శ్రీలంక పేలుళ్లు: ఐఎస్ ప్రకటనలు నిజమేనా? ఐఎస్ గతంలో చర్చిలపై దాడులు చెయ్యలేదా?

శ్రీలంకలోని చర్చిల్లో జరిగిన ఆత్మాహుతి దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులు తమ పనేనంటూ ఐఎస్ ప్రకటించుకుంది. ఇందుకు సంబంధించిన చిత్రాలు, వీడియో కూడా ఒకటి విడుదల చేసింది. దాడులకు పథకరచన చేసినవారుగా భావిస్తున్న కొందరు ఐఎస్ బ్యానర్ల ఎదుట నిల్చుని మాట్లాడడం ఆ వీడియోల్లో ఉంది.

శ్రీలంక ప్రభుత్వం తొలుత ఈ దాడులకు కారణం ఆ దేశంలోని నేషనల్ తౌహీద్ జమాత్ (ఎన్టీజే) సంస్థంటూ నిందించింది. అయితే, దాడుల తీరుచూస్తుంటే బయటి శక్తుల ప్రమేయం ఉందన్న అనుమానాలనూ వ్యక్తం చేసింది.

శ్రీలంక అలా ప్రకటన చేసిన తరువాత ఈ దాడులకు కారణం తామేనని ఐఎస్ ప్రకటించుకుంది. కానీ, ఐఎస్ ప్రకటన నిజమేనా.. దీని వెనుకున్నది ఆ సంస్థేనా అన్న అనుమానాలు చాలామందిలో ఉన్నాయి.

ఐఎస్ నేరుగా ఈ దాడులకు పాల్పడిందా? లేదంటే శ్రీలంకలోని మిలిటెంట్ గ్రూపులతో కలిసి ఈ పనిచేసిందా? లేదంటే, వారికి సహాయసహకారాలు అందించిందా? అన్నది తెలియాల్సి ఉంది.

ఐఎస్ ఎందుకు ఆలస్యం చేసింది

ఏప్రిల్ 21న ఈ దాడులు పెద్ద ఎత్తున జరిగాయి. అది జరిగిన రెండు రోజుల తరువాత ఏప్రిల్ 23న తామే బాధ్యులమని ఐఎస్ ప్రకటించుకుంది.

సాధారణంగా తాను ఏం చేసినా వెంటనే ప్రపంచానికి చెప్పే ఐఎస్ శ్రీలంక దాడుల విషయంలో ఎందుకు ఆలస్యం చేసిందన్న అనుమానాలున్నాయి.

కానీ, గతంలోనూ ఐఎస్ ఇలా ఆలస్యంగా ప్రకటించుకున్న సందర్భాలు ఉన్నాయి.

ముఖ్యంగా ఒక్క దాడితో సరిపెట్టకుండా మరిన్ని దాడులు చేసే ఆలోచనలో ఉన్నప్పుడు ఐఎస్ ఇలాగే ఆలస్యంగా ప్రకటిస్తుంది. తాము చేసే ప్రకటన తమ పథకం అమలుకు ఆటంకం కారాదన్న ఉద్దేశంతో ఐఎస్ ఉద్దేశపూర్వకంగానే ఆలస్యంగా ప్రకటిస్తుంది.

శ్రీలంక దాడులకు సంబంధించి తొలుత ఐఎస్ సొంత మీడియా సంస్థ అమాక్ ద్వారా చిన్న లిఖిత ప్రకటన ద్వారా వెల్లడించింది.

ఆ తరువాత మరిన్ని వివరాలతో ప్రకటన చేసింది. ఈ రెండో ప్రకటనలో ఐఎస్ దాడుల్లో పాల్గొన్న కొందరి పేర్లు కూడా తెలిపింది. దాడులకు సంబంధించిన ఒక చిత్రం, ఒక వీడియో కూడా ప్రపంచానికి చూపించింది.

ఐఎస్ తన ప్రకటనలో దాడులకు పాల్పడిన ఏడుగురి పేర్లు వెల్లడించినప్పటికీ వారు ఎక్కడివారన్నది మాత్రం బయటపెట్టలేదు.

మరోవైపు ఐఎస్ విడుదల చేసిన వీడియోలో యూనిఫాం ధరించిన ఎనిమిది మంది సాయుధులు ఐఎస్ నేత బక్ర్ అల్ బాగ్దాది పట్ల విధేయత ప్రకటిస్తూ ప్రతిజ్ఞ చేయడం కనిపిస్తుంది. వారిలో ఏడుగురు ముసుగులు వేసుకుని ఉండగా ఒక్కరు మాత్రం ముసుగు లేకుండానే కనిపిస్తారు.

ముసుగులేని ఆ వ్యక్తిని అబూ ఉబయిదాగా గుర్తించారు.

ఐఎస్ ఉనికి పెద్దగా లేని దేశాల్లో వారు దాడులు చేసినప్పుడు ఇలా ప్రతిజ్ఞ చేసే వీడియోలు పోస్ట్ చేస్తుంటారు.

అయితే.. ఐఎస్ చేసిన ప్రకటనలో దాడులకు పాల్పడినవారిగా ఏడుగురి పేర్లుండగా.. ఫొటో, వీడియోలో 8 మంది కనిపిస్తున్నారు. ఐఎస్ విడుదల చేసిన ప్రతిజ్ఞ వీడియో చూస్తే వారు శ్రీలంకలోని స్థానిక మిలిటెంట్ గ్రూపులతో సంబంధాలు ఏర్పరుచుకున్నట్లు సూచిస్తోంది.

వార్తల్లో నిలిచేందుకే..

ఈ దాడులకు సుమారు నెల రోజుల ముందు మార్చి 23న ఐఎస్ సిరియాలో తమ చిట్టచివరి స్థావరం బగూజాను కూడా కోల్పోయింది. ఐఎస్‌ను అంతం చేసేశామంటూ సిరియా ప్రకటించింది.

ఈ నేపథ్యంలోనే తాము ఎక్కడైనా దాడులు చేయగలమని.. తమ పని అయిపోలేదని చాటుకునే ప్రయత్నంలోనే శ్రీలంకను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడినట్లు భావిస్తున్నారు.

మార్చి నెలలోనే ఐఎస్ తొలిసారి పశ్చిమాఫ్రికా దేశాలైన మాలి, బుర్కినా ఫాసోలోనూ తాము ఉనికిలో ఉన్నామని చెప్పింది. నైజీరియాలోనూ దాడులకు పాల్పడింది.

అంతేకాదు.. ఏప్రిల్ 18న ఐఎస్ కాంగోలో దాడికి పాల్పడి సెంట్రల్ ఆఫ్రికా ప్రావిన్స్ అంటూ కొత్త శాఖను ప్రకటించింది.

కాంగో, శ్రీలంక రెండూ కూడా గతంలో ఐఎస్ ఉనికి ఏమాత్రం లేనివి.

ఇవన్నీ కూడా సిరియా ఐఎస్‌ను అంతం చేశానని ప్రకటించిన తరువాత, అంతకు కొద్దిముందు జరిగినవే.

సిరియాలో తమను అంతం చేసినా మధ్య ప్రాచ్య దేశాల బయట కూడా ఎక్కడికక్కడ స్థానిక మిలిటెంట్ గ్రూపులతో సంబంధాలు ఏర్పరచుకునే సామర్థ్యం తమకుందని చాటుకోవడానికే ఐఎస్ ఇలా చేసుండొచ్చు.

చర్చిలపై దాడులు చేసిన చరిత్ర ఐఎస్‌కే ఎక్కువ ఉంది

ఆల్ ఖైదా వంటి మిలిటెంట్ గ్రూపులకు భిన్నంగా ఐఎస్ చర్చిలపై దాడులు చేసిన ఘటనలు ఎక్కువగా ఉన్నాయి.

2017 ఏప్రిల్‌లో ఈజిప్టులోని రెండో అతిపెద్ద పట్టణం అలెగ్జాండ్రియాలోని చర్చిలో ఐఎస్ జంట బాంబులు పేల్చింది. ఆ ఘటనలో 45 మందికి పైగా మరణించారు.

ఫిలిప్పీన్స్‌లోని చర్చిలో ఈ ఏడాది జనవరిలో బాంబు పేలుళ్లు జరిగి 20 మంది మరణించడానికి కూడా తామే కారణమని ఐఎస్ ప్రకటించుకుంది.

గత ఏడాది ఇండోనేసియాలో, 2016లో పారిస్‌లో కూడా చర్చిల్లో బాంబులు పేల్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)