషన్ కథనం ప్రకారం.. ఈ చాలెంజ్ ద్వారా 2014లో ఎనిమిది వారాల కాలంలో 11.5 కోట్ల డాలర్ల (రూ.812 కోట్లకు పైగా) విరాళాలు లభించాయి.
మరికొందరు ఈ చాలెంజ్ ద్వారా 22 కోట్ల డాలర్ల (రూ. 1,555 కోట్ల) వరకూ విరాళాల వెల్లువెత్తాయని అంచనా వేస్తారు.
ఫ్రేటస్ మరణం పట్ల ఏఎల్ఎస్ స్పందిస్తూ.. ''ఏఎల్‌ఎస్ దిశను పీట్ ఫ్రేటస్ సమూలంగా మార్చేశారు. ఒక ప్రాణాంతక వ్యాధితో జీవించటం ఎలా అనేది ప్రపంచానికి చూపారు. ఐస్ బకెట్ చాలెంజ్‌ను నడిపించటానికి ఆయన చేసిన కృషి ఏఎల్ఎస్ చికిత్సకు, నయంచేయటానికి జరిగే పరిశోధనల మీద గణనీయమైన ప్రభావం చూపింది'' అని ట్వీట్ చేసింది.
ఐస్ బకెట్ చాలెంజ్ ద్వారా లభించిన విరాళాలు.. మెటార్ న్యూరాన్ వ్యాధికి కారణమయ్యే ఒక జన్యువును గుర్తించటానికి సాయపడ్డాయని ఏఎల్ఎస్ అసోసియేషన్ పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- హ్యూమన్ రైట్స్ డే: మనిషిగా మీ హక్కులు మీకు తెలుసా...
- రూ. 65 కోట్ల విలువ చేసే అరుదైన విస్కీ వేలానికి సిద్ధమవుతోంది
- కశ్మీర్ వేర్పాటువాది మక్బూల్ భట్: ఒక వ్యక్తిని ఉరి తీసి, జైలులోనే ఖననం చేయడం తీహార్ జైలు చరిత్రలో అదే తొలిసారి
- పౌరసత్వ సవరణ బిల్లు రాజ్యాంగ ఉల్లంఘనా? శరణార్థికి, చొరబాటుదారుడికి అమిత్ షా ఇచ్చిన నిర్వచనం సరైనదేనా?
- పానిపట్ సినిమా వివాదం: 'అతడి నీడ పడిన చోట మృత్యువు కాటేస్తుంది'
- నాడు మూడు అడుగుల లోతులో పాతిపెడితే సజీవంగా బయటపడిన పసిపాప ఆరోగ్యం ఇప్పుడు భేష్
- ఎవరీ బోరిస్ జాన్సన్? ఒక జర్నలిస్టు.. బ్రిటన్ ప్రధాని ఎలా అయ్యారు?
- మోదీ నీడ నుంచి బయటపడి అమిత్ షా తనదైన ఇమేజ్ సృష్టించుకున్నారా?
- ఓ గుహలో దొరికిన 44 వేల ఏళ్ళ నాటి అతి పురాతన పెయింటింగ్ ఏం చెబుతోంది...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)