WIvIND: జస్‌ప్రీత్ బుమ్రా హ్యాట్రిక్, హనుమ విహారి శతకం, ఇషాంత్‌ శర్మ హాఫ్ సెంచరీ.. రెండో టెస్టులో వెస్టిండీస్‌పై భారత్ పైచేయి

సొంత మైదానాల్లో ఒకప్పుడు వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్లు చెలరేగిపోయేవారు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు ముచ్చెమటలు పట్టించేవారు.

అలాంటి పిచ్‌లపై భారత బౌలర్లు ప్రతాపం చూపే రోజు వస్తుందని, విండీస్ బ్యాట్స్‌మెన్‌ను వారు వణికిస్తారని బహుశా ఎవరూ ఊహించి ఉండరు.

కానీ, అలాంటి రోజే వచ్చింది. కింగ్స్‌టన్‌లోని సబీనా పార్క్‌లో భారత్, వెస్టిండీస్‌ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్‌లో అలాంటి దృశ్యాలే కనిపించాయి.

భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేసింది.

ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన వెస్టిండీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 87 పరుగుల స్కోరుతో పీకల్లోతు కష్టాల్లో ఉంది. తొలి ఐదు వికెట్ల కోల్పోయే సమయానికైతే ఆ జట్టు స్కోరు 22 పరుగులే.

భారత బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా హ్యాట్రిక్‌తో చెలరేగి, మొత్తంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. అతడు వేసిన 9.1 ఓవర్లలో 3మెయిడిన్లు. బుమ్రా బౌలింగ్‌లో విండీస్‌కు వచ్చిన పరుగులు 16 మాత్రమే. ఇక మరో భారత పేసర్ మహమ్మద్ షమికి ఒక వికెట్ పడింది.

వెస్టిండీస్ తొలి ఐదు వికెట్లనూ బుమ్రానే పడగొట్టాడు. అద్భుత స్వింగ్, యార్కర్లతో ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ నడ్డి విరిచాడు.

తొలుత ఓపెనర్ జాన్ కాంప్‌బెల్‌ రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా బుమ్రా బౌలింగ్‌లో కీపర్‌ రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చాడు. అప్పటికి విండీస్ స్కోరు 9 పరుగులే.

ఇన్నింగ్స్‌ 9వ ఓవర్‌లో వరుసగా ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ను బుమ్రా పెవిలియన్‌కు పంపించాడు. ఆ ఓవర్‌లో రెండో బంతిని ఆడటంలో ఇబ్బందిపడ్డ డేరెన్ బ్రావో (4) స్లిప్‌లో ఉన్న కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చాడు.

అతడి స్థానంలో వచ్చిన షమ్రా బ్రూక్స్‌ (0)ను, ఆ తర్వాతి బంతికే బుమ్రా ఎల్బీడబ్ల్యూ చేశాడు.

మరుసటి బంతికి కూడా అదే ఫలితం. బంతి నేరుగా రోస్టన్ చేస్ (0) ప్యాడ్లపై తగిలింది. అంపైర్ అస్సలు ఆలస్యం చేయకుండా ఔటిచ్చేశాడు.

బుమ్రా టెస్ట్ కెరీర్‌లో తొలి హ్యాట్రిక్ నమోదైంది. టీమ్ ఇండియా ఆటగాళ్ల సంబరం మొదలైంది.

ఈ హ్యాట్రిక్‌ పూర్తయ్యేసరికి విండీస్ స్కోరు 13-4.

ఆ తర్వాత బుమ్రా.. విండీస్ ఆల్‌రౌండర కార్లోస్ బ్రాత్‌వైట్ (10), కెప్టెన్ జేసన్ హోల్డర్ (18) వికెట్లు కూడా తీశాడు. షిమ్రాన్ హిట్‌మేయర్‌ను షమి బౌల్డ్ చేశాడు.

ముందు మ్యాచ్‌లోనూ..

దీనికి ముందు విండీస్‌తో భారత్ ఆడిన తొలి టెస్టులోనూ బుమ్రా మెరిశాడు.

నిజానికి, ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రాకు ఒకే వికెట్ పడింది. 55 పరుగులు సమర్పించుకున్నాడు.

కానీ, రెండో ఇన్నింగ్స్‌లో అతడు చెలరేగి, ఐదు వికెట్లు తీశాడు. 8 ఓవర్లు వేసి, కేవలం 7 పరుగులే ఇచ్చుకున్నాడు.

ఈ ప్రదర్శన సాయంతోనే భారత్ విండీస్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 100 పరుగులకే పరిమితం చేసి, 318 పరుగుల భారీ తేడాతో ఆ మ్యాచ్‌లో విజయం అందుకుంది.

రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శనివారం బుమ్రా బౌలింగ్ చూస్తుంటే, ముందు మ్యాచ్‌లోని తన అద్భుత స్పెల్‌ను అతడు కొనసాగించినట్లే అనిపించింది.

హనుమ విహారి తొలి శతకం

అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 416 పరుగులు చేసి ఆలౌటైంది.

తెలుగు ఆటగాడు హనుమ విహారి తన టెస్ట్ కెరీర్‌లో తొలి శతకం సాధించాడు. అతడికిది ఐదో టెస్ట్ మ్యాచ్.

విహారి 225 బంతుల్లో 111 పరుగులు సాధించాడు. మ్యాచ్‌లో అతడే టాప్ స్కోరర్. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాంత్ శర్మతో కలిసి అతడు నెలకొల్పిన శతక భాగస్వామ్యం భారత్ మంచి స్కోరుకు చేరుకునేలా తోడ్పడింది.

ఎనిమిదో వికెట్‌కు ఈ ఇద్దరూ 112 పరుగులు జోడించారు.

ఇషాంత్ శర్మ తొలి అర్థ సెంచరీ

ఇషాంత్ (57) కూడా ఈ మ్యాచ్‌తో తన టెస్ట్ కెరీర్‌లోనే తొలి అర్ధ శతకం పూర్తిచేసుకున్నాడు. ఇది ఇషాంత్‌కు 92వ టెస్టు.

ఈ మ్యాచ్‌కు ముందు టెస్టుల్లో అతడి అత్యుత్తమ స్కోరు 31 పరుగులు.

విహారి, ఇషాంత్ కాకుండా భారత బ్యాట్స్‌మెన్‌లో మయాంక్ అగర్వాల్ (55), కోహ్లీ (76) కూడా రాణించారు.

రెండో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్‌పై భారత్ 329 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)