You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
World Kindness Day: ఇతరుల పట్ల ప్రేమ, దయ చూపితే ఎక్కువ కాలం జీవిస్తారు ఎందుకు?
- రచయిత, లారెన్ టర్నర్
- హోదా, బీబీసీ న్యూస్ ప్రతినిధి
ఇతరుల పట్ల ప్రేమ, దయ, కరుణ చూపడం వల్ల మన జీవిత కాలాన్ని పెంచుకోవచ్చని తాజా పరిశోధన చెబుతోంది.
దయాగుణం కలిగిన వ్యక్తుల పనులు ఇతరులను ఎలా ప్రభావితం చేస్తాయి? మరింత మంది కరుణా హృదయులుగా మారేందుకు ఎలా ప్రేరేపిస్తాయి? అలా ఇతరుల నుంచి 'సంక్రమించిన దయాగుణం' ఎలా పనిచేస్తుంది? వంటి విషయాలపై కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన బెడారి కైండ్‌నెస్ ఇన్‌స్టిట్యూట్ సిబ్బంది అధ్యయనం చేశారు.
"ప్రస్తుతం మనం దయా, కరుణ అన్నవి ఏమాత్రం లేని యుగంలో జీవిస్తున్నామని అనడంలో ఎలాంటి సందేహం లేదని నా భావన. ఎందుకంటే, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా రాజకీయ, మతపరమైన అంశాలలో విరుద్ధ అభిప్రాయాలున్న వ్యక్తుల మధ్య ద్వేషాలు, సంఘర్షణలు పెరిగిపోతున్నాయి" అని ఇన్‌స్టిట్యూట్ మాజీ డైరెక్టర్ డేనియల్ ఫెస్లర్ అన్నారు.
"ఉపకారం చేయడం అంటే, ఎదుటి వారికి సాయం అందిస్తున్నాం అన్నది మాత్రమే కాదు, దాని వల్ల మనలో సానుకూల భావనలు పెరగడం ద్వారా మనకు తెలియకుండానే ఎన్నో ప్రయోజనాలు పొందుతాం. దయాగుణం లేనివారు ఇతరుల క్షేమం గురించి ఏమాత్రం పట్టించుకోరు. ఎవరెలా పోతే మాకేంటని అనుకుంటారు. వారు నలుగురిలో కలవరు" అని ఆయన వివరించారు.
"మీ క్షేమం, బాగోగుల గురించి ఏమాత్రం పట్టించుకోని వ్యక్తులతో కలిసి ఉండటం, స్నేహం చేయడం మంచిది కాదు. అలాంటి రిలేషన్ మీ జీవిత కాలాన్ని తగ్గిస్తుంది" అని ఫెస్లర్ అంటున్నారు.
"దయాగుణాన్ని చూపించేవారు, వారి సాయం పొందేవారు ఇద్దరూ ఒత్తిడిని దూరం చేసుకునే వీలుంటుంది. ఎదుటి వ్యక్తి బాగోగులను పట్టించుకునేవారితో స్నేహం చేయడం చాలా మంచిది" అని ఆయన చెప్పారు.
‘బాగున్నారా?’ అని పలకరించడం కూడా ఎదుటి వ్యక్తి ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
దయాగుణాన్ని ఇచ్చిపుచ్చుకోవడం వల్ల రక్తపోటును కూడా అదుపులో పెట్టుకోవచ్చని.. డిప్రెషన్, ఆందోళన లాంటి రుగ్మతలకు అదో చికిత్సగా పనిచేస్తుందని ఫెస్లర్ వివరించారు.
ఈ పరిశోధనల కోసం బెడారి కైండ్‌నెస్ ఇన్‌స్టిట్యూట్‌కు బెడారి ఫౌండేషన్ 20 మిలియన్ డాలర్ల గ్రాంటును మంజూరు చేసింది.
ఆధునిక ప్రపంచంలో ప్రజల్లో దయాగుణం ఎందుకు లేకుండాపోతోంది? అన్న అంశాలను తెలుసుకునేందుకు, ఆధ్యాత్మికతకు సైన్స్‌కు మధ్య దూరాన్ని తగ్గించేందుకు పరిశోధన చేయాల్సి వచ్చిందని పరిశోధకుడు హ్యారిస్ చెప్పారు.
ఈ ఇన్‌స్టిట్యూట్ చేపట్టిన ప్రాజెక్టుల్లో కొన్ని:
- ప్రజల్లో దయాగుణం ఒకరి నుంచి మరొకరికి ఎలా వ్యాప్తి చెందుతుందన్న విషయాన్ని పరిశోధకులు పరిశీలిస్తున్నారు.
- ఎందుకు కొందరు వ్యక్తులు ఏమాత్రం కరుణ లేకుండా ప్రవర్తిస్తారు? అన్న అంశంపై లోతైన పరిశోధన జరుగుతోంది.
- దయాగుణం మన మూడ్‌ను ఎలా మెరుగుపరుస్తుంది? డిప్రెషన్ లక్షణాలను ఎలా తగ్గిస్తుంది? అన్న విషయాలపై మానసిక శాస్త్ర పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు.
అనేక ప్రయోజనాలు
"రోగనిరోధక వ్యవస్థ మెరుపడేందుకు, రక్తపోటును నియంత్రించేందుకు, ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతికేందుకు దయాగుణం ఎంతగానో ఉపయోగపడుతుంది. అది ఓవర్ డోస్ అయ్యే అవకాశమే ఉండదు" అని కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ కెల్లీ హార్డింగ్ వివరించారు.
ఇది ఎంతో ముఖ్యమైన విషయం, దీని గురించి ప్రపంచమంతా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.
ఎదుటి వారిపట్ల దయాగుణాన్ని చూపించడం చాలా సులువని ఆమె అంటున్నారు. ‘‘పాఠశాల, కార్యాలయం, ఇలా ఎక్కడైనా సరే ఎదుటి వారిపట్ల కరుణ చూపండి, ఉపకారం చేసేందుకు ప్రయత్నించండి. అది మీతో పాటు మీ నుంచి సాయం పొందేవారి ఆరోగ్యాన్నీ మెరుగుపరుస్తుంది’’ అని ఆమె సూచిస్తున్నారు.
పట్టణీకరణ పెరగడం కారణంగా చాలామందిలో దయ, కరుణ అనేవి తగ్గిపోతున్నాయని యూసీఎల్‌ఏ సోషల్ సైన్సెస్ విభాగం బాధ్యుడు డార్నెల్ హంట్ అంటున్నారు.
"పట్టణీకరణ వల్ల మనుషుల మధ్య ముఖాముఖి సంభాషణలు తగ్గిపోయాయి. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే, మనం ఈ విషయంలో వెనక్కి వెళ్లాల్సిన అవసరం ఉందనిపిస్తోంది. మనల్ని మనుషులుగా మార్చే విషయాలను విశ్లేషించాల్సిన అవసరం ఉందనిపిస్తోంది" అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి.
- పెగాసస్ స్పైవేర్: మీకు తెలీకుండానే మీ ఫోన్‌ను హ్యాక్ చేస్తుంది
- గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదా, కాదా
- మీ మైండ్‌ని రీఛార్జి చేయడానికి ఐదు మార్గాలు
- వెయ్యేళ్ల నాటి ఈ అస్థిపంజరం కోసం నాజీలు, సోవియట్లు ఎందుకు పోరాడారు?
- వరల్డ్ వీగన్ డే: ఏ ప్రాణినీ ఇబ్బంది పెట్టని ఆహారం
- ఎక్కడ ఉంటే ఎక్కువ ఆరోగ్యం? పల్లెల్లోనా, పట్టణాల్లోనా?
- చైనాలో 5జీ నెట్వర్క్ ప్రారంభం... ప్రపంచ టెక్నాలజీలో భారీ ముందడుగు
- RCEP అంటే ఏమిటి? మోదీ ఈ ఆర్థిక బృందంలో చేరితే భారత్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
- చైనాలోని ఆకర్షణీయమైన గాజు వంతెనలను ఎందుకు మూసేస్తున్నారు?
- ఒకప్పుడు ఆరోగ్యం కోసం చేసుకున్న అలవాటే ఇప్పుడు ప్రాణాలు తీస్తోంది
- పిల్లల మలంతో చేసిన డ్రింక్ తాగుతారా - ఇది ఆరోగ్యానికి చాలా మంచిది
- ప్రపంచ ఆరోగ్య దినం: మీరు 1990 తర్వాత పుట్టారా?
- మహిళల ఆరోగ్యం: ఇంటిపని చేయడం వ్యాయామం కిందకు వస్తుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)