You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Gandhi: నిత్యపూజలు జరిగే మహాత్మా గాంధీ గుడి ఇది
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా చిట్యాల పట్టణానికి సమీపంలో మహాత్మా గాంధీ గుడి ఉంది. ఆ ఆలయ విశేషాలేమిటో చూద్దాం.
నాలుగు ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ గుడి హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి పక్కనే ఉంది. హైదరాబాద్ నుంచి వెళ్తుంటే కుడి వైపున కనిపిస్తుంది.
గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన మహాత్మాగాంధీ ఛారిటబుల్ ట్రస్టు దీన్ని నిర్మించింది.
"గాంధీని ప్రస్తుత రాజకీయ నాయకులు మర్చిపోతున్నారు. ఆయన సిద్ధాంతాలు, ఆశయాలను అందరూ గుర్తుంచుకునేలా చేయాలన్న ఆలోచనతో ఈ ఆలయాన్ని నిర్మించాం" అని ట్రస్టు నిర్వాహకులు శ్రీపాల్ రెడ్డి బీబీసీకి వివరించారు.
నిత్యం ధూప, దీప, నైవేద్యాలు పెట్టే ఏకైక గుడి
2014 అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఈ గుడిలో గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఇక్కడ నిత్యం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఇక్కడ బాపూజీకి రోజూ ఇద్దరు పూజారులు నిత్య పూజలు నిర్వహిస్తారు.
ఆలయ గోడల మీద, చుట్టూ నిర్మించిన ప్రహరీ గోడ మీద మహాత్మా గాంధీ సందేశాలు, సిద్ధాంతాలు దర్శనమిస్తాయి.
"గాంధీ విగ్రహాన్ని కర్నూలు జిల్లా నంద్యాలలో తయారు చేయించాం. భారత దేశంలో నిత్యం ధూప, దీప, నైవేద్యాలు పెట్టే ఏకైక గాంధీ గుడి ఇదే అనుకుంటున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గుడి ఇది ఒక్కటే" అని శ్రీపాల్ రెడ్డి వివరించారు.
జాతీయ రహదారి పక్కనే ఉండటంతో సందర్శకులు, ప్రముఖ నేతలు బాగానే వస్తున్నారని ఆయన తెలిపారు.
ఈ ఆలయం రెండు అంతస్తుల్లో ఉంది. పై అంతస్తులో మహాత్ముడి విగ్రహానికి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. కింది అంతస్తులో ధ్యాన మందిరం ఉంది. చాలామంది సందర్శకులు ఈ మందిరంలో ధ్యానం చేసి వెళ్తుంటారు.
ఈ గుడి వారంలో అన్ని రోజులూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు తెరచి ఉంటుంది.
అన్ని మతాల వారికీ ఆహ్వానమే అన్నట్టుగా భగవద్గీత, బైబిల్, ఖురాన్, గురు గ్రంథ్ సాహెబ్ వంటి భిన్న మతాల గ్రంథాలను ఈ ఆలయంలో ఉంచారు.
(ఈ కథనాన్ని మొదట 2018 జనవరి 30న ప్రచురించాం)
ఇవి కూడా చూడండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)