You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నారోహితో: జపాన్ కొత్త చక్రవర్తి ఎవరు? ఈ రాజవంశం ఎందుకంత ప్రత్యేకం?
జపాన్ చక్రవర్తి నారోహితో సింహాసనంపై కూర్చున్న తర్వాత తొలిసారి ప్రసంగించారు. కొత్త యుగంలో విశ్వశాంతి, ప్రజల సంతోషం ఆశిస్తున్నట్లు తెలిపారు.
అంతకు ముందు బుధవారం జరిగిన ఒక వేడుకలో ఆయనను అధికారికంగా రాజవంశానికి చెందిన సంపదకు వారసుడుగా చక్రవర్తిని చేశారు.
ఇప్పుడు జపాన్‌లో కొత్త చక్రవర్తి పాలనను రీవా శకం అంటారు. అంటే ఆదేశం, సామరస్యం. ఇప్పుడు ప్రారంభమైన ఈ శకం నారోహితో పాలన అంతటా ఉంటుంది.
నారోహితో తండ్రి 85 ఏళ్ల అకిహితో, 200 ఏళ్ల జపాన్ రాజవంశ చరిత్రలో తనంతట తానుగా సింహాసనాన్ని విడిచిపెట్టిన తొలి రాజుగా నిలిచారు.
రాజభవనంలో క్లుప్తంగా ప్రసంగించిన కొత్త చక్రవర్తి నారోహితో తను "ప్రజల సంతోషం, దేశ పురోగతి, ప్రపంచ శాంతిని ఆశిస్తున్నానని" తెలిపారు.
59 ఏళ్ల నారోహితో మొదట తనకు అవకాశం ఇచ్చిన తండ్రి ఎమిరిటస్ అకిహితోకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన తన పాలనలో చేసిన సేవలను కొనియాడారు.
వేడుకలో ఏం జరిగింది?
మంగళవారం అర్థరాత్రి జపాన్‌లో కొత్త శకం ప్రారంభం కాగానే నారోహితో చక్రవర్తి అయిపోయారు. కానీ తర్వాత సింహాసనంపై అధికారికంగా కూర్చునేందుకు ఏర్పాటు చేసిన వేడుకలో ఆయన పాల్గొన్నారు.
రాజ భవనంలో ఈ వేడుక బుధవారం ఉదయం స్థానిక కాలమానంప్రకారం 10:15(భారత కాలమానం ప్రకారం ఉదయం 6.45)కు జరిగింది. రాజవంశంలోని మహిళలకు అక్కడ ప్రవేశం ఉండదు. దాంతో కొత్త చక్రవర్తి భార్య ఆ వేడుకలకు హాజరు కాలేదు.
అధికారం స్వీకరిస్తున్నందుకు గుర్తుగా చక్రవర్తి నారోహితో ఒక కత్తి, రత్నం అందుకున్నారు. ఇవి ఎన్నో తరాల నుంచీ చక్రవర్తులకు వారసత్వంగా అందుతున్నాయి. వారి సామ్రాజ్యం శక్తికి వాటిని చిహ్నాలుగా భావిస్తారు.
అక్కడ చక్రవర్తి నారోహితోకు అదనంగా ఒక అద్దం కూడా అందించారు. ఆ మూడు వస్తువులనూ ఆ రాజవంశం వారసత్వ సంపదగా, రాజచిహ్నాలుగా భావిస్తారు. వాటిని 'మీ ప్రిఫెక్టర్'లో ఉన్న 'ఇసే గ్రాండ్' అనే పవిత్ర స్థలంలో భద్రపరుస్తారని భావిస్తున్నారు. అవి ఎప్పుడూ అక్కడే ఉంటాయి.
ఈ వేడుకల్లో రెండో భాగానికి రాజవంశంలోని మహిళలను అనుమతిస్తారు. ఈ కార్యక్రమంలో సింహాసనంపై కూర్చున్న తర్వాత చక్రవర్తి మొదటిసారి ప్రజలకు కనిపిస్తారు.
కొత్త చక్రవర్తి నేపథ్యం
నారోహితో జపాన్‌కు 126వ చక్రవర్తి. ఆయన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. 28 ఏళ్లకే సింహాసనానికి వారసుడు అయ్యారు.
నారోహితో తన భార్య, ప్రస్తుత మహారాణి మసకో ఒవాడాను 1986లో ఒక టీ పార్టీలో కలిశారని చెబుతారు. తర్వాత 1993లో వారు పెళ్లి చేసుకున్నారు.
అప్పట్లో మీడియాతో మాట్లాడిన మసాకో నారోహితో ప్రతిపాదనకు తను అంగీకరించినట్లు చెప్పారు.
"నీకు రాజవంశంలో అడుగుపెట్టడం గురించి భయాలు ఉండచ్చు. కానీ నిన్ను నా జీవితాంతం కాపాడుకుంటాను" అని ఆయన చెప్పారని మసాకో తెలిపారు.
మహారాణి పదవి తనలో అభద్రతాభావాన్ని పెంచిందని కూడా మసాకో డిసెంబరులో చెప్పారు. ఆమె అప్పట్లో ఒత్తిడికి గురయ్యారని కూడా వార్తలొచ్చాయి.
మసాకో హార్వర్డ్, ఆక్స్‌ఫర్డ్‌లో చదివారు. పెళ్లికి ముందు దౌత్యవేత్తగా ఆమె ఒక మంచి కెరీర్ రూపొందించుకున్నారు.
వీరి ఏకైక సంతానం యువరాణి ఐకో. ఆమె 2001లో పుట్టారు. రాజవంశంలోని మహిళలు వారసత్వంగా సింహాసనం అందుకోవడాన్ని జపాన్ ప్రస్తుత చట్టాలు నిషేధించాయి.
నారుహితో తర్వాత ఆయన సోదరుడు యువరాజు ఫుమిహితో సింహాసనం అందుకోడానికి వరుసలో ఉన్నారు. ఆయన తర్వాత చక్రవర్తి మేనల్లుడు 12 ఏళ్ల యువరాజు హిసహితో జపాన్ చక్రవర్తి అవుతారు.
జపాన్ రాచరికం ఎందుకు ప్రత్యేకం
ప్రపంచంలో వంశపారంపర్యంగా కొనసాగుతున్న అత్యంత ప్రాచీన రాచరికం ఇదే. వీరి పూర్వీకులు క్రీ.పూ 600 నుంచి చక్రవర్తులుగా ఉన్నారు.
నిజానికి, జపాన్ చక్రవర్తులను అక్కడి ప్రజలు దేవుళ్లుగా భావిస్తారు. కానీ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ లొంగిపోయినప్పుడు, అందులో భాగంగా నారోహితో తాత చక్రవర్తి హిరోహితో బహిరంగంగా తన దైవత్వాన్ని వదులుకున్నారు.
ఆ పాత్రను చక్రవర్తి అకిహితో పునరుద్ధరించారు.
యుద్ధం తర్వాత జపాన్ పేరు ప్రతిష్ఠలపై పడిన మచ్చను తొలగించడంలో సాయం చేసిన చక్రవర్తి అకిహితో ఆ పాత్రను పునరుద్ధరించారు.
సహజ విపత్తులు, వ్యాధులతో బాధపడే వారిని ఆయన కలిసి మాట్లాడేవారు. దాంతో ఆయన ఎంతోమంది జపనీయులకు ప్రియతమ చక్రవర్తి అయ్యారు.
అకిహితోను ఇప్పుడు 'జోకో' అని పిలుస్తారు. అంటే 'పెద్ద చక్రవర్తి' అని అర్థం. ఇంగ్లీషులో దానినే 'ఎంపరర్ ఎమెరిటస్' అంటారు. ఆయన భార్య మిచికోను 'ఎంప్రెస్ ఎమెరిటా' అని పిలుస్తారు.
ఇవి కూడా చదవండి:
- ‘ఇండోనేసియా దేశ రాజధానిని మారుస్తున్నారు’
- మీ ఆలోచనల్ని చదివి, మాటల రూపంలో వినిపించే పరికరం... శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ
- శ్రీలంక పేలుళ్లు: ఐఎస్ ప్రకటనలు నిజమేనా? ఐఎస్ గతంలో చర్చిలపై దాడులు చెయ్యలేదా?
- ఐదేళ్ల తర్వాత వీడియోలో కనిపించిన ఇస్లామిక్ స్టేట్ అధినేత.. శ్రీలంక దాడులు తమ పనేనని ప్రకటన
- ముఖంపై ముసుగు ధరించడం ఏయే దేశాల్లో నిషిద్ధం?
- వెనెజ్వేలాలో ఏం జరుగుతోంది? అధ్యక్షుడు మడూరో దిగిపోవాల్సిందేనా?
- అంతరిక్షంలో అత్యధికంగా చెత్త నింపే దేశం ఏదో తెలుసా...
- ఉత్తర, దక్షిణ కొరియాల్లాగా భారత్-పాకిస్తాన్ దగ్గరవడం సాధ్యమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)