You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
న్యాయవాదికి బేడీలు వేసిన ఈ పాకిస్తానీ మహిళా కానిస్టేబుల్ వీడియో ఎందుకు వైరల్‌గా మారింది
పాకిస్తాన్ మహిళా కానిస్టేబుల్ ఒక వ్యక్తికి బేడీలు వేసి కోర్టుకు తీసుకువస్తున్న వీడియో ఒకటి ఇటీవల వైరల్ అయ్యింది.
ఆ వీడియోలో కనిపించిన కానిస్టేబుల్ పేరు ఫైజా నవాజ్. పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని ఫిరోజేవాలా ప్రాంతంలో ఆమె ఉంటున్నారు. ఆమె బేడీలు వేసి తీసుకువచ్చిన వ్యక్తి ఒక న్యాయవాది. ఆయన పేరు అహ్మద్ ముక్తార్.
శుక్రవారం ముక్తార్‌ను అలా ఆమె కోర్టుకు తీసుకువచ్చారు.
అయితే, ఆదివారం ఫైజా మాట్లాడుతున్న మరో వీడియో బయటకు వచ్చింది.
తనకు న్యాయం జరిగే అవకాశాలు కనిపించడం లేదని, అందుకే తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానని ఆమె ఆ వీడియో ద్వారా ప్రకటించారు. తమ దేశ న్యాయవ్యవస్థ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంతకీ ఏం జరిగింది
ఫిరోజేవాలా కోర్టు వద్ద అహ్మద్ ముక్తార్ గురువారం తన కారును పార్క్ చేశారు. ఆ సమయంలో ఫైజా అక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు.
అక్కడ కార్ పార్క్ చేయకూడదని ఆమె ముక్తార్‌కు చెప్పారు. ఇతరులకు ఇబ్బంది కలుగుతోందని, కారును అక్కడి నుంచి తీయాలని సూచించారు.
అయితే, ముక్తార్ ఆగ్రహంతో ఫైజాపై చేయి చేసుకున్నారని పాకిస్తాన్‌కు చెందిన జియో టీవీ తెలిపింది. ముక్తార్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేశారు.
ఈ వ్యవహారంలోనే ముక్తార్‌కు బేడీలు వేసి ఫైజా కోర్టుకు తీసుకువచ్చారు.
అయితే, ఎఫ్‌ఐఆర్‌లో ఒక తప్పిదం ఉందంటూ కోర్టు ముక్తార్‌ను విడుదల చేసింది.
దీంతో తనకు న్యాయం చేయాలంటూ పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీకి, చీఫ్ జస్టిస్ ఆసిఫ్ సయీద్ ఖోసాలకు ఫైజా విజ్ఞప్తి పెట్టుకున్నారు.
ఈ వ్యవహారంలో న్యాయపరంగా తనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అందుకే ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానని ఫైజా ఓ వీడియో ద్వారా తాజాగా వెల్లడించారు.
బలవంతులైన వ్యక్తులను ఎదుర్కొనే శక్తి తనకు లేదని ఆమె వ్యాఖ్యానించారు.
''న్యాయం జరుగుతుందని నాకు అనిపించడం లేదు. చాలా బాధతో ఈ విషయం చెబుతున్నా. సొంత డిపార్ట్‌మెంట్ వ్యక్తులే ఎఫ్‌ఐఆర్‌ను బలహీనం చేశారు. నేను బాగా చదువుకున్నా. 2014లో యాంటీ టెర్రరిజం డిపార్ట్‌మెంట్, పంజాబ్ పోలీసు శాఖలకు ఎంపికయ్యా. ప్రజలు, ముఖ్యంగా మహిళలకు న్యాయం చేయొచ్చని పోలీసుశాఖలో చేరా'' అని ఫైజా ఆ వీడియోలో చెప్పారు.
''అధికార మత్తులో జోగుతున్న ఆ న్యాయవాది నన్ను అవమానించాడు. మొదట మాటలతో విసిగించాడు. ఆ తర్వాత చేయి చేసుకున్నాడు. వ్యవస్థ తీరు నన్ను బాధించింది. మానసికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు కూడా వస్తున్నాయి. భవిష్యత్తు గురించి ఆందోళనగా ఉంది'' అంటూ ఆమె వాపోయారు.
సోషల్ మీడియాలో చర్చ
ఫైజా ముక్తార్‌కు బేడీలు వేసి తీసుకువచ్చిన వీడియో బయటకు వచ్చినప్పటి నుంచి ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఫైజా ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత ఇది మరింత పెరిగింది.
పాకిస్తాన్ న్యాయవ్యవవస్థ, మహిళల పరిస్థితి గురించి అనేక మంది ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
''మరో మహిళ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీసినందుకు మన న్యాయవ్యవస్థకు, మహిళా వ్యతిరేక సమాజానికి ధన్యవాదాలు'' అని రమ్మా ఎస్ చీమా అనే మహిళ ట్వీట్ చేశారు.
''పోలీసులకే రక్షణ లేని దేశంలో మనం బతుకుతున్నాం. పాకిస్తానీలు.. ముందు మీరు మారాలి'' అని సుమైరా అలీ అనే ట్విటర్ యూజర్ వ్యాఖ్యానించారు.
''ఇది చాలా విచారకరం. మహిళా వ్యతిరేక వ్యవస్థ ఓ కానిస్టేబుల్‌ను రాజీనామా చేసేలా చేసింది'' అని అనాయా ఖాన్ అనే మహిళ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- అక్కడ వేల కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.. వజ్రాలు వర్షంలా కురుస్తాయి
- ఇస్రో చైర్మన్ కె శివన్ కథ: ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన నిరుపేద రైతు కొడుకు
- విశాఖపై ఆర్థిక మాంద్యం ప్రభావం: ఆర్డర్లు తగ్గాయి.. ఉద్యోగాలు ఊడుతున్నాయి
- అపోలో 11: చంద్రుడి మీదకు మనిషి ప్రయాణం ఓ నాటకమా? దీనికి నాసా సమాధానమేంటి?
- ఇస్రో చైర్మన్ కె శివన్ కథ: ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన నిరుపేద రైతు కొడుకు
- రియల్ లైఫ్ అపరిచితురాలు: ఒక్క మహిళలో 2500 మంది..మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్‌కు లోనైన జెనీ హెయిన్స్ కథ
- స్మార్ట్ ఫోన్లు మన మాటలు, సంభాషణలను రహస్యంగా వింటున్నాయా?
- యూరప్‌లో వందల సంఖ్యలో ఆడవాళ్లు ఎందుకు హత్యకు గురవుతున్నారు
- ఇందిరాగాంధీ హత్య: అంగరక్షకులే ఆమెను చంపేశారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)