You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బంగ్లాదేశ్ ఆర్థిక వృద్ధిలో దక్షిణాసియా పెద్దపులిగా మారనుందా...
పాకిస్తాన్ బంగ్లాదేశ్ కంటే అయిదు రెట్లు పెద్ద దేశం. కానీ, పాకిస్తాన్ కంటే బంగ్లాదేశ్ వద్ద అయిదు రెట్లు ఎక్కువ విదేశీ మారక ద్రవ్య నిల్వలున్నాయి.
పాకిస్తాన్ విదేశీ మారకద్రవ్య నిల్వలు 800 కోట్ల డాలర్లు కాగా బంగ్లాదేశ్ వద్ద 3,500 కోట్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలున్నాయి. దీంతో, బలపడుతున్న బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థను దక్షిణాసియా పెద్దపులితో పోల్చుతూ ప్రపంచ దేశాలు ప్రశంసిస్తున్నాయి.
బంగ్లాదేశ్ ఆర్థికాభివృద్ధి రేటు 8 శాతం కాగా అదే సమయంలో భారత్ ఆర్థిక వృద్ధి రేటు 5 శాతానికి పడిపోయింది. పాకిస్తాన్ వృద్ధి రేటు కూడా 5 నుంచి 6 శాతం మధ్య ఉంది.
ఇక రుణాల విషయానికొస్తే ప్రతి బంగ్లాదేశ్ పౌరుడిపై సగటున 434 డాలర్ల అప్పు ఉండగా.. పాకిస్తాన్‌లో తలసరి అప్పు 974 డాలర్లు ఉంది.
ప్రపంచ ఆర్థిక సదస్సులో బంగ్లాదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి మాట్లాడుతూ.. తమ దేశం నుంచి 120 సంస్థల ద్వారా 35 దేశాలకు 100 కోట్ల డాలర్ల ఐటీ ఎగుమతులున్నాయని చెప్పారు. 2021 నాటికి తమ ఐటీ ఎగుమతులు 500 కోట్ల డాలర్లకు పెరుగుతాయన్నారు.
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా 2009లో 'డిజిటల్ బంగ్లాదేశ్' పేరుతో ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సేవలను డిజిటల్ ప్లాట్‌ఫాంలోకి తేవడమే కాకుండా దేశంలో ఐటీ రంగ విస్తరణకు పునాదులు వేశారు.
బంగ్లాదేశ్ భారత్‌కు భాగస్వామా? పోటీ దేశమా?
బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఏమంత గొప్పగా లేవు. భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య మాత్రం ఇప్పటివరకు మంచి సంబంధాలే ఉన్నాయి. షేక్ హసీనా అక్టోబరు 3 నుంచి నాలుగు రోజుల పర్యటన కోసం భారత్ బయలుదేరడానికి ముందు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆమెకు ఫోన్ చేశారు. కశ్మీర్ విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా అన్ని ముస్లిం దేశాల మద్దతు కూడగట్టే ప్రయత్నంలో ఆయన ఆమెకు ఫోన్ చేశారు. కానీ, బంగ్లాదేశ్.. కశ్మీర్ విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించలేదు, అలా అని బహిరంగంగా దానికి మద్దతూ ఇవ్వలేదు. కశ్మీర్ అంశం రగులుతున్న సమయంలో ఆమె భారత్‌కు వచ్చారంటేనే ఆ దేశం దాన్ని వ్యతిరేకించడం లేదనడానికి నిదర్శనమన్న వాదనలున్నాయి.
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ప్రస్తుతం 18,000 కోట్ల డాలర్ల విలువైన బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ 2021 నాటికి 32,200 కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది. ఆ లెక్కన చూసినా ఇప్పటికే సగటున ప్రతి బంగ్లాదేశ్ పౌరుడూ సగటు పాకిస్తానీ కంటే ధనికుడే.
1951 జనాభా లెక్కల ప్రకారం అప్పటికి తూర్పు పాకిస్తాన్‌గా ఉన్న ప్రస్తుత బంగ్లాదేశ్ జనాభా 4.2 కోట్లు కాగా అప్పటి పశ్చిమ పాకిస్తాన్ (ప్రస్తుత పాకిస్తాన్) జనాభా 3.37 కోట్లు. ప్రస్తుతం పాకిస్తాన్ జనాభా ఏకంగా 20 కోట్లకు చేరుకోగా బంగ్లాదేశ్ జనాభా 15.5 కోట్ల దగ్గర ఉంది.
బంగ్లాదేశ్ తన దేశ జనాభాను నియంత్రించుకున్న స్థాయిలో పాకిస్తాన్, భారత్‌లు నియంత్రించలేకపోయాయి. ఆక్స్‌ఫర్డ్ ఇంటర్నెట్ ఇనిస్టిట్యూట్ ప్రకారం ప్రపంచంలో ఆన్‌లైన్ బలగంలో రెండో అతి పెద్ద దేశం బంగ్లాదేశే. దక్షిణాసియాలో భారత్‌ను సవాల్ చేసే స్థాయిలో బంగ్లాదేశ్ ఉందని ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ అభిప్రాయపడింది.
బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ
బంగ్లాదేశ్ ఆర్థిక వృద్ధిలో పారిశ్రామిక రంగానికి కీలక పాత్ర. అదేసమయంలో భారత ఆర్థిక వ్యవస్థలో సేవారంగానిది కీలకపాత్ర. భారత్‌లో పారిశ్రామిక వృద్ధి రేటు దాదాపు తిరోగమనంలో ఉంది. భారతదేశ జనాభాలో చాలామంది వ్యవసాయంపైనే ఆధారపడుతున్నప్పటికీ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ భాగస్వామ్యం ఏటా క్షీణిస్తోంది.
ఇక బంగ్లాదేశ్ విషయానికొస్తే ఆ దేశంలో 1974లో వచ్చిన భయంకరమైన కరవు తరువాత ఇప్పుడు ఆ దేశం ఆహార స్వయం సమృద్ధి సాధించింది.
2009 తరువాత బంగ్లాదేశ్ తలసరి ఆదాయం మూడింతలు పెరిగింది. ఈ ఏడాది ఆ దేశంలో తలసరి ఆదాయం 1750 డాలర్లు. అంటే భారత కరెన్సీలో చూస్తే సుమారు 1,24,000 రూపాయలు. అయినప్పటికీ బంగ్లాదేశ్‌లో ఇప్పటికే పెద్దసంఖ్యలో ప్రజలు పేదరికంలోనే మగ్గుతున్నారు. ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం.. ఇంతకుముందు 19 శాతం బంగ్గాదేశీలు తమ రోజువారీ అవసరాల కోసం రోజుకు 1.25 డాలర్లకు మించి ఖర్చు చేయలేని పరిస్థితిలో ఉండేవారు. ఇప్పుడలాంటి జనాభా 9 శాతానికి తగ్గింది.
ప్రస్తుతం బంగ్లాదేశీల సగటు ఆయుర్దాయం 72 ఏళ్లు, ఇది పాకిస్తాన్ ప్రజల సగటు ఆయుర్దాయం 66, భారత్ ప్రజల సగటు 68 కంటే ఎక్కువ.
ప్రపంచబ్యాంకు 2017 లెక్కల ప్రకారం బంగ్లాదేశ్‌లో 34.1 శాతం మంది డిజిటల్ బ్యాంక్ లావాదేవీలు చేశారు.. ఇది అప్పటి దక్షిణాసియా సగటు 27.8 శాతం కంటే ఎక్కువ.
అక్కడి వస్త్ర ఎగుమతులు ఏడాదికి 15 నుంచి 17 శాతం పెరుగుతున్నాయి. 2018 జూన్‌లో బంగ్లాదేశ్ వస్త్రఎగుమతుల విలువ 36,700 కోట్ల డాలర్లకు చేరింది. ఆ దేశం 50వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోనున్న 2021 నాటికి దీన్ని 50 వేల కోట్లకు చేర్చాలని అక్కడి ప్రధాని షేక్ హసీనా లక్ష్యంగా పెట్టుకున్నారు.
శ్రమ జీవులు
బంగ్లాదేశ ఆర్థిక ప్రగతిలో ఆ దేశానికి చెందిన 25 లక్షల మంది ప్రవాసుల పాత్ర కూడా ఉంది. విదేశాలలో నివసిస్తున్న బంగ్లాదేశీలు పంపించే డబ్బు ఏటా సగటున 18 శాతం పెరుగుతోంది. ఈ మొత్తం 2018లో 1500 కోట్ల డాలర్లకు చేరుకుంది.
బంగ్లాదేశ్ రాజధాని నగరం ఢాకాలో టెక్నాలజీ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. అక్కడి ఐటీ సంస్థల సీఈవోలు భారత్ నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారు. అప్పుడే భారత్‌తో తాము పోటీ పడగలమనుకుంటున్నారు.
ఔషధ తయారీ రంగంలో భారత్ చాలా ముందుంది. బంగ్లాదేశ్ ఇప్పుడు ఈ విషయంలో భారత్‌తో పోటీ పడుతోంది. దేశంలో 100 ప్రత్యేక ఆర్థిక మండలాలను ఏర్పాటు చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా అందులో 11 ఇప్పటికే ఏర్పాటయ్యాయి. మరో 79 నిర్మాణంలో ఉన్నాయి.
బంగ్లాదేశ్‌లో జనసాంద్రత ఎక్కువ. ఆ దేశ ఆర్థికాభివృద్ధి వెనుక అంతా సాఫీగా సాగిపోయిందనుకోవడానికి లేదు, ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది ఆ దేశం.
ఆ దేశంలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉంది. బంగ్లాదేశ్ రాజకీయాలను ప్రధానంగా ఇద్దరు మహిళలు శాసించారు. ఒకరు ప్రస్తుత ప్రధాని షేక్ హసీనా కాగా రెండో మహిళ మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా.
బంగ్లాదేశ్ స్వాతంత్ర్యంలో ఈ ఇద్దరు నేతల కుటుంబాలు ముఖ్య భూమిక పోషించాయి. గత మూడు దశాబ్దాల్లో ఈ ఇద్దరి మధ్య అధికారం మారుతూ వచ్చింది. ఈ ఇద్దరూ జైలు జీవితం గడిపారు.
రెడీమేడ్ వస్త్ర పరిశ్రమ
బంగ్లాదేశ్ ఆర్థిక విజయంలో అక్కడి వస్త్ర పరిశ్రమ పాత్ర ప్రధానమైనది. ఆ దేశ వస్త్ర పరిశ్రమలో 40.5 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు.
2018లో బంగ్లాదేశ్ మొత్తం ఎగుమతుల్లో 80 శాతం వాటా రెడీమేడ్ వస్త్రాలదే. 2013లో చోటుచేసుకున్న రానా ప్లాజా కుప్పకూలిన ఘటన బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమలో అత్యంత విషాద ఘటన. వస్త్రపరిశ్రమలున్న ఆ భవనం కూలిపోవడంతో 1130 మంది మరణించారు. ఇది ఆ దేశ వస్త్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపించింది. అనంతరం అనేక అంతర్జాతీయ వస్త్ర బ్రాండ్లు పలు సంస్కరణలు తీసుకొచ్చాయి.
కొన్ని రంగాల్లో బంగ్లాదేశ్ భారత్ కంటే కూడా మెరుగ్గా ఉంది. సగటు ఆయుర్దాయం, శిశు మరణాల రేటు నియంత్రణ, లింగ సమానత్వం వంటి విషయాల్లో భారత్ కంటే ముందుంది.
ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం బంగ్లాదేశ్ తలసరి ఆదాయం 2013లో 914 డాలర్లు ఉండగా 2016 నాటికి అది 1355 డాలర్లకు పెరిగింది. అంటే ఏకంగా 39.11 శాతం పెరుగుదల నమోదైంది. అదే కాలవ్యవధిలో భారత్ తలసరి ఆదాయం 13.80 శాతం పెరిగి 1,706 డాలర్లకు చేరుకుంది. పాకిస్తాన్‌లో తలసరి ఆదాయం 20 శాతం పెరిగి 1,462 డాలర్లకు చేరింది. ఇదే రేటుతో ప్రగతి సాధిస్తే బంగ్లాదేశ్ తలసరి ఆదాయం 2020 నాటికి భారత్‌ను మించిపోతుందని అంచనా.
జనరిక్ ఔషధాల తయారీ
జనరిక్ ఔషధాల తయారీ పరిశ్రమలో భారత్ ఎంతో అభివృద్ధి సాధించింది. ఈ రంగంలో ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా భారత్‌తో పోటీ పడేందుకు ప్రయత్నిస్తోంది.
వెనుకబడిన దేశంగా గుర్తింపు ఉన్నందు వల్ల బంగ్లాదేశ్‌కు పేటెంట్ హక్కుల నుంచి మినహాయింపు ఉంటుంది. ఈ వెసులుబాటు జనరిక్ ఔషధాల తయారీలో భారత్‌కు సవాల్ విసిరేందుకు బంగ్లాదేశ్‌కు అవకాశంగా మారింది.
జనరిక్ ఔషధాల ఉత్పత్తిలో బంగ్లాదేశ్ గణనీయమైన పురోగతి సాధించింది. 60 దేశాలకు ఔషధాలను ఎగుమతి చేస్తూ, ఈ ఔషధాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా ఉంది.
మౌలిక సదుపాయాలు సరిగా లేనందువల్ల కొన్ని రంగాల్లో బంగ్లాదేశ్ వెనుకబడి ఉంది. అయితే, పాకిస్తాన్‌కు మాత్రం 'వన్ బెల్ట్ వన్ రోడ్' ప్రాజెక్టులో భాగంగా అనేక రకాలుగా చైనా సాయం అందిస్తోంది. బంగ్లాదేశ్‌లోని అనేక ప్రాజెక్టులకు కూడా ఆర్థిక సాయం చేస్తోంది.
పద్మా నది మీద చైనా రైల్వే వంతెనను నిర్మిస్తోంది. అది బంగ్లాదేశ్‌లోని పశ్చిమ, ఈశాన్య ప్రాంతాలను అనుసంధానం చేస్తుంది. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 4 బిలియన్ డాలర్లు వెచ్చించనున్నారు.
బంగ్లాదేశ్‌కు చైనా 38 బిలియన్ డాలర్ల రుణం ఇచ్చింది. చిన్న దేశాలకు చైనా భారీ మొత్తంలో రుణాలు ఇస్తూ, ఆ దేశాలను అప్పుల ఊబిలోకి నెడుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశం బంగ్లాదేశ్‌లో మాత్రం రాజకీయంగా పెద్దగా చర్చల్లోకి రావడంలేదు.
ఇవి కూడా చదవండి:
- భారత 'రూపాయి' విలువ బంగ్లాదేశ్ 'టకా' కంటే తగ్గిందా? - Fact Check
- ఆ 19 లక్షల మందిని బంగ్లాదేశ్‌కు పంపించేస్తారా
- బంగ్లాదేశ్ వివాహ పత్రాల్లో 'కన్య' అనే మాటను తొలగించిన కోర్టు
- సంప్రదాయాన్ని ఎదిరించి వరుడి ఇంటికే వెళ్లి పెళ్లి చేసుకున్న వధువు
- బెంగాల్లో అక్రమంగా ఉంటున్న అందరినీ 'బయటకు గెంటేస్తాం'- అమిత్ షా
- ఇక చరిత్రను తిరగరాయాల్సిందేనా?
- వాజినిస్మస్: 'నా శరీరం సెక్స్‌కు సహకరించదు'
- బెంగాల్లో అక్రమంగా ఉంటున్న అందరినీ 'బయటకు గెంటేస్తాం'- అమిత్ షా
- మహాత్మా గాంధీ: అహింసతో స్వాతంత్ర్యం సిద్ధించిందన్నది నిజమేనా!
- గాంధీజీ లండన్‌లో చేతికర్రతో డాన్స్ చేసిన వేళ...
- చమురు వరమా, శాపమా?.. ప్రపంచాన్ని అది ఎలా మార్చింది
- చైనా అభివృద్ధిలో విజేతలెవరు... అక్కడి పాఠ్య పుస్తకాల్లో కనిపించని చరిత్ర ఏంటి?
- ది జోకర్: నవ్వించాల్సినవాడు ఇంత విలన్ ఎందుకయ్యాడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)