You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇస్లాంను మార్చేస్తున్న చైనా.. ఇందుకోసం పంచవర్ష ప్రణాళిక
చైనా తమ దేశంలోని ముస్లిం మైనారిటీల నియంత్రణను మరింత బలోపేతం చేయడానికి ఒక రాజకీయ ప్రచారం నిర్వహించబోతోంది.
దానికోసం చైనా ఒక పంచవర్ష ప్రణాళిక సిద్ధం చేస్తోంది., ఈ ప్లాన్ ప్రకారం ఇస్లాంను చైనీకరణ చేస్తారు. అంటే ఆ దేశంలో ఇస్లాం చైనా కమ్యూనిస్ట్ పార్టీ అభిప్రాయాలకు అనుగుణంగా ఉంటుంది.
ఈ పంచవర్ష ప్రణాళిక గురించి ఇప్పటివరకూ బయటకు రాలేదు. కానీ దీని ముసాయిదా గురించి జనవరి 6, 7 తేదీల్లో జరిగిన సమావేశం తర్వాత చైనీస్ ఇస్లామిక్ అసోసియేషన్ వెబ్‌సైట్‌లో ఉన్న ప్రెస్ రిలీజ్‌లో ప్రస్తావించారు.
చైనాలో లక్షల మంది వీగర్ ముస్లింలను షింజియాంగ్‌లోని శిబిరాల్లో ఉంచారనే కథనాలు వస్తున్న సమయంలో చైనీకరణ అనే ఈ కొత్త ఆలోచన తెరపైకి వచ్చింది.
షింజియాంగ్ ఒక స్వయం ప్రతిపత్తి ఉన్న ప్రాంతం. ఇది చైనాకు పశ్చిమంగా చాలా దూరంలో మధ్య ఆసియా సరిహద్దుల్లో ఉంది.
2015లో షీ జిన్‌పింగ్ బలమైన అపీల్ తర్వాత పార్టీలోని యునైటెడ్ ఫ్రంట్ వర్క్ డిపార్ట్‌మెంట్ అనే ఒక యూనిట్ ఇస్లాం, క్రైస్తవం, బౌద్ధం లాంటి విదేశీ మతాలను చైనీకరణ చేయడానికి ప్రాధాన్యం ఇస్తూ పనిచేస్తోంది.
ఈ యూనిట్ దేశంలో అస్థిరతకు కారణమయ్యే అంశాలను చల్లార్చడమే లక్ష్యంగా పనిచేస్తుంది.
పంచవర్ష ప్రణాళిక ఏంటి?
దేశంలోని ఇస్లాంను మరింత ఎక్కువ చైనీకరణ చేయడమే ఈ ముసాయిదా ఉద్దేశం అని తెలుస్తోంది.
ఈ ప్రణాళికలో భాగంగా చైనా సోషలిస్టు సిద్ధాంతాల ప్రకారం ఇస్లాంలో మార్పులు చేస్తారని జాతీయ స్థాయిలో ముస్లింలను ఏకం చేసి వారికి ప్రాతినిధ్యం వహించే చైనీస్ ఇస్లామిక్ అసోసియేషన్ తెలిపింది.
ఈ మార్పు గురించి బీజింగ్‌లోని చైనా ఇస్లామిక్ ఇన్‌స్టిట్యూట్ డీన్ గావో జైన్‌ఫూ జనవరి 6న చైనా ప్రభుత్వ వార్తా పత్రిక గ్లోబల్ టైమ్స్‌తో మాట్లాడారు.
"ఇస్లాం చైనీకరణ అంటే దాని గుర్తింపు, ఆచార-సంప్రదాయాలను, ఆలోచనా విధానం మార్చడం కాదు, దానిని సోషలిస్టు సమాజానికి అనుగుణంగా మార్చడం" అన్నారు.
"ప్రస్తుతం చైనాలో ఉన్న ఇస్లాం సమాజాలు రాజకీయంగా మెరుగుపరుచుకోడానికి, పార్టీ నాయకత్వాన్ని అనుసరించి తమ మతాన్ని చైనీకరణ చేయాలని కోరినట్లు" ఆ వార్తాపత్రిక తెలిపింది.
చైనీకరణ కోసం ఈ పంచవర్ష ప్రణాళికలో ఏమేం జరగవచ్చో కూడా కొన్ని పత్రికలు కథనాలు ప్రచురించాయి.
"ఇందులో భాగంగా ప్రాథమిక సామాజిక విలువలు, చట్టం, సంప్రదాయం-సంస్కృతి గురించి లెక్చర్స్, శిక్షణ ఉంటాయని" చైనా ఇస్లామిక్ అసోసియేషన్ చీఫ్ యంగ్ ఫెమింగ్ తెలిపారు.
ఒక సానుకూల భావన కలిగేలా రకరకాల కథల ద్వారా ముస్లింలకు మార్గనిర్దేశం చేస్తారు
"దేశంలోని ముస్లింలు ఇస్లాం చైనీకరణ గురించి మరింత బాగా తెలుసుకోవడానికి మదరసాల్లో పుస్తకాలు కూడా ఉంచుతారు" అని గావో జైన్‌ఫూ తెలిపారు.
అయితే, ఈ ప్రణాళిక గురించి వేరే వివరాలేవీ బయటకు రాలేదు. ప్రస్తుతం దాన్ని గోప్యంగా ఉంచారు. మొత్తం ప్రణాళిక ఏంటో ముందు ముందు వెలుగులోకి వస్తుందని గ్లోబల్ టైమ్స్ ప్రచురించింది.
మొత్తం ఐదు ప్రచారాలతోపాటు క్రైస్తవుల్లో వారి మతం, సోషలిస్టు విలువల మధ్య సంబంధాలను పెంచాలని, మతశాస్త్రాల మరింత లోతుగా చెప్పాలని, మత విద్యను క్రమబద్ధం చేయడం, చైనాపై విశ్వాసం పెంపొందించాలని, పరోపకారంపై దృష్టి పెట్టాలని ఈ ప్రణాళికలో చెప్పారు.
మీడియాలో ఈ వార్త ఎలా వచ్చింది?
ఈ వార్త మీడియాలో రావడం గురించి కూడా ప్రత్యేక అర్థాలు తీస్తున్నారు. చైనీకరణ అనే ఈ ప్రణాళికపై జరిగిన సమావేశానికి సంబంధించిన వార్త చైనా భాషలో వచ్చే పత్రికల్లో రాలేదు.
ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే చైనా మీడియా ఏడాదంతా ఇస్లాం చైనీకరణ గురించి వార్తలు అందిస్తూ వచ్చింది. ముఖ్యంగా చైనా అధికారులు దీనిని మత అతివాదంతో ప్రేరేపితం అవుతున్న తీవ్రవాదాన్ని నియంత్రించడానికి కీలక అడుగుగా భావించారు.
కానీ ఈ సమావేశానికి సంబంధించిన వార్త గ్లోబల్ టైమ్స్ ఇంగ్లీష్ ఎడిషన్‌లో వచ్చింది. కానీ చైనీస్ ఎడిషన్‌లో మాత్రం రాలేదు. అంటే అలా చేయడం ద్వారా ఈ అంశంతో అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించాలని చైనా ప్రభుత్వం అనుకుంటున్నట్టు భావిస్తున్నారు.
గ్లోబల్ టైమ్స్ ఎడిటర్ హు షిజిన్ గత ఆర్నెల్లుగా షింజియాంగ్‌కు చైనా ఎంత ప్రాధాన్యం ఇస్తోంది అనే అంశాన్ని చూస్తున్నారు.
ముఖ్యంగా వీగర్ ముస్లింలను ఆ ప్రాంతంలో ఉన్న నిర్బంధ శిబిరాల్లో ఉంచిన విషయాన్ని బీబీసీ సహా అంతర్జాతీయ మీడియా ప్రశ్నించినప్పటి నుంచి ఆయన ఇలా చేస్తున్నారు.
ఆ సమయంలో ఆ వార్తాపత్రికకు షింజియాంగ్‌లోకి వెళ్లడానికి అనుమతి లేదు. దాంతో హు షిజిన్ స్వయంగా అక్కడికి వెళ్లారు. ఆయనకు ఆ శిబిరం ఒక ఒకేషనల్ ట్రైనింగ్ కేంద్రం అని చెప్పారు. అతివాద ధోరణులు లేకుండా చేయడానికే దాన్ని ఏర్పాటు చేశామన్నారు.
వార్షిక ఇస్లామిక్ సమావేశంలో పాల్గొన్నది ఎవరు?
వార్షిక ఇస్లామిక్ సమావేశం బీజింగ్‌లో జరిగింది. బీజింగ్, షాంఘాయ్ సహా మరో ఆరు ప్రాంతాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.
చైనాలో ప్రధానంగా ముస్లిం జనాభా ఉన్న షింజియాంగ్ ప్రాంతానికి చెందిన ఒక్క ప్రతినిధి కూడా ఈ సమావేశంలో పాల్గొనలేదు అనేది ఇక్కడ గమనించాల్సిన విషయం.
ఇస్లాం చైనీకరణతో ఏమవుతుంది
షీ జిన్‌పింగ్ 2015లో యునైటెడ్ ఫ్రంట్ వర్క్ డిపార్ట్‌మెంట్‌లో చేసిన ప్రసంగంలో మొదటిసారి ఇస్లాంను చైనీకరణ చేయాలనే ప్రస్తావన తీసుకొచ్చారు.
షీ జిన్‌పింగ్ ఆ యూనిట్ కోసం మత సంబంధిత ఎజెండాను అందించారు. నాలుగు ప్రముఖ రంగాల్లో పనిచేయడం చాలా అవసరం అని వారికి చెప్పారు. వాటిలో మొట్టమొదటిది చైనీకరణ.
అప్పటి నుంచి యునైటెడ్ ఫ్రంట్ వర్క్ డిపార్ట్‌మెంట్ మసీదులపై ఎక్కువగా నియమ-నిబంధనలు అమలు చేయడం ప్రారంభించింది.
దీనిని క్షేత్ర స్థాయిలో అమలు చేయడానికి, ప్రధానంగా మసీదులపై జాతీయ జెండాను ఎగరేయాలి. అక్కడికి వచ్చేవారికి సోషలిజం గురించి, మహిళలను గౌరవించడం లాంటి ఇతర అంశాలను చెప్పాలి.
చైనా ప్రభుత్వం నిబంధనలను వెనకేసుకొస్తూ చైనీస్ ఇస్లామిక్ అసోసియేషన్ 2018 మేలో ఒక ఆర్టికల్ ప్రచురించింది.
అందులో మాటిమాటికీ ఖురాన్ గురించి ప్రస్తావించింది. అందులో ఖురాన్ దేశభక్తిని, మాట నిలబెట్టుకోవడాన్ని, నిష్పక్షపాతం, పరోపకారాలను బోధిస్తుందని, చెప్పింది. ముఖ్యంగా చైనాను ఒక విజ్ఞాన మూలంగా వర్ణించింది.
కానీ, ఈ వ్యాసంలో చివరి మూడు పదాలూ సరిగా లేవు. ఎందుకంటే ఖురాన్‌లో చైనా ప్రస్తావన లేదు. అయితే మహమ్మద్ ప్రవక్త "మీకు విజ్ఞానం కావాలంటే చైనా వరకూ వెళ్లండి" అన్నట్లు అరబ్బీలో ఒక మాట ఉందని చెబుతారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)