You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అమెరికా: మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్‌కు ఎదురుదెబ్బ.. సభలో డెమొక్రాట్ల విజయం
అమెరికా ప్రజా ప్రతినిధుల సభకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్లు విజయం సాధించారు. సభలో ఇక వారిదే ఆధిపత్యం. దీంతో అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు ఎదురుదెబ్బ తగిలింది.
అమెరికా కాంగ్రెస్‌లో దిగువ సభగా పరిగణించే ప్రతినిధుల సభలో గత ఎనిమిదేళ్లలో తొలిసారి డెమొక్రాట్లు అధ్యక్షుడి అజెండాను అడ్డుకోగల శక్తిని సాధించారు.
అయితే, సెనేట్‌కు జరిగిన ఎన్నికల్లో మాత్రం ట్రంప్ పార్టీ అభ్యర్థులు గెలుపొంది, సభలో తమ పట్టును మరింత పెంచుకున్నారు.
అమెరికా అధ్యక్ష పదవిలో ట్రంప్ 2020 వరకూ కొనసాగుతారు. ఆ ఏడాది మళ్లీ అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. అయితే, ఈ మధ్యంతర ఎన్నికలను ట్రంప్ విధానాలపై రిఫరెండంగా పరిగణిస్తున్నారు.
రెండేళ్ల కిందట ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యారు. ఆ తర్వాత మళ్లీ దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలు ఇవే.
సత్తా చాటిన మహిళలు
అమెరికాలో ఈ ఎన్నికల సీజన్‌ను మహిళల సంవత్సరంగా పరిగణిస్తున్న నేపథ్యంలో.. ప్రతినిధుల సభకు జరిగిన ఎన్నికల్లో మహిళా అభ్యర్థులు తమ సత్తా చాటారు.
అమెరికా సభకు ఎన్నికైన అత్యంత పిన్న వయస్కురాలైన మహిళగా న్యూయార్క్ డెమొక్రాట్ అభ్యర్థి, 29 ఏళ్ల అలెగ్జాండ్రా ఒకాసియో కోర్టెజ్ రికార్డు సృష్టించారు.
మిన్నెసొట, మిచిగాన్‌ల నుంచి డెమొక్రాట్ అభ్యర్థులుగా బరిలో దిగిన ఇల్హాన్ ఒల్మర్, రషీదా తయిబ్‌లు కాంగ్రెస్‌కు ఎన్నికైన ‘మొదటి ముస్లిం మహిళ’గా చరిత్ర సృష్టించే అవకాశాలున్నాయి.
సభలో డెమొక్రాట్లు..
ప్రజా ప్రతినిధుల సభలో 435 స్థానాలు ఉన్నాయి. వాటన్నింటికీ ఇప్పుడు ఎన్నికలు జరిగాయి.
సభలో మెజార్టీ సాధించడానికి డెమొక్రాట్లకు గతంలో 23 స్థానాలు అవసరం. ఈ ఎన్నికల్లో వారు మెజార్టీ సాధిస్తారని బీబీసీ అమెరికా భాగస్వామ్య నెట్‌వర్క్ సీబీఎస్ అంచనా వేస్తోంది.
డెమొక్రాట్లకు మెజార్టీ వస్తే ఏం జరుగుతుంది?
అమెరికా అధ్యక్షుడి హోదాలో ట్రంప్ తీసుకున్న పరిపాలనా పరమైన, వ్యాపార పరమైన నిర్ణయాలపై డెమొక్రాట్లు విచారణ జరపొచ్చు. పన్ను చెల్లింపులు, వ్యాపార-రాజకీయ సంబంధ విరుద్ధ ప్రయోజనాల వ్యవహారాలపైనా దృష్టిసారించొచ్చు.
మరీ ముఖ్యంగా.. ట్రంప్ చేసే చట్టాలను గట్టిగా అడ్డుకోవచ్చు. మెక్సికో దేశ సరిహద్దులో భారీ గోడ కడతానంటూ ట్రంప్ చేసిన హామీ అమలుకు అడ్డుపడొచ్చు.
సెనెట్‌లో రిపబ్లికన్లు..
అమెరికా కాంగ్రెస్‌లోని ఎగువ సభ సెనెట్‌లో ట్రంప్ పార్టీ రిపబ్లికన్లకు ప్రస్తుతం 51 స్థానాలు ఉండగా డెమొక్రాట్లకు 49 స్థానాలు ఉన్నాయి.
అత్యంత స్వల్పంగా ఉన్న ఈ మెజార్టీని రిపబ్లికన్లు పెంచుకోనున్నారు. ముగ్గురు సిట్టింగ్ డెమొక్రాట్ అభ్యర్థులు ఇప్పటికే పరాజయం పాలయ్యారు. మరొక అభ్యర్థి బిల్ నిల్సన్ కూడా సీటు కోల్పోయేలా ఉన్నారు.
సెనెట్‌లో ఈ ఏడాది 29 డెమొక్రాట్ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. అదే సందర్భంలో రిపబ్లికన్ల స్థానాలు ఆరింటికి కూడా ఎన్నికలు ఉన్నాయి.
ట్రంప్‌పై పడే ప్రభావం ఎంత?
అమెరికాలో అధికారంలోకి వచ్చిన పార్టీ తాను ఎదుర్కొనే తొలి మధ్యంతర ఎన్నికల్లో ప్రతినిధుల సభలో సీట్లు కోల్పోవటం అనేది ఎప్పటి నుంచో ఆనవాయితీగా మారింది. ముఖ్యంగా అధ్యక్షుడికి జాతీయ స్థాయిలో ప్రజాకర్షణ తక్కువగా ఉందని భావించినప్పుడు ఈ ఆనవాయితీ తప్పనిసరిగా కొనసాగుతోంది.
కానీ, అధ్యక్షుడు ట్రంప్ మాత్రం తమ పార్టీ అభ్యర్థుల విజయం పట్ల చాలా త్వరగా స్పందించి, సంబరాలు చేసుకున్నారు.
‘‘ఈ రాత్రి అద్భుతమైన విజయం (లభించింది). మీ అందరికీ ధన్యవాదాలు!’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
గవర్నర్ల ఎన్నికల్లో ఏం జరుగుతోంది?
అమెరికాలో గవర్నర్ల పాత్ర, వారికి ఉండే అధికారాలు చాలా కీలకం. అధ్యక్ష ఎన్నికల్లో ఎక్కువ ప్రభావం చూపేది కూడా వారే.
ప్రస్తుతతం 50 రాష్ట్రాలకు గాను 36 రాష్ట్రాల గవర్నర్ల ఎన్నిక ప్రక్రియ జరుగుతోంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)