You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రోహింజ్యాలను వెనక్కు పంపేందుకు మయన్మార్‌తో బంగ్లాదేశ్ ఒప్పందం
శరణార్ధులుగా తమ దేశానికి వలస వచ్చిన లక్షలాది మంది రోహింజ్యాలను వెనక్కు పంపించేందుకు మయన్మార్‌తో బంగ్లాదేశ్ ఒక ఒప్పందం కుదుర్చుకుంది.
మయన్మార్ రాజధాని నయ్ ప్యీ డా నగరంలో ఇరు దేశాల అధికారుల మధ్య ఈ ఒప్పందం జరిగింది.
‘ఇది మొదటి అడుగు’ అని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ మంత్రి మహ్మూద్ అలీ అన్నారు. ‘వీలైనంత త్వరగా’ రోహింజ్యాలను తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మయన్మార్ ఉన్నతాధికారి మైంట్ క్యయింగ్ తెలిపారు.
రోహింజ్యాలంతా రెండు నెలల్లోపు తిరిగి వెళ్లవచ్చునని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. మిగతా అంశాలపై కసరత్తు చేస్తున్నట్లు ఇరు దేశాలూ వివరించాయి.
రోహింజ్యాల భద్రతకు హామీ లేకుండా వాళ్లను బలవంతంగా వెనక్కు పంపించటం పట్ల పలు సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి.
మయన్మార్‌లో సుదీర్ఘకాలంగా హింస, అణచివేతను ఎదుర్కొంటున్న రోహింజ్యాలు.. తమకంటూ ఒక దేశం లేని మైనార్టీలు. ఈ ఏడాది ఆగస్టులో రఖైన్ రాష్ట్రంలో హింస చెలరేగినప్పటి నుంచి దాదాపు ఆరు లక్షల మంది రోహింజ్యాలు పొరుగునే ఉన్న బంగ్లాదేశ్‌కు శరణార్ధులుగా వలస వెళ్లారు.
కాగా, ఈ ఒప్పందంలో భాగంగా మయన్మార్ విధించిన షరతులేమిటనేది బహిర్గతం కాలేదు.
తిరిగి వెళ్లే అంశంపై చాలామంది రోహింజ్యాలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మయన్మార్ పౌరసత్వం ఇచ్చి, తమ స్థలాలను తమకు అప్పజెప్పాలని బంగ్లాదేశ్‌లోని కుటుపలాంగ్ శిబిరంలోని శరణార్థులు అంటున్నారని రాయ్‌టర్స్ వార్తా సంస్థ పేర్కొంది.
రోహింజ్యా మైనార్టీ ప్రజలకు వ్యతిరేకంగా మయన్మార్ చేపట్టిన సైనిక చర్యను జాతి నిర్మూలన చర్యగా పరిగణించాల్సి ఉంటుందని అమెరికా విదేశాంగ కార్యదర్శి రెక్స్ టిల్లర్‌సన్ బుధవారం వ్యాఖ్యానించారు.
కాగా, రోహింజ్యా సంక్షోభంలో తమ పాత్రకు మయన్మార్ సైన్యం తనంతట తానుగా క్లీన్ చిట్ ఇచ్చుకుంది.
రోహింజ్యాలను చంపటం, వాళ్ల గ్రామాలకు నిప్పు పెట్టడం, మహిళలు, యువతులపై అత్యాచారం చేయటం, ఆస్తుల్ని దొంగిలించటం వంటి చర్యలేమీ తాము చేయలేదని తెలిపింది.
కానీ, బీబీసీ ప్రతినిధులు ఆ ప్రాంతంలో చూసినదానికి వ్యతిరేకంగా సైన్యం ప్రకటన ఉంది. ఐక్యరాజ్య సమితి సైతం రోహింజ్యా సంక్షోభాన్ని జాతి నిర్మూలనగానే పిలిచింది.
పోప్ ఫ్రాన్సిస్ ఈనెల 26వ తేదీన మయన్మార్‌లో పర్యటించనున్నారు. మయన్మార్ సైన్యాధ్యక్షుడు, ఆంగ్ సాన్ సూచీలతో పాటు పలువుర్ని ఆయన కలుస్తారని వాటికన్ తెలిపింది.
అనంతరం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో కూడా పోప్ పర్యటిస్తారు. అక్కడ రోహింజ్యా శరణార్థులను ఆయన కలుస్తారు.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)