You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తిరువళ్లువర్ విభూతిపై తమిళనాడులో వివాదం ఎందుకు రేగింది?
బీజేపీ తమిళనాడు విభాగం కొన్ని రోజుల క్రితం తమిళ ప్రాచీన కవి తిరువల్లువర్ చిత్రంతో ఓ ట్వీట్ చేసింది. తిరువల్లువర్ నుదుటికి, భుజాలకు విభూతి, బొట్లు.. మెడలో రుద్రాక్ష దండతో ఉన్నట్లుగా అందులో చూపించారు.
తిరువళ్లువర్ పద్యాన్ని, దాని గురించి వ్యాఖ్యానాన్ని కూడా జత చేసి ఆ ట్వీట్‌లో పెట్టారు.
''ఎంత చదువుకున్నా.. దేవుడు, దైవంపై నమ్మకంగలవారి గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఏం లాభం?'' అని ఆ వ్యాఖ్యానం అర్థం.
''ఏనాడో తిరువళ్ళువర్ చెప్పిన ఈ విషయం నుంచి ద్రవిడ కళగం, డీఎంకే, కమ్యూనిస్టులు, వాటి అనుకూల మీడియా పాఠాలు నేర్చుకోవాలి'' అని కూడా రాశారు.
ఆ వ్యాఖ్యానం కన్నా, బీజేపీ పోస్ట్ చేసిన ఆ తిరువల్లువర్ చిత్రంపైనే వివాదం రేగింది.
రెండు వేల ఏళ్ల క్రితం నాటి తిరువల్లువర్.. ఇలా ఉండొచ్చని చెప్పే చిత్రమేదీ లేదు. ఆయన గురించి వేసే చిత్రాలన్నీ కల్పనలే.
రాసిన పద్యాలను బట్టి తిరువళ్ళువర్‌కు దైవనమ్మకం ఉన్నట్లు కనిపిస్తున్నా, సాధారణంగా ఆయన చిత్రాలపై మతపరమైన గుర్తులేవీ కనిపించవు. ఆయన ఏ మతానికి చెందినవారన్నది స్పష్టంగా తెలియదు.
బీజేపీ ఆ ట్వీట్‌లో తిరువల్లువర్‌ను శైవ మతస్థుడిగా చిత్రించిందంటూ కొందరు సోషల్ మీడియాలో అభ్యంతరం వ్యక్తం చేశారు.
#bjpinsultsthiruvalluvar (బీజేపీ తిరువళ్లువర్‌ను అవమానించింది) హ్యాష్‌ట్యాగ్ ట్విటర్‌లో ట్రెండ్ అయ్యింది.
బీజేపీ సమర్థకులు మాత్రం ఆ ట్వీట్‌ను సమర్థించారు.
ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆదివారం ఉదయం తంజావూరు జిల్లాలోని పిల్లైయార్‌పట్టి ప్రాంతంలో ఓ తిరువళ్లువర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
విగ్రహం ముఖం, మెడ భాగంలో పేడ పూశారు.
దీంతో స్థానిక గ్రామ ప్రజలు కొందరు, మరో బృందం ఆ విగ్రహం ముందు నిరసనకు దిగారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. విధ్వంసానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
తిరువళ్లువర్ సుమారు 2050 ఏళ్ల క్రితం తమిళనాడులో జీవించి ఉంటారని అంచనా. ఆయన తిరుక్కురళ్ అనే పుస్తకాన్ని రాశారు. అందులో 133 అధ్యాయాలు, 1330 పద్యాలు ఉన్నాయి.
నైతిక విలువల గురించి పాఠాలకు పేరు పొందిన తిరుక్కురళ్‌ను... తమిళంలో అత్యంత విలువైన సాహితీ సంపదల్లో ఒకటిగా భావిస్తారు.
ఇవి కూడా చదవండి.
- అబ్దుల్లాపూర్‌మెట్: ‘భూ వివాదంతోనే తహశీల్దారు విజయ రెడ్డిని సజీవ దహనం చేసిన సురేశ్’
- ఇక చరిత్రను తిరగరాయాల్సిందేనా?
- భూపత్ డాకూ: భారత్ నుంచి పారిపోయిన ఈ దోపిడీ దొంగకు పాకిస్తాన్ ఆశ్రయం ఇచ్చింది
- పిడికెడు మిరపకాయలు, గుప్పెడు అన్నం... అయిదేళ్లు ఆదే ఆమె ఆహారం
- అమిత్ షా వ్యాఖ్యలపై నిరసనలు: అసలు భారతదేశ జాతీయ భాష ఏమిటి? అధికార భాషలు ఏవి?
- ఇదో బానిసల మార్కెట్... వేలాది మహిళలను ఆన్లైన్లో అమ్మేస్తున్నారు: బీబీసీ రహస్య పరిశోధన
- తొలి రాత్రే అనుమానం... మహిళలను మానసికంగా చంపేస్తున్న ‘రక్త పరీక్షలు’
- పెరియార్ : దక్షిణాది రాష్ట్రాలు భారతదేశంలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు
- మెక్ డోనల్డ్స్ బర్గర్లు: పదేళ్లైనా పాడవలేదు.. బూజు పట్టలేదు.. ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)