కాలిఫోర్నియా : బార్‌లో మాజీ సైనికాధికారి కాల్పులు.. 13 మంది మృతి

కాలిఫోర్నియాలోని థౌజెండ్ ఓక్స్‌ నగరంలోని ఒక బార్‌లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో పోలీసు అధికారి సహా 12 మంది మృతి చెందారని, మరో పది మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తీ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 11:20గంటల సమయంలో 'బార్డర్ లైన్ బార్'లో 28ఏళ్ల ఇయాన్ డేవిడ్ లాంగ్ అనే వ్యక్తి కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.

ఇయాన్ డేవిడ్ లాంగ్ అమెరికా మాజీ నౌకాదళ అధికారిగా పని చేశాడని, ప్రజలపై కాల్పులు జరిపాక, తాను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు విశ్వసిస్తున్నారు.

బార్ యాజమాన్యం తన వెబ్‌సైట్‌లో ఉంచిన సమాచారం మేరకు, బుధవారం రాత్రి బార్‌లో మ్యూజిక్ నైట్ నిర్వహించారు.

దాడికి పాల్పడిన వ్యక్తి.. స్మోక్ గ్రెనేడ్‌లు వాడాడని, తుపాకీతో కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

కాల్పులు జరుపుతుండగా, కొంతమంది కుర్చీలతో కిటికీలు పగలగొట్టేందుకు ప్రయత్నించారు. మరికొందరు టాయిలెట్లలో దాక్కుని ప్రాణాలు దక్కించుకున్నారు.

కాల్పులు జరిగిన సమయంలో బార్‌లో దాదాపు 200 మంది ఉన్నారు.

గురువారం ఉదయం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విటర్‌లో స్పందించారు. ఈ ఘటన గురించి అధికారులు తనకు వివరించారని, ఇది ఓ భయంకరమైన సంఘటన అని ట్వీట్ చేశారు. ఆ సమయంలో విధులు నిర్వహించిన పోలీసులను అభినందించారు.

నిందితుడు ఎవరు?

కాల్పులు ఎలా జరిగాయి?

నిందితుడు ఇయాన్ డేవిడ్ లాంగ్ నల్లటి దుస్తుల్లో వచ్చాడని, బార్ ముందున్న బౌన్సర్‌ను కాల్చి బార్‌లోకి చొరబడ్డాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

సంగీత కార్యక్రమం జరుగుతున్న చోటుకు వచ్చి, అక్కడున్నవారి మధ్యకు స్మోక్ గ్రెనేడ్ విసిరిన తర్వాత కాల్పులు ప్రారంభించాడని వారు వివరించారు.

సంఘటనా స్థలంలో పోలీసులు ఇయాన్ మృతదేహాన్ని, ఒక హ్యాండ్ గన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

కాల్పుల్లో గాయపడ్డ ఒక వ్యక్తి స్థానిక మీడియాతో మాట్లాడుతూ..

''మేమంతా నేలపై పడుకున్నాం. అక్కడున్న డీజే నా ఫ్రెండే. ఆమె వెంటనే మ్యూజిక్ ఆఫ్ చేసింది. ఎక్కడచూసినా అరుపులు, కేకలు. అంతా అయోమయంగా ఉంది'' అన్నారు.

తన 21వ పుట్టినరోజు జరుపుకుంటున్న మరో ప్రత్యక్ష సాక్షి టేలర్ విట్లర్ మాట్లాడుతూ..

''నేను డ్యాన్స్ ఫ్లోర్‌పై ఉన్నాను. కాల్పుల చప్పుడు వినగానే వెనక్కు తిరిగి చూశాను. 'నేలపై పడుకోండి..!' అంటూ అందరూ అరిచారు. నేను నేలపై పడుకున్నా. చాలామంది నన్ను తొక్కుకుంటూ వెళ్లిపోయారు. ఓ వ్యక్తి నా వెనుక నుంచి వచ్చి నన్ను బయటకు లాక్కువచ్చాడు'' అని అన్నారు.

''కాల్పుల సమయంలో అక్కడ ఒక పోలీసు అధికారి కూడా ఉన్నారు. తక్కినవారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నపుడు, తనపై కాల్పులు జరిగాయి. ఆయన వచ్చే సంవత్సరమే రిటైర్ కాబోతున్నారు'' అని షెరిఫ్ జఫ్ డీన్ అన్నారు.

మృతులంతా ఎవరు?

మృతుల్లో ఒకరు పోలీసు అధికారికాగా, తక్కిన 11మంది గురించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. బుధవారం రాత్రి జరిగిన 'మ్యూజికల్ నైట్' స్థానిక యూనివర్సిటీ విద్యార్థుల్లో చాలా పాపులర్.

ఈ బార్‌లో బుధవారం రాత్రిపూట్ల జరిగే సంగీత కార్యక్రమం విద్యార్థుల కోసమే జరుగుతుందని, 18ఏళ్ల వయసువారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని బార్ వెబ్‌సైట్‌లోని సమాచారం చెబుతోంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)