You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జింబాబ్వే: 'సైనికులు మా ఇంట్లోకి చొరబడి నన్ను రేప్ చేశారు’
జింబాబ్వే సైనికులు తమపై అత్యాచారం చేశారని కొంతమంది మహిళలు బీబీసీకి చెప్పారు. అర్ధరాత్రుళ్లు ఇంట్లోకి జొరబడి తమపై దాడులు చేస్తున్నారని దేశ వాసులు తెలిపారు.
జింబాబ్వే ప్రభుత్వం ఇటీవల ఇంధన సుంకాలను భారీగా పెంచడంతో ప్రజలు నిరసనలకు దిగారు. రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. వారిని అదుపు చేసుందుకు ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది. అయితే, సైన్యం దౌర్జన్యంగా ఇళ్లలోకి జొరబడి దాడులకు దిగుతోందని దేశ ప్రజలు అంటున్నారు.
రాజ్యం ఓ పద్ధతి ప్రకారం ప్రజలను హింసిస్తోందని ఆ దేశ మానవ హక్కుల సంఘం ఆరోపించింది.
'జింబాబ్వే సైనికులు నా గదిలోకి వచ్చి, నన్ను కొట్టారు. సెక్స్ కావాలని అడిగారు. నేను నిరాకరించడంతో మళ్లీ కొట్టారు' అని బాధిత మహిళ ఒకరు బీబీసీకి చెప్పారు.
అత్యాచారం జరిగిన విషయం ఇంట్లో చెప్పలేదని, పెళ్లి కాకపోవడంతో దీనిపై మౌనంగానే ఉంటానని ఆమె తెలిపారు.
''ఇంట్లోకి చొరబడ్డ మొదటి సైనికుడు నాపై అత్యాచారం చేశాడు.
అతని తర్వాత మరో సైనికుడు అలాగే చేశాడు.'' అని ఓ బాధితురాలు బీబీసీకి తెలిపారు.
అసలు దేశంలో అర్ధరాత్రి ఏం జరుగుతుందో తెలియడం లేదని, సైన్యం ఇళ్లలోకి చొరబడి ప్రజలపై దాడులకు దిగుతోందని జింబాబ్వే మానవ హక్కుల సంఘం కార్యకర్త బ్లెస్సింగ్ గోరేజన అన్నారు.
సామూహిక అరెస్టులు, హింసను నిరసిస్తూ దేశ రాజధాని హరారేలో న్యాయవాదులు నిరసన ప్రదర్శనలు చేశారు.
ప్రభుత్వం తీరుపై ప్రతిపక్ష నేత నెల్సన్ ఛమిస విరుచుకపడ్డారు.
''నాటి నియంతృత్వ, నిరంకుశ పాలనలోకి మళ్లీ వెళుతున్నాం.
నాటి భయం, భీతి మళ్లీ ప్రజల్లో కనిపిస్తోంది.'' అని ఆయన అన్నారు.
మరోవైపు పన్నుల పెంపుపై జింబాబ్వే ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)