You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వెనక్కి తగ్గిన వైట్ హౌస్.. సీఎన్‌ఎన్ రిపోర్టర్ పాసు పునరుద్ధరణ
సీఎన్‌ఎన్ రిపోర్టర్ జిమ్ అకోస్టా వైట్ హౌస్ పాసును పునరుద్ధరించారు. సుమారు రెండు వారాల క్రితం ఒక మీడియా సమావేశంలో అమెరికా అధ్యక్షుడితో వాదానికి దిగారంటూ ఆయన పాసును రద్దు చేశారు.
అకోస్టా పాసును పునరుద్ధరించాలంటూ ఒక జడ్జి ఆదేశించిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు.
ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూ వైట్ హౌస్, భవిష్యత్తులో మీడియా సమావేశాలు ఎలా ఉండాలన్న దానిపై మార్గదర్శకాలు జారీ చేస్తున్నట్లు ప్రకటించింది.
దీనిలో భాగంగా కేవలం ఒక జర్నలిస్టు ఒక ప్రశ్న మాత్రమే అడిగే అవకాశం ఉంటుంది.
అనుబంధ ప్రశ్నలు వేసే అవకాశం కేవలం అధ్యక్షుడు లేదా వైట్ హౌస్ అధికారుల ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుందని ఈ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ నిబంధనలు పాటించకుంటే అకోస్టా మీద చర్య తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
రిపోర్టర్లు తగిన ఔచిత్యం పాటించకుంటే భవిష్యత్తులో జరిగే మీడియా సమావేశాల నుంచి వాకౌట్ చేయాల్సి వస్తుందని ట్రంప్ గతంలో హెచ్చరించారు.
తన పాసు పునురుద్ధణపై హర్షం వ్యక్తం చేసిన అకోస్టా, వైట్ హౌస్ సమావేశాలలో పాల్గొనేందుకు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.
వివాదం ఎలా ప్రారంభమైంది?
నవంబర్ 8న జరిగిన మీడియా సమావేశం సందర్భంగా, మొదట ట్రంప్‌ను ఒక ప్రశ్న అడిగిన అకోస్టా.. అనంతరం మరో అనుబంధ ప్రశ్న అడిగారు. దీంతో ఒక వైట్ హౌస్ ఇంటర్న్.. అకోస్టా నుంచి మైకును లాక్కోవడానికి ప్రయత్నించారు.
ఆ సందర్భంగా అకోస్టా చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారని ట్రంప్ అన్నారు. ఆ మరుసటి రోజే అకోస్టా వైట్ హౌస్‌లో ప్రవేశంపై నిషేధం విధించారు.
దీంతో ఆయన పాసు పునరుద్ధరించాలంటూ సీఎన్‌ఎన్ కోర్టును ఆశ్రయించింది. దీనిపై ఇతర మీడియా సంస్థలు కూడా అకోస్టాకు మద్దతుగా నిలిచాయి.
శుక్రవారం వాషింగ్టన్ డీసీ జడ్జి ఒకరు అకోస్టా పాసు రద్దుపై వైట్ హౌస్ అధికారులు తగిన వివరణ ఇవ్వలేకపోయారని పేర్కొంటూ, పాసును పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)