మీ ఆహార వృథాను అరికట్టటానికి ఆరు మార్గాలు: ప్రపంచ ఆకలిని తగ్గించటంలో మీ వంతు పాత్ర పోషించండిలా...

ప్రతి ఏటా 1300 కోట్ల టన్నుల ఆహారం వృథా అవుతోంది. అందులో చాలా వరకూ వ్యర్థాల కుప్పగా పోగుపడుతూ వాతావరణ మార్పుకూ ఒక కారణమవుతోంది.

మానవాళి ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల్లో ఆహార వృధా ఒకటి'' అంటారు న్యూయార్క్ చెఫ్ మాక్స్ లా మన్నా.

ఆయన ''మోర్ ప్లాంట్స్, లెస్ వేస్ట్ (అధిక మొక్కలు - తక్కువ వృధా)'' అనే పుస్తకం రాశారు. ఆహార వృధాను అరికట్టటం ద్వారా మార్పులో మనవంతు పాత్ర పోషించటమెలా అనేది ఆయన చెప్తున్నారు.

నా జీవితంలో ఆహారమనేది ఎల్లప్పుడూ ప్రధాన దినుసుగానే ఉంది. నా తండ్రి కూడా ఒక చెఫ్‌. అందువల్ల నేను ఆహార ప్రపంచంలోనే పెరిగాను.

ఎన్నడూ ఆహారాన్ని వృధా చేయవద్దని నా తల్లిదండ్రులునాకు ఎప్పుడూ బోధిస్తుండేవారు. దాదాపు 900 కోట్ల మంది జనాభా ఉన్న భూగోళం మీద.. మనం ప్రతి స్థాయిలోనూ ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నాం. ప్రపంచంలో 82 కోట్ల మందికి పైగా ప్రజలకు తగినంత ఆహారం లభించటం లేదు.

ప్రపంచంలో ఉత్పత్తి చేస్తున్న మొత్తం ఆహారంలో మూడో వంతు ఆహారం వృధా కావటమో, కోల్పోవటమో జరుగుతోంది.

ఆహార వృధా అంటే అర్థం కేవలం వృధా అయిన ఆహారం అనే కాదు. దాని అర్థం.. డబ్బులు వృధా అవటం, నీరు వృధా అవటం, ఇంధనం వృధా అవటం, భూమి వృధా అవటం, రవాణా వృధా అవటం.

మీ ఆహారాన్ని పారవేయటం.. వాతావరణ మార్పుకు కూడా దోహదపడవచ్చు. పారేసిన ఆహారాన్ని తరచుగా భారీ చెత్తకుప్పల్లోకి పంపిస్తారు. అది అక్కడ కుళ్లిపోయి మీథేన్ వాయువును ఉత్పత్తి చేస్తుంది.

ఆహార వృధా అనేది ఒక దేశం అయితే.. వాతావరణానికి చేటు చేసే గ్రీన్‌హౌస్ వాయువులను విడుదల చేస్తున్న దేశాల్లో.. అమెరికా, చైనాల తర్వాత అదే మూడో అతి పెద్ద దేశంగా నిలుస్తుంది.

ఈ పరిస్థితిని మార్చటానికి మనం ఏం చేయగలమో చూద్దాం...

1) తెలివిగా షాపింగ్ చేయటం...

చాలా మంది తమకు అవసరమైన దానికన్నా ఎక్కువ కొనటానికి మొగ్గుచూపుతుంటారు.

కొనాల్సిన సరుకుల జాబితాను తయారు చేసుకుని, ఆ జాబితాలో మీకు అవసరమైన వాటినే కొనండి.

మళ్లీ సరుకులు కొనే ముందుగా.. అంతకుముందు కొన్న ఆహార పదార్థాలన్నిటినీ వాడేయండి.

2) ఆహారాన్ని సక్రమంగా నిల్వచేయటం...

ఆహారాన్ని సరిగా నిల్వచేయకపోతే భారీ స్థాయిలో వృధా అవుతుంది. పండ్లు, కూరగాయలను ఎలా నిల్వ చేయాలనేది చాలా మందికి తెలియదు. దానివల్ల అవి త్వరగా మగ్గిపోయి పాడైపోతుంటాయి.

ఉదాహరణకు.. బంగాళాదుంపలు, టొమాటోలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, దోసకాయలను అసలు ప్రిజ్‌లో పెట్టకూడదు. వీటిని గది ఉష్ణోగ్రతలోనే ఉంచాలి.

ఇక ఆకుకూరల కాడలను నీటిలో ఉంచటం ద్వారా నిల్వచేసుకోవచ్చు.

బ్రెడ్ - రొట్టెను గడువులోగా వాడేయలేమని భావిస్తే ఫ్రిజ్‌లో నిల్వచేయాలి.

దుకాణంలో కానీ, నేరుగా రైతుల దగ్గర నుంచి కానీ సరుకులను కొనేటపుడు స్వల్ప తేడాలు ఉన్న వాటిని ఏరుకోవటం ద్వారా.. అవి వృధా కాకుండా చూడటంలో మీ వంతు పాత్ర పోషించండి.

3) మిగిలిన ఆహారాన్ని దాచుకోవటం...

తినగా మిగిలిన ఆహారాన్ని దాచి.. వాటిని తర్వాత తినాలి.

మీరు ఎక్కువ మోతాదులో వండుతుంటే.. తరచుగా ఆహారం మిగులుతుంటే.. వాటిని ఫ్రిజ్‌లో పెట్టి ఒక రోజు వాటిని మాత్రమే ఉపయోగించేలా ప్రణాళిక అమలు చేయండి.

ఆహారం పారవేయకుండా ఉండే మంచి మార్గం ఇది. అంతేకాదు.. దీనివల్ల సమయం, డబ్బు కూడా ఆదా అవుతుంది.

4) ఫ్రిజ్‌తో స్నేహం చేయటం...

ఆహారాన్ని నిల్వ చేయటానికి దానిని ఫ్రిజ్‌లో ఫ్రీజ్ చేయటం అతి సులభమైన మార్గాల్లో ఒకటి. ఫ్రిజ్‌లో చక్కగా నిల్వ ఉండే ఆహారాలు అనేకం ఉన్నాయి.

సలాడ్‌లో ఉపయోగించే అతి మృదువైన ఆకుకూరలను ఫ్రీజర్‌లో సేఫ్ బ్యాగ్‌లు లేదా టిన్నుల్లో పెట్టి నిల్వ చేసుకోవచ్చు. మనకు అవసరమైనపుడు వాటిని వాడుకోవచ్చు.

ఆకుకూరలు ఎక్కువగా ఉన్నట్లయితే.. వాటికి ఆలివ్ ఆయిల్, వెల్లుల్లి ముక్కలు కలిపి ఐస్‌ క్యూబ్ ట్రేలలో ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత రుచికరమైన వంటలతో పాటు వాడుకోవచ్చు.

భోజనంలో మిగిలిపోయిన ఆహారాన్ని, ఇంటి తోటలో అధికంగా ఉత్పత్తి అయిన కూరగాయలను కూడా ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఆరోగ్యవంతమైన, ఇంట్లో వండుకున్న ఆహారం ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోవచ్చు.

5) సొంత ఆహారాన్ని వెంట తీసుకెళ్లటం...

విధుల్లో ఉన్నపుడు మధ్యాహ్నాలు సహోద్యోగులతో బయటకు వెళ్లి భోజనాలు చేయటం, ఇష్టమైన రెస్టారెంట్‌కి వెళ్లి తినటం ఆహ్లాదకరమే అయినా.. అది ఖరీదైన వ్యవహారం. ఆహార వృధాకు కూడా కారణమవుతుంది.

మీ కర్బన పాదముద్రను తగ్గించటంతో పాటు డబ్బును ఆదా చేసుకునే మార్గం.. ఆఫీసుకో, పనిచేయటానికో వెళ్లేటపుడు మీ సొంత ఆహారాన్ని మీ వెంట తీసుకెళ్లటం.

ఒకవేళ ఉదయం మీకు అంత సమయం లేదనుకుంటే.. రాత్రి మిగిలిన ఆహారాన్ని లంచ్ బాక్సుల్లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచి ఉదయం మీతో తీసుకెళ్లవచ్చు.

ఇలాచేయటం ద్వారా.. ఇష్టమైన, ఆరోగ్యవంతమైన ఆహారం ప్రతి రోజూ మీకు సిద్ధంగా ఉంటుంది.

6) కంపోస్ట్ చేయటం...

మిగిలిపోయిన ఆహారాన్ని కంపోస్ట్ చేయటం ద్వారా.. వృధా అయ్యే ఆహారాన్ని మొక్కలకు శక్తినిచ్చే ఎరువుగా మార్చవచ్చు.

అయితే.. ఆరుబయట కంపోస్టింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసుకునేంత ఖాళీ అందరికీ ఉండకపోవచ్చు. కానీ.. ఇంట్లోనే ఏర్పాటు చేసుకోగల కంపోస్టింగ్ వ్యవస్థలు అనేకం ఉన్నాయి. వాటిద్వారా ప్రతి ఒక్కరూ.. చాలా పరిమితమైన ప్రదేశంలోనూ సులభంగా ఈ ప్రక్రియ చేయవచ్చు.

పెద్ద తోట ఉన్న వారికి పెరటిలో కంపోస్టింగ్ వ్యవస్థ బాగా ఉపయోగపడుతుంది. నగర వాసులకు కౌంటర్‌టాప్ కంపోస్టర్లు ఇంటి మొక్కలకు ఉపయోగపడతాయి.

చిన్న చర్యలు.. పెద్ద ఫలితాలు...

చివరిగా చెప్పేదేమంటే.. మనమందరం ఆహార వృధాను అరికట్టవచ్చు. అందుకు ఎన్నో మార్గాలున్నాయి. మన ఇంట్లో ప్రతి రోజూ పారవేసే ఆహారం గురించి ఆలోచించటం ద్వారా.. భూమి మీద అత్యంత విలువైన వనరులను సంరక్షించటంలో సానుకూల మార్పు తీసుకురావటానికి దోహదపడగలం.

మనం ఆహారం కొనే పద్ధతిలో, వండే పద్ధతిలో, వినియోగించే పద్ధతిలో స్వల్ప మార్పులతో పర్యవారణం మీద మనం చూపే ప్రతికూల ప్రభావాన్ని తగ్గించవచ్చు. అది అంత కష్టమేమీ కాదు.

చిన్న ప్రయత్నంతో ఆహార వృధాను గణనీయంగా తగ్గించటమే కాదు.. సమయం, డబ్బును కూడా ఆదా చేయవచ్చు. ప్రకృతి మాత మీద కొంత ఒత్తిడిని తగ్గించటానికి తోడ్పడవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)