జార్జ్ హెచ్‌డబ్యూ బుష్: యుద్ధ విమాన పైలెట్ నుంచి అమెరికా అధ్యక్షుడి వరకు

జార్జ్ హెచ్‌డబ్యూ బుష్

ఫొటో సోర్స్, AFP

యూఎస్‌ఎస్‌ఆర్ ముక్కలుగా విడిపోవడం, తూర్పు యూరప్‌లో కమ్యూనిజం కూలిపోతున్న సమయంలో అమెరికా విదేశాంగ విధానాన్ని రూపుదిద్దిన, ప్రపంచ మొదటి సూపర్ పవర్‌గా తీర్చిదిద్దిన అధ్యక్షునిగా జార్జ్ హెచ్‌డబ్యూ బుష్‌ను పేర్కొనవచ్చు.

అమెరికాపై సడలిపోతున్న విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి, వియత్నాంలో జరిగిన పరాభవాలను మర్చిపోవడానికి ఆయన విధానాలు ఉపయోగపడాయని భావించవచ్చు.

అయితే అమెరికా అంతర్గత వ్యవహారాలను నిర్లక్ష్యం చేశారన్న అపవాదును ఎదుర్కొన్న బుష్ 1992లో జరిగిన ఎన్నికల్లో బిల్ క్లింటన్ చేతిలో ఓడిపోయారు.

జార్జ్ హెచ్‌డబ్యూ బుష్ రాజకీయ జీవితంలోని ముఖ్యాంశాలు:

విమానం కూలడంతో బుష్‌ను రక్షిస్తున్న సబ్‌మెరైన్ సిబ్బంది

ఫొటో సోర్స్, US Navy

ఫొటో క్యాప్షన్, విమానం కూలడంతో బుష్‌ను రక్షిస్తున్న సబ్‌మెరైన్ సిబ్బంది

కూలిన విమానం.. రక్షించిన సబ్‌మెరైన్

జార్జ్ హెర్బర్ట్ వాకర్ బుష్ 1924, జులై 12న మసచూసెట్స్‌లోని మిల్టన్‌లో జన్మించారు. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ అయిన ఆయన తండ్రి తర్వాత కాలంలో అమెరికా సెనెటర్‌గా ఎన్నికయ్యారు.

పెర్ల్ హార్బర్ ఘటన అనంతరం ఆయన అమెరికా నేవీలో పని చేస్తానని దరఖాస్తు చేసుకున్నారు. పైలెట్‌గా శిక్షణ పొందిన ఆయన రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌తో జరిగిన యుద్ధంలో పాల్గొన్నారు.

18 ఏళ్ల పిన్న వయసులో ఆయన పైలెట్‌గా టార్పెడో బాంబులను జారవిడిచారు.

ఒక బాంబింగ్ రెయిడ్ సందర్భంగా ఆయన విమానం సముద్రంలో కూలిపోయింది. అయితే అదృష్టవశాత్తూ అమెరికా సబ్‌మెరైన్ ఒకటి ఆయనను రక్షించింది. ఇదంతా ఒక కెమెరాలో కూడా రికార్డైంది కూడా.

1945లో నేవీ నుంచి విడుదలైన బుష్, 18 ఏళ్ల బార్బరా పియర్స్‌ను వివాహమాడారు. పెళ్లైన ఏడాదికి తర్వాత వారికి భవిష్యత్‌లో అమెరికా అధ్యక్షుడైన జార్జ్ వాకర్ బుష్ జన్మించారు.

బార్బరా బుష్, జార్జ్ హెచ్‌డబ్యూ బుష్

ఫొటో సోర్స్, George Bush Presidential Library

ఫొటో క్యాప్షన్, బార్బరా బుష్, జార్జ్ హెచ్‌డబ్యూ బుష్

40 ఏళ్లకు మిలియనీర్‌

తండ్రికి ఉన్న వ్యాపార సంబంధాలతో టెక్సాస్‌లో బుష్‌కు చమురు పరిశ్రమలో ఉద్యోగం దొరికింది. 40 ఏళ్లు వచ్చేసరికల్లా ఆయన మిలియనీర్‌గా మారారు.

క్రమంగా బుష్‌కు వ్యాపారం నుంచి రాజకీయాలపై ఆసక్తి మళ్లింది. స్థానిక రిపబ్లికన్ పార్టీ చైర్మన్‌గా పని చేసిన అనంతరం ఆయన టెక్సాస్ నుంచి అమెరికా సెనేట్ సీటుకు రిపబ్లికన్ అభ్యర్థిగా నామినేట్ అయ్యారు. ఆ ఎన్నికల్లో బుష్ డెమాక్రాట్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.

అయినా పట్టువిడవని బుష్, 1966లో హౌజ్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్‌కు పోటీ చేసి విజయం సాధించారు.

1970లో రిచర్డ్ నిక్సన్ బుష్‌ను సెనేట్‌కు పోటీ చేయమని కోరారు. కానీ బుష్ మరోసారి డెమోక్రాటిక్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో నిక్సన్ ఆయనను 1971లో ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారిగా, రిపబ్లికన్ పార్టీ ఛైర్మన్‌గా నియమించారు.

నిక్సన్ 1974లో బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చినపుడు, బుష్ అమెరికా అంతటా తిరిగి రిపబ్లికన్ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. అదే ఏడాది చివర్న ఆయన చైనాలో కొత్తగా ఏర్పాటైన అమెరికా మిషన్ అధినేతగా బీజింగ్ వెళ్లారు.

రోనాల్డ్ రీగన్‌తో జార్జ్ హెచ్‌డబ్యూ బుష్

ఫొటో సోర్స్, Keystone/Getty images

ఫొటో క్యాప్షన్, రోనాల్డ్ రీగన్‌తో జార్జ్ హెచ్‌డబ్యూ బుష్

బీజింగ్‌లో ఏడాది ఉన్న తర్వాత, అధ్యక్షుడు జెరాల్డ్ ఫోర్డ్ ఆయనను తిరిగి అమెరికా రప్పించి సీఐఏ (సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ) బాధ్యతలు తీసుకోమని కోరారు. అప్పటికే విదేశాలలో అనేక రహస్య ఆపరేషన్లు నిర్వహించిన సీఐఏ, అమెరికా పౌరులపై అనధికార గూఢచర్యం నిర్వహించిందన్న ఆరోపణలు ఎదుర్కొంటోంది.

ఫోర్డ్ అమెరికా అధ్యక్ష కార్యాలయం వీడాక, బుష్ 1978లో సీఐఏ నుంచి బైటికి వచ్చి, 1980లో జరగబోయే అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరపున నామినేషన్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.

1980 ప్రారంభం నాటికి ఆయన రోనాల్డ్ రీగన్‌కు ప్రధాన పోటీదారుగా నిలిచారు.

అధ్యక్ష ఎన్నికల్లో రీగన్ చేతిలో ఓడిపోయినా, ఆయనకు ఉపాధ్యక్ష పదవితో ఊరట లభించింది. దీంతో ఆయన భవిష్యత్తులో అధ్యక్ష పదవికి శిక్షణ పొందే అవకాశం లభించినట్లయింది.

ఇరాకీ ట్యాంకులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గల్ఫ్ యుద్ధంలో విజయం బుష్ అతి పెద్ద విజయం

100 గంటల్లో సద్దాంపై విజయం

1990లో ఇరాక్ కువైట్‌ను ఆక్రమించినప్పుడబు బుష్‌కు అసలైన పరీక్ష ఎదురైంది. బుష్ అత్యంత వేగంగా సద్దాం హుస్సేంకు వ్యతిరేకంగా ఒక కూటమిని ఏర్పాటు చేయడంలో విజయం సాధించారు.

తన చర్యలకు ఐక్యరాజ్య సమితి మద్దతు పొందేందుకు ఆయన మిలటరీ యాక్షన్‌ను కొంత ఆలస్యం చేశారు. దీని వల్ల ఆయన మార్గరేట్ థాచర్ నుంచి తీవ్రమైన వ్యాఖ్యలు ఎదుర్కొనాల్సి వచ్చింది.

ఆ యుద్ధంలో లభించిన విజయంతో అమెరికా గర్వం ఇనుమడించింది. కేవలం 100 గంటల్లో అమెరికా, మిత్రదేశాల సైన్యాలు సద్దాం బలగాలను ఓడించాయి. అధ్యక్షునిగా బుష్‌కు అదో పెద్ద విజయం.

అమెరికా, మిత్ర దేశాల సైన్యాలు బాగ్దాద్‌కు కొద్ది దూరంలో ఆగిపోయి, సద్దాం అధికారంలో కొనసాగేందుకు అవకాశమిచ్చినా, దాని వల్ల ఆయన ప్రతిష్ట ఇనుమడించింది. ఆ తర్వాత సద్దాంను పదవీచ్యుతుణ్ని చేయడం ఆయన కుమారుడి వంతైంది.

జూనియర్, సీనియర్ బుష్‌లు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, జూనియర్, సీనియర్ బుష్‌లు

రచ్చ గెలిచి, ఇంట ఓడిన బుష్

విదేశీ వ్యవహారాల విషయంలో ఆయనకు ప్రశంసలు లభించినా, స్వదేశంలో ఆర్థిక పరిస్థితిని పట్టించుకోలేదని ఆయనపై విమర్శలు వ్యక్తమయ్యాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత సుదీర్ఘ సమయం ఆర్థిక మాంద్యం కొనసాగింది ఆయన కాలంలోనే.

పరిస్థితి మెరుగుపడుతుందని ఆయన ఎంత ధైర్యం చెప్పినా, ప్రజలు ఆయనను విశ్వసించలేదు. దానికి తోడు తాను చేసిన హామీలకు భిన్నంగా ఆయన పన్నులను పెంచారు.

దీంతో 1992 ఎన్నికలు ఆయనకు పీడకలలను మిగిల్చాయి. బుష్ తన యువ ప్రత్యర్థి ఆర్కాన్సాస్ గవర్నర్ అయిన బిల్ క్లింటన్‌కు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. ఎన్నికల్లో బుష్ ఘోరంగా ఓడిపోయారు.

బార్బరా బుష్ అంత్యక్రియల సందర్భంగా..

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, బార్బరా బుష్ అంత్యక్రియల సందర్భంగా..

ప్యారాచూట్ ద్వారా కిందకు దూకి 90వ జన్మదినం జరుపుకున్నారు

తన కుమారుడు అమెరికా అధ్యక్షుడు కావడం ఆయనకు గర్వకారణమైనా, వాళ్లిద్దరి మధ్యా సంబంధాలు సరిగా లేవని అంటారు.

2014లో బుష్ ఒక ప్యారాచూట్ ద్వారా కిందకు దూకి తన 90వ జన్మదిన్నాన్ని జరుపుకున్నారు. అయితే ఆ తర్వాత ఆయన బయట కనిపించడం తగ్గిపోయింది. ఒక రకమైన పార్కిన్సన్ వ్యాధి కారణంగా ఆయన అప్పుడప్పుడూ వీల్ చెయిర్‌లో దర్శనమిచ్చేవారు.

ఆయన ఒక ప్రేరణనిచ్చే నాయకుడిగా కన్నా, ఒక నిర్వాహకుడిగానే ఎక్కువ పేరు తెచ్చుకున్నారు.

కువైట్‌లో జోక్యం, కమ్యూనిజం కూలిపోవడం వంటి అంశాలను చాలా సమర్థంగా నిర్వహించిన ఆయనకు, ఆర్థిక విషయాలలో అంత పట్టులేదని విమర్శకులు అంటారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)