రోహింజ్యాల వలసలకు ఏడాది: శరవేగంగా ముదిరిన శరణార్థుల సంక్షోభం.. మీరు తెలుసుకోవాల్సిన విషయాలు

ప్రపంచంలోని పెను సంక్షోభాల్లో రోహింజ్యాల సమస్య ఒకటి..ఐక్యరాజ్య సమితి మాటల్లో చెప్పాలంటే ప్రపంచంలోనే శరవేగంగా ముదిరిన శరణార్థుల సంక్షోభం ఇది.

ప్రాణాలకు తెగించి సముద్రాన్ని దాటుకుంటూ కొందరు, కొండలు గుట్టల్లో కాలినడకన పారిపోతూ మరికొందరు.. ఇలా గత ఏడాది ఆగస్టు నుంచి 7 లక్షల మంది రోహింజ్యాలు మియన్మార్‌లోని ఉత్తర రఖైన్ రాష్ట్రం నుంచి పొరుగుదేశం బంగ్లాదేశ్‌కు తరలిపోయారు.

రఖైన్ రాష్ట్రంలో రోహింజ్యాలపై మియన్మార్ సైన్యం సాగించిన హింసాకాండే ఇంతటి భారీ వలసలకు కారణమని ఐక్యరాజ్యసమితి అంటుంటే.. మియన్మార్ సైన్యం మాత్రం తాము రోహింజ్యా తీవ్రవాదులతోనే పోరాడుతున్నామని, సాధారణ పౌరుల జోలికి పోవడంలేదని చెబుతోంది. ఎవరేం చెప్పినా రోహింజ్యా శరణార్థుల దురవస్థ మాత్రం చెప్పనలవి కాదు.

ఇంతకీ రోహింజ్యాలు ఎవరు?

రోహింజ్యాలు మియన్మార్‌లో నివసించే ఒక ముస్లిం తెగకు చెందిన ప్రజలు. మియన్మార్‌లోని ముస్లింల్లో అత్యధిక జనాభా వీరిదే. 2017 ప్రారంభంలో ఆ దేశంలో వీరి సంఖ్య 10 లక్షలు ఉండేది. వీరిలో అత్యధికులు రఖైన్ రాష్ట్రంలో నివసించేవారు.

వీరికి ప్రత్యేకమైన భాష, సంస్కృతి ఉంది. వీరిని అరబ్ వ్యాపారుల వారసులుగా చెబుతుంటారు.

కానీ, బౌద్ధుల ఆధిపత్యం ఉన్న మియన్మార్ ప్రభుత్వం రోహింజ్యాలను ఆ దేశ పౌరులుగా గుర్తించడం లేదు. 2014 జనాభా లెక్కల సమయంలో వీరిని పరిగణనలోకి తీసుకోలేదు.

బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చినవారిగా ఆ దేశం చెబుతోంది.

1970ల నుంచి రోహింజ్యాలు ఆసియాలోని వివిధ దేశాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో విస్తరించారు. అధికారిక లెక్కల కంటే వారి సంఖ్య ఎప్పుడూ ఎక్కువేనన్నది ఒక అంచనా.

తాజా సంక్షోభానికి ముందునుంచే గత కొన్నేళ్లుగా వీరు మియన్మార్‌లో చెలరేగుతున్న మత హింస, భద్రతా దళాల దాడుల నుంచి తప్పించుకోవడానికి గాను ఆ దేశాన్ని వీడడం ప్రారంభించారు.

ఎందుకు వలస వెళ్తున్నారు?

ప్రస్తుత భారీ వలసలకు ఏడాది పూర్తయింది. గత ఏడాది ఆగస్టు 25 ఇవి మొదలయ్యాయి.

ఆ రోజున భద్రతాదళాలు, పోలీసులకు చెందిన సుమారు 30 స్థావరాలపై స్థానిక రోహింజ్యా అర్సా తీవ్రవాదులు దాడులకు దిగగా మియన్మార్ సైన్యం ప్రతిదాడులతో భీకరంగా విరుచుకుపడింది. దీంతో పెద్ద ఎత్తున రోహింజ్యాలు పొరుగుదేశం బంగ్లాదేశ్‌లోకి వలసపోవడం ప్రారంభించారు. 5 లక్షల మందికిపైగా అలా వలస వెళ్లినట్లు అంచనా.

వీరంతా బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్ జిల్లాలో శరణార్థులుగా ఉంటున్నారు. వారిని కదిపితే.. మియన్మార్ సైన్యం అండతో స్థానిక బౌద్ధ మూకలు తమ ఇళ్లను తగలబెట్టి, వేలాది మందిని హతమార్చడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయి వచ్చామని చెబుతారు.

గత ఏడాది ఆగస్టులో ఈ హింస మొదలైన తరువాత ఆ ఒక్క నెలలోనే 6,700 మంది రోహింజ్యాలు దాడుల్లో మరణించినట్లు 'మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియన్స్' సంస్థ అంచనా వేసింది. ఇందులో అయిదేళ్ల లోపు పిల్లలు 730 మంది ఉన్నట్లు చెబుతున్నారు.

మియన్మార్ సైన్యం రోహింజ్యా మహిళలు, బాలికలపై అత్యాచారాలకు పాల్పడిందని ఆమ్నెస్టీ ఇంటర్నేషన్ సంస్థ నివేదికలు చెబుతున్నాయి.

అయితే, మియన్మార్ ప్రభుత్వం మాత్రం అర్సా తీవ్రవాదుల ఏరివేత చర్యలే తప్ప రోహింజ్యాలపై తమ సైన్యం దాడులు చేయలేదంటోంది. అంతేకాదు... 2017 సెప్టెంబరు 5తోనే ఈ ఆపరేషన్స్ ముగిసిపోయాయని, ఇందులో 400 మంది మరణించారని అంటోంది.

నిజానికి ప్రభుత్వం చెబుతున్న తేదీ తరువాత కూడా రోహింజ్యా గ్రామాలపై దాడులు జరిగినట్లు బీబీసీ ప్రతినిధులు గుర్తించారు.

2017 ఆగస్టు తరువాత కూడా ఉత్తర రఖైన్ రాష్ట్రంలో 288కి పైగా గ్రామాలు పూర్తిగా కానీ, పాక్షికంగా కానీ అగ్ని కీలల్లో దహనమైనట్లు హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ వద్ద ఉన్న ఉపగ్రహ చిత్రాలు చెబుతున్నాయి.

హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ చెబుతున్న ప్రకారం 2017 ఆగస్టు 25 నుంచి సెప్టెంబరు 25 మధ్య మాంగ్ద్వా టౌన్‌షిప్‌లో అత్యధికంగా నష్టం వాటిల్లింది. కానీ, మియన్మార్ నేత ఆంగ్‌సాన్ సూచీ మాత్రం ఆ ఏడాది సెప్టెంబరు 5 తరువాత తీవ్రవాదుల ఏరివేత చర్యలను ఆపేశామని చెబుతున్నారు.

సంక్షోభం తీవ్రత ఇలా..

'యునైటెడ్ నేషన్స్ హైకమిషనర్ ఫర్ రెఫ్యూజీస్' గణాంకాల ప్రకారం 2017 ఆగస్టుకు ముందే బంగ్లాదేశ్‌లోని శిబిరాల్లో 3,07,500 మంది రోహింజ్యాలు నివసిస్తున్నారు. ఆ తరువాత 6,87,000 కొత్తగా వచ్చినట్లు గుర్తించారు.

శరణార్థులుగా వస్తున్న రోహింజ్యాలంతా కట్టుగుడ్డలతో వస్తున్నారు. తలదాచుకోవడానికి ఇంత స్థలం వెతుక్కుంటూ తాగునీరు, తిండి వసతులు లేకున్నా బతుకీడుస్తున్నారు.

పెద్దసంఖ్యలో శరణార్థులు రావడంతో కుటుపలాంగ్, బలుకాళీ వంటి ప్రాంతాల్లోని శిబిరాలన్నీ నిండిపోయాయి. ఈ శిబిరాల బయట కూడా లక్షల సంఖ్యలో తాత్కాలిక గుడారాల్లో శరణార్థులున్నారు.

ఈ ఏడాది ఏప్రిల్ నాటికి బంగ్లాదేశ్‌లోని 9 శిబిరాల్లో సుమారు 8 లక్షల మంది శరణార్థులు ఉన్నారు.

వీరు కాకుండా శిబిరాల బయట లక్షమందికి పైగా ఉన్నారు.

సహాయ కార్యక్రమాలు

వర్షాకాలం రావడంతో ఈ శిబిరాల్లో ఉన్నవారి బతుకులు మరింత దయనీయంగా మారాయి. అప్పటికే సరైన తాగునీరు, ఆహారం అందుబాటులో లేకుండా బతుకుతున్న వారికి అంటువ్యాధుల రూపంలో మరో ప్రమాదం వచ్చి పడింది.

దుర్గమ ప్రాంతాల్లో ఈ శిబిరాల్లో ఉన్నందున వర్షాలకు కొండచరియలు, మట్టిపెళ్లలు జారిపడడం.. వరదల ముప్పు పెరిగింది. వీరిలో చాలామందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

* 'ఇంటర్‌సెక్టార్ కోఆర్డినేషన్ గ్రూప్' నివేదిక గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ఉన్న పరిస్థితుల ప్రకారం.. పది లక్షల మంది శరణార్థుల్లో 70 శాతం మందికి ఆహారం అందిస్తున్నారు.

* పోషకాహార లోపంతో బాధపడుతున్న లక్ష మందికి చికిత్స అందించారు.

* 2018 జనవరి రెండోవారం నాటికి పదిహేనేళ్ల లోపు చిన్నారులు 3,15,000 మందికి వ్యాధులు సంక్రమించకుండా టీకాలు వేశారు.

* బంగ్లాదేశ్ సైన్యం శరణార్థుల కోసం తాత్కాలికంగా 50 వేల పాయిఖానాలు నిర్మించింది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)