హార్లే డేవిడ్సన్ '‌లైవ్‌వైర్' ఎలక్ట్రిక్ బైక్‌ల ఉత్పత్తి నిలిపివేత

అమెరికాకు చెందిన ప్రఖ్యాత మోటారుసైకిల్ సంస్థ 'హార్లే-డేవిడ్సన్' ఎలక్ట్రిక్ మోటార్‌బైక్‌ల ఉత్పత్తిని నిలిపివేసింది. బైక్ ఛార్జింగ్ వ్యవస్థలో సమస్యను గుర్తించిన తర్వాత ఈ చర్య తీసుకొంది.

ఈ సంస్థ తొలిసారిగా తీసుకొచ్చిన ఈ విద్యుత్ బైక్ పేరు 'లైవ్‌వైర్'. 105 హార్స్‌పవర్ సామర్థ్యమున్న ఈ బైక్ ఖరీదు దాదాపు 26.28 లక్షల రూపాయలు (28,995 పౌండ్లు).

హార్లే-డేవిడ్సన్ సెప్టెంబరులో అమెరికాలోని డీలర్లకు బైక్‌ల సరఫరాను మొదలుపెట్టింది.

ఇప్పటికే సరఫరా చేసిన బైక్‌లు సురక్షితమైనవేనని సంస్థ స్పష్టం చేసింది. అయితే వీటిని ఇళ్లలో తక్కువ వోల్టేజ్ ఔట్‌లెట్లతో కాకుండా తప్పనిసరిగా డీలర్‌షిప్‌ కేంద్రాల వద్ద ఛార్జ్ చేయాలని చెప్పింది.

బైక్ ఛార్జింగ్‌కు గంట పడుతుంది. ఒకసారి చార్జ్ చేస్తే తక్కువ వేగంతోనైతే 235 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంది.

ఛార్జింగ్ వ్యవస్థలో సమస్య సాధారణంగా రాదని రాయిటర్స్ వార్తాసంస్థతో హార్లే-డేవిడ్సన్ సోమవారం చెప్పింది. ఉత్పత్తి తిరిగి ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేదు.

అమెరికాలో గత నెల్లోనే సరఫరా మొదలు

2014: ఎలక్ట్రిక్ బైక్‌ను ఉత్పత్తి చేయాలనే సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించిన హార్లే-డేవిడ్సన్

2018: లైవ్‌వైర్ బైక్ వివరాల వెల్లడి

2019 జనవరి: అమెరికాలో ముందస్తు ఆర్డర్ల స్వీకరణ మొదలు

2019 ఏప్రిల్: బ్రిటన్లో ముందస్తు ఆర్డర్ల స్వీకరణ

2019 సెప్టెంబరు: అమెరికాలోని డీలర్లకు విద్యుత్ బైక్‌ల సరఫరా

2019 అక్టోబరు: విద్యుత్ బైక్‌ల ఉత్పత్తి నిలిపివేత

విద్యుత్ కార్ల ప్రాజెక్టును రద్దు చేసుకున్న బ్రిటన్ సంస్థ

గత వారం బ్రిటన్ సంస్థ డైసన్ ఎలక్ట్రిక్ కారును అభివృద్ధి చేయాలనే ప్రాజెక్టును రద్దు చేసుకుంటున్నామని ప్రకటించింది. ఈ కారుపై దాదాపు 256 కోట్ల డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టాలని సంస్థ మొదట్లో ప్రణాళిక వేసుకుంది. అయితే వాణిజ్యపరంగా ఇది సాధ్యమయ్యే ప్రాజెక్టు కాదంటూ రద్దు చేసుకుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)