మహాత్మా గాంధీ: అహింసతో స్వాతంత్ర్యం సిద్ధించిందన్నది నిజమేనా! - అభిప్రాయం

    • రచయిత, గాంధీ అన్నపనేని
    • హోదా, పీకాక్‌ క్లాసిక్స్‌ సంపాదకులు, బీబీసీ కోసం

గాంధీజీ ప్రధానంగా ముగ్గురు వ్యక్తుల ప్రభావానికి గురయ్యారు. జాన్‌ రస్కిన్‌ (1819-1900), హెన్రీ డేవిడ్‌ థొరో (1817-1862), లియో టాల్‌స్టాయ్‌ (1828-1910). ఒక బ్రిటిషర్‌; ఒక అమెరికన్‌; ఒక రష్యన్‌.

గాంధీజీ ప్రభావానికి గురైనవారూ ఉన్నారు. దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షకి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు నెల్సన్‌ మండేలా (1928-2013), అమెరికాలో పౌర హక్కుల కోసం పోరాడిన మార్టిన్ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ (1929-1968) తదితరులు. అయితే, వీరందరిలోనూ అహింస అనిగానీ, సహాయ నిరాకరణ అనిగానీ పలకగానే గుర్తుకు వచ్చే మొదటి పేరు మాత్రం.. గాంధీ. అహింస అనేది గాంధీ ఇంటి పేరుగా మారిపోయింది, ఎందుకు?

1919లో గాంధీజీ ఇచ్చిన హర్తాళ్ పిలుపు మొదలుకొని 1942లో ఆయన నడిపిన 'క్విట్‌ ఇండియా' వరకూ అన్ని ఉద్యమాలూ శాంతియుతంగానే ప్రారంభమయ్యాయి. కానీ, వాటిలో ఏదీ అహింసాత్మకంగా ముగియలేదు. అయినా అహింసతోనే స్వాతంత్ర్యం సిద్ధించింది అని మనకు మనం నచ్చచెప్పుకొంటాం. అదే వింత.

ఉద్యమంలో హింస చేరిందని చెప్పి ప్రతిసారీ పొంగిన ఉద్యమంపై నీళ్లు కుమ్మరించారు గాంధీజీ, ఆయన నడిపిన ఉద్యమాలన్నిటికీ ఇదొక రొటీన్‌ ముగింపు. ఆయన ఉద్యమాన్ని నిర్దయగా బలిపెట్టినా.. శాంతి అహింసలను కాపాడడం కోసమే ఆయన ఆ పని చేశారని జాతి నమ్మింది. అలా నమ్మించారు. ఎవరు? శాంతి, అశాంతి, హింస, అహింస అనే మాయా వలయంలో నుంచి బయటపడి ఆలోచిస్తేగానీ అసలు మర్మం తెలియదు.

అహింసాత్మక ప్రతిఘటన

దీని గురించి మాట్లాడుతూ, "రష్యన్‌ విప్లవంలో కూడా తొలి దశలో పోరాటం అహింసాత్మకంగానే సాగింది" అంటాడు రష్యన్‌ విప్లవ నేత ట్రాట్‌స్కీ. విప్లవ వర్గాలు తొలి తిరుగుబాటు అడుగులు వేసేటప్పుడు చట్టపరిధిని దాటకుండా, మత భావాలను నొప్పించకుండా జాగ్రత్త తీసుకొంటాయి. ఆ దశలో వారికి తమ శక్తి మీద పూర్తి నమ్మకం ఉండదు. రైతాంగం విషయంలో ఇది మరింత నిజం. ఆ దశలో వర్గాల మధ్య రాజీ కుదర్చాలని బోధించేవారు ప్రభుత్వవర్గం నుంచే తలెత్తుతారు. రచయిత టాల్‌స్టాయ్‌ రైతు మనస్తత్వం బాగా తెలిసినవాడు. ఆయన "అహింసాత్మక ప్రతిఘటన" అనే సిద్ధాంతం పుట్టిన నేపథ్యం అది. - ఇదీ లియోన్‌ ట్రాట్‌స్కీ విశ్లేషణ సారాంశం.

నిజానికిది అన్ని విప్లవాలకూ వర్తించే సార్వత్రిక సూత్రమని చెప్పవచ్చు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని చూసినా, షేక్‌ అబ్దుల్లా నాయకత్వంలో కశ్మీర్ ప్రజల పోరాటాన్ని చూసినా, ఆనాటి దేశంలో తలెత్తిన అనేక జమీందారీ వ్యతిరేక పోరాటాలు చూసినా, మొత్తంగా బ్రిటిష్ వ్యతిరేక పోరాటాలను చూసినా ఇదే కనిపిస్తుంది. తొలి దశలో దొరల్నీ పాలకుల్నీ బతిమలాడుకోడమే కనిపిస్తుంది. వేడుకోళ్లూ మొత్తుకోళ్లూ ఆ దశలో మామూలే. దొరల్ని ఇంకా ఇంకా సంతోషపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతాయి.

శాంతియుతంగా పొరాడటంలో ఇంకా ఇతర ప్రయోజనాలు లేవని కాదు. ఉద్యమం సామాన్య జనంలో విస్తరించడానికి అవి తోడ్పడతాయి. ఉద్యమం పెరిగాక కూడా సమ్మెలు, హర్తాళ్లు, పన్నుల ఎగవేత లాంటి శాంతియుత ఉద్యమాలకు గొప్ప ప్రభావం ఉంటుంది. తొలిదశలో ఉద్యమం శాంతియుతంగా ఉండాలని ఎవరూ బోధించనక్కర్లేదు. కానీ, ఆ తర్వాత కూడా సమయోచితంగా ప్రయోగించగలిగిన అద్భుత ఆయుధం అహింస.

కానీ, అక్కడితో ఆగిపోతుందా? పాలకులు అహింసను అహింసతోనే ఎదుర్కొన్నారా? నిరాయుధులైన ప్రజల సమావేశాలను పాలకులు ఎన్నిసార్లు రక్తపుటేరులుగా మార్చలేదు. జలియన్‌వాలాబాగ్‌లో వాళ్లు చేసిన పనేమిటి?

చట్ట పరిధిలోనే జరిగే పోరాటాలకు ప్రాధాన్యం లేదని ఎవరూ అనరు. క్యూబా, దక్షిణ వియత్నాం, చైనా తదితర వివ్లవాల్లో సాయుధ పోరాటాలను చట్టబద్ధ పోరాటాలతో సమన్వయం చేశారు. చివరి రెండు దేశాల్లోనూ కమ్యూనిస్టులు ఆ పని చేశారు. క్యూబాలో బాటిస్టా పీడ విరగడ చేసుకోడానికి అనేక పార్టీలు పరస్పరం సహకరించుకొన్నాయి.

గాంధీజీ అహింస అనే దాన్ని సర్వరోగనివారిణి గానూ సర్వకాల సర్వావస్థల్లోనూ ప్రయోగించే ఏకైక పిడి సూత్రంగానూ మార్చేశారు. అది కూడా సాదాసీదాగా లేదు. అహింస విషయంలో ఆయన జనాన్ని గందరగోళపర్చిన సందర్భాలు కొల్లలు.

  • అహింసాత్మకంగానే జరిగిన మిడ్నపూర్‌, గుంటూరు జిల్లాల రైతుల పన్ను ఎగవేత ఉద్యమాలను ఆయన ఆపించేశారు.
  • జమీందారీ కౌళ్లకి వ్యతిరేకంగా శాంతియుతంగా జరిగిన ఉద్యమాల్లో దేన్నీ ఆయన బలపర్చలేదు.
  • శాంతియుతంగా జరిగిన కార్మికుల సమ్మెలను సైతం ఆయనెప్పుడూ ప్రోత్సహించలేదు.
  • మరో వింత ఏంటంటే బ్రిటిష్ అధికారుల కింద పనిచేసే భారతీయ సిపాయిలు జనంపై కాల్పులు జరపడానికి నిరాకరించిన సందర్భాల్లో ఆయన సైనికుల్నే తప్పుపట్టారు (దీనికి ఉదాహరణ పెషావర్‌లో గర్వాలీ సైనికులు). కాల్బడమే వారి విధి అని వాదించారు.

ఇదేం తర్కం అని ప్రశ్నించడానికి వీల్లేదు. ఆయన కత్తికి రెండు వైపులా పదునుంది అనుకోవాలన్నమాట. ఏకకాలంలో.. హింస చేయడమే సరైన బాధ్యత అని బోధించినా, అహింస తప్ప మరే గత్యంతరమూ లేదని వాదించినా ఆయనకే చెల్లిపోయింది.

చిట్టగాంగ్‌ ఆయుధాగారంపై సూర్యసేన్‌ అనుయాయుల దాడిగానీ, భగత్‌సింగ్ వంటి వీరుల త్యాగాలు గానీ, మన్యంలో అల్లూరి నడిపిన పితూరీలుగానీ, నావికుల తిరుగుబాటు గానీ, జనంపై కాల్పులు జరపడానికి నిరాకరించిన సిపాయిలు గానీ, ముస్లిం లీగు నిర్వహించిన పోరాటాలు గానీ, రైతాంగ పోరాటాలు గానీ, కార్మికుల సమ్మెలు గానీ, దేశం నలుమూలలా విప్లవకారులూ కమ్యూనిస్టులూ సోషలిస్టుల విప్లవ చర్యలు గానీ, కదిలించలేని బ్రిటిష్ పాలనని గాంధీ శాంతి, అహింసలూ కదిలించాయని మనల్ని మనం నమ్మించుకొంటున్నాం అనిపిస్తుంది.

గాంధీని పిరికివాడని ఎవరూ అనలేరు. ఆయన నిగ్రహ శక్తి గొప్పదే. పోలీసులు ఎన్ని లాఠీ దెబ్బలు కొట్టినా ఆయన తన పంతాన్ని విడిచిపెట్టని మాట నిజమే. ఆయన పట్టిన నిరాహార దీక్షల్లో ఏదీ ఉత్తుత్తి దీక్ష కాదన్నది నిజం. అప్పుడప్పుడూ బ్రిటిష్ ప్రభుత్వం దిగొచ్చి కొన్ని చిన్న కోర్కెలు తీర్చిన మాట నిజం. కానీ, భారత్‌ని వదిలేయడానికి గాంధీ నిరాహార దీక్షలు, గాంధీ అలక పాన్పులు, గాంధీ ఆత్మశక్తి, గాంధీ సహకార నిరాకరణలు, గాంధీ శాంతి అహింసలూ కారణమా అన్నది ప్రశ్న.

బ్రిటిష్ పాలకులు నిరాహార దీక్షలకే చలించిపోయేంత సున్నిత హృదయులా? వాళ్లు ఎప్పటి నుంచో అదిమిపెట్టి ఉంచుతున్న ఐర్లాండ్‌ని చూడండి. బ్రిటిష్ పాలనకి వ్యతిరేకంగా అక్కడ 1917 నుంచే నిరాహార దీక్షలు మొదలయ్యాయి. ఆ దీక్షల్లో లెక్కలేనంత మంది చనిపోయారు. మార్గరెట్‌ థాచర్‌ పాలనలో ఒక్క 1981లోనే నిరాహార దీక్షల్లో 10 మంది చనిపోయారు. మొట్ట మొదట చనిపోయినవాడు బాబీ శాండ్స్. అది ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగించింది. కానీ, థాచర్‌ ప్రభుత్వానికి చలనమే లేదు.

గాంధీ అహింసా మంత్రాలకి బ్రిటిష్ చింతకాయలు రాలలేదన్నది స్పష్టం.

మళ్లీ టాల్‌స్టాయ్‌ దగ్గరికి వెళ్దాం. అహింసాత్మక ప్రతిఘటన గురించి పూర్తిగా నమ్మి ఆయన దానిని బోధించారు. ఆయన ప్రభువర్గం వాడే అయినప్పటికీ ఆ వర్గం మీద ఆయనకు వల్లమాలిన ప్రేమ ఏమీ లేదు. ఆయన నూటికి నూరు పాళ్లూ రైతుల మనిషి, రైతుల క్షేమం కోసమే అహింసను ఆయుధంగా వాడమన్నారు. గాంధీ అలా కాదు. జమీందార్లు, భూస్వాములు, పెట్టుబడిదార్లు గాంధీ దృష్టిలో ధర్మకర్తలు. వారు ఆయన మనుషులు. ఆయన వారి మనిషి.

వారి ప్రయోజనాలు దాటి ఆయన ఎక్కడకూ పోరు. ఎన్నడూ పోలేదు. కాకపోతే, శాంతిగా దయగా ఉండమని ఆయన వారికి బోధిస్తారు. వాళ్లు మరీ దుర్మార్గంగా ఉన్నప్పుడు అలుగుతారు కూడా. అది వేరే విషయం. ఇప్పుడు జమీందారులు లేరు. భూస్వాములు దాదాపు కనుమరుగవుతున్నారు. పెట్టుబడిదారులు మాత్రం ఏపుగా పెరిగి ఉన్నారు. ఏటా గాంధీ కథలను గుర్తుచేయడానికి వారున్నారు. మరి సూర్యసేన్‌లనూ, భగత్ సింగులనూ, సీతారామరాజుల్నీ, కార్మిక కర్షక పోరాట వీరుల్నీ గుర్తుచేయడానికి ఎవరున్నారు?

బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో డా. అంబేడ్కర్‌ మాట్లాడుతూ... తాను గాంధీని మహాత్మ అని సంబోధించను అని స్పష్టం చేశారు. భారత చరిత్రలో గాంధీది ఒక అంకం మాత్రమేననీ ఆయన ఒక యుగకర్త కాజాలడనీ ఆంబేడ్కర్ అన్నారు. ఏటా గాంధీ జయంతులూ, గాంధీ వర్థంతులూ రొటీన్‌గా కాంగ్రెస్‌ పార్టీ జరుపుతూ, గాంధీ జ్ఞాపకాలకి కృత్రిమ శ్వాస పరికరాలు తగిలించకుండా ఉంటే ప్రజల స్మృతిపథం నుంచి ఆయన ఏనాడో మాయమై ఉండేవారంటారు డా. అంబేడ్కర్‌.

(అభిప్రాయాలు వ్యాసకర్త వ్యక్తిగతం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)