You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కమలా హ్యారిస్: మద్రాసీ మూలాలున్న ఈమె అమెరికా అధ్యక్ష పీఠమెక్కే తొలి మహిళ అవుతారా?
అమెరికా 2020 అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని భారతీయ మూలాలున్న తొలి సెనేటర్ కమలా హ్యారిస్ ప్రకటించారు. భారత్, ఉత్తర అమెరికా ఖండంలోని జమైకా దేశం నుంచి చదువుకోవడానికి అమెరికా వచ్చి, ఇక్కడే స్థిరపడిన వలసదారుల సంతానమే కమల.
కమల తండ్రి డోనల్డ్ హ్యారిస్‌ది జమైకా కాగా, తల్లి శ్యామలా గోపాలన్‌ది చెన్నై. శ్యామల 1960లో చెన్నై (మద్రాస్) నుంచి అమెరికాకు వలస వచ్చారు.
కమల కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఓక్లాండ్‌లో జన్మించారు.
అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై ప్రకటన చేయడానికి కమల 'మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ డే (ఎంఎల్‌కే డే)'ను ఎంచుకున్నారు.
అమెరికాలో జాతివివక్షపై ఉద్యమించిన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గౌరవార్థం ఏటా జనవరిలో మూడో సోమవారం ఎంఎల్‌కే డేను జరుపుకుంటారు.
ఆయన ఆశయమే తనకు స్ఫూర్తినిస్తుందని, ఈ రోజు అమెరికన్లు అందరికీ చాలా ప్రత్యేకమైనదని, ఈరోజు ఈ ప్రకటన చేస్తుండటం తనకు గర్వంగా ఉందని కమల వ్యాఖ్యానించారు.
''మన అమెరికా విలువల పరిరక్షణ కోసం గళం విప్పే మీరు, మీ లాంటి కోట్ల మంది ప్రజలపైనే మన దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది. అందుకే అమెరికా అధ్యక్ష స్థానానికి నేను పోటీచేస్తున్నా'' అని కమల ట్విటర్‌లో ఒక వీడియోలో చెప్పారు.
సోమవారం వాషింగ్టన్‌లోని ఒక ఆఫ్రికన్-అమెరికన్ విశ్వవిద్యాలయంలో ఆమె తన తొలి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రభుత్వ కార్యకలాపాల పాక్షిక ప్రతిష్టంభన(షట్‌డౌన్)ను పరిష్కరించకుండా అమెరికన్లను అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తీవ్ర ఇబ్బందులపాల్జేస్తున్నారని ఆమె విమర్శించారు.
రిపబ్లికన్ పార్టీకి చెందిన ట్రంప్ విధానాలను కమల తీవ్రంగా విమర్శిస్తుంటారు.
డెమొక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా నామినేషన్ దక్కితే, అధ్యక్ష పదవికి ఒక ప్రధాన పార్టీ తరపున పోటీపడే తొలి ఆఫ్రికన్ అమెరికన్ మహిళ, తొలి భారతీయ అమెరికన్ మహిళ కమలే అవుతారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడి విజయం సాధిస్తే ఈ పదవిని చేపట్టే తొలి మహిళ ఆమే అవుతారు.
కమల 2016లో కాలిఫోర్నియా సెనేటర్‌గా ఎన్నికయ్యారు. 2017లో ఆమె బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిని చేపట్టిన రెండో ఆఫ్రికన్-అమెరికన్ మహిళ, తొలి దక్షిణాసియా సంతతి వ్యక్తి ఆమెనే.
కమల వయసు 54 సంవత్సరాలు. ఆమెను డెమొక్రటిక్ పార్టీలో బాగా ఎదుగుతున్న నాయకుల్లో ఒకరిగా చెబుతారు.
'మహిళా ఒబామా'
తొలి ఆఫ్రికన్-అమెరికన్ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో కమలను 'మహిళా ఒబామా'గా అభివర్ణించేవారు. 2016 సెనేట్ ఎన్నికలతోపాటు ఇతర ఎన్నికల్లో కమలకు ఒబామా మద్దతు పలికారు. ఆమెను ఒబామాకు సన్నిహితురాలిగా చెబుతారు.
డెమొక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడుతున్నట్లు ఇప్పటికే ఏడుగురు నేతలు ప్రకటించారు. ఈ పోటీలోకి వచ్చిన ఎనిమిదో నేత కమల. పోటీదారుల్లో ఎలిజబెత్ వారెన్, కిర్‌స్టెన్ గిలిబ్రాండ్, తులసి గబార్డ్, జాన్ డెలనీ, జూలియన్ క్యాస్ట్రో తదితరులు ఉన్నారు.
డెమొక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వానికి ఒకరి కన్నా ఎక్కువ మంది మహిళలు పోటీపడుతుండటం ఇదే తొలిసారి. 2020 డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష ప్రైమరీలో కమల సహా నలుగురు మహిళా అభ్యర్థులు పోటీపడుతున్నారు.
కమల రెండు పర్యాయాలు (2004-11) శాన్‌ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీగా పనిచేశారు. ఆ తర్వాత కాలిఫోర్నియా రాష్ట్ర అటార్నీ జనరల్ (2011-17)గా ఎన్నికయ్యారు. ఈ పదవికి ఎన్నికైన తొలి ఆఫ్రికన్-అమెరికన్ మహిళ కమలనే.
అబార్షన్, 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై విచారణ అంశాలపై అమెరికా సుప్రీంకోర్టు అసోసియేట్ జస్టిస్ బ్రెట్ కావనా అభిప్రాయాలకు సంబంధించి ఆయన్ను కమల బలంగా ప్రశ్నించారు. ఇది డెమొక్రాట్ల దృష్టిని ఆకర్షించింది.
తన సహాయకుల్లో ఒకరిపై వచ్చిన లైంగిక ఆరోపణల గురించి తనకు తెలియదని కమల లోగడ చెప్పినప్పుడు ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి 2016లో రాజీనామా చేశారు.
ఇవి కూడా చదవండి:
- ఈవీఎం హ్యాకింగ్: 2014 లోక్‌సభ ఎన్నికలు రిగ్గయ్యాయంటూ ‘అమెరికా సైబర్ నిపుణుడి’ ఆరోపణ.. ఖండించిన ఈసీ
- అభిప్రాయం: 'ప్రపంచ కప్ జట్టులో ధోనీ 'బెర్త్'పై ఇక ఎలాంటి డౌట్ లేదు'
- నమ్మకాలు-నిజాలు: ప్రసవమైన వెంటనే తల్లికి మంచినీళ్లు తాగించకూడదా?
- సోషల్ మీడియా: మీకు లాభమా? నష్టమా?
- సౌదీ: ‘నా చేత బలవంతంగా ప్రార్థనలు చేయించేవాళ్లు. రంజాన్‌లో ఉపవాసం ఉంచేవాళ్లు’
- భారత్‌లో పురుషుల కన్నా మహిళలకే ఎక్కువగా క్యాన్సర్! ఎందుకు?
- పక్షులను కాపాడే అమ్మాయి ప్రాణం మాంజాకు బలి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)