You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చుట్టూ నీళ్లే కానీ, ఒక్క చుక్కా తాగలేను: కేరళ వరదల్లో చిక్కుకున్న బీబీసీ ప్రతినిధి
- రచయిత, ప్రమీలా కృష్ణన్
- హోదా, బీబీసీ ప్రతినిధి కేరళ నుంచి
‘మేడం, మా ఆయనకు ఈ మధ్యే కాలేయ మార్పిడి ఆపరేషన్ జరిగింది. మేం ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడి సురక్షిత ప్రాంతానికి వెళ్లడానికి సాయం చేయగలరా? మీరు టీవీ చానెల్‌లో పనిచేస్తున్నారు కదా?’... ఇది కేరళలో ఓ నిస్సహాయ మహిళ నన్ను కోరిన సాయం. ఈ క్లిష్ట పరిస్థితుల్లో జర్నలిస్టును కూడా వాళ్లు రక్షకులలాగా భావిస్తున్నారు.
గత వారం రోజులుగా నేను కేరళలోని ఈ దారుణమైన వరదలను కవర్ చేస్తున్నా. కానీ చివరికి నేనే వరద బాధితురాలిగా మారి సహాయం కోసం ఎదురుచూస్తానని రిపోర్టింగ్ మొదలుపెట్టడానికి ముందు అస్సలు ఊహించలేదు.
ఆ పెద్దావిడ నన్ను సాయం కోరగానే, ఆమె కన్నీళ్లు తుడిచి, ‘మరేం ఫర్వాలేదమ్మా. మనం అందరం సురక్షితంగా బయటపడతాం’ అని ధైర్యం చెప్పా.
కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రోగులను రక్షించడం సాధ్యం కాదని, మేముండే ఏడంతస్తుల హోటల్ చుట్టూ వరద నీరు చేరిందనీ, ఇలాంటి పరిస్థితుల్లో సహాయ శిబిరాలకు వెళ్లడం కంటే హోటల్లో ఉండటమే సురక్షితమని స్థానిక ఎమ్మెల్యే నాతో చెప్పారు.
‘మీ హోటల్ ఇప్పుడొక దీవిలో ఉంది. ఇప్పటికిప్పుడు మిమ్మల్ని బయటపడేయలేం. కానీ మీకు ఆహారాన్ని అందించడానికి ప్రయత్నిస్తాం’ అని ఎర్నాకుళం ఎమ్మెల్యే హిబి ఎడెన్ అన్నారు.
నేనుండే హోటల్లో మంచినీటి నిల్వలు అడుగంటుతున్నాయి. బేస్‌మెంట్ మొత్తం నీటితో నిండిపోయింది. త్వరలోనే నీటి ఉద్ధృతి తగ్గుతుందని ఇక్కడుండే దాదాపు వంద మంది భావిస్తున్నారు. మంచినీళ్లు చాలా తక్కువగా ఉన్నాయని, సమీపంలోని సహాయక శిబిరంలో కూడా నీళ్లు లేవని, మరో మార్గం కూడా కనిపించట్లేదని హోటల్ మేనేజర్ చెప్పారు.
ఇప్పుడు అందరం వర్షాలు తగ్గాలని, సూర్యోదయం కావాలని ఎదురుచూస్తున్నాం.
గత మూడ్రోజులుగా బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు లారీలు, హెలికాప్టర్లు, అగ్నిమాపక వాహనాలు, బోట్లు తిరుగుతున్నాయి. ఆ శబ్దాలకు అర్ధరాత్రులు నిద్రలో ఉలిక్కిపడి లేస్తున్నా. ఇక్కడ వేలాది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సాయం కోసం రోదిస్తున్న చాలామందిని నా కళ్లతో నేను చూశాను.
నా రిపోర్టింగ్ తొలిరోజున ఇడుక్కిలోని వరద బాధితులతో మాట్లాడాను. ఇడుక్కి ఓ కొండ ప్రాంతం. అక్కడ చాలాసార్లు కొండ చరియలు విరిగి పడ్డాయి. అక్కడ చర్చిలో ఏర్పాటు చేసిన సహాయక శిబిరానికి వెళ్లా. తల్లిదండ్రులను పోగొట్టుకున్న పిల్లలు, ఇల్లూవాకిలికి దూరమైన పెద్దలు, కన్నీళ్లు పెట్టుకున్న కుర్రాళ్లు ఇంకా నా కళ్ల ముందు మెదుల్తూనే ఉన్నారు. వాళ్లను ఓదార్చడానికి నాకు మాటలు సరిపోలేదు.
‘నేను ఇడుక్కిలోనే పుట్టి పెరిగా. ప్రతి సంవత్సరం ఇక్కడ భారీగా వర్షాలు కురుస్తాయి. కొండ చరియలు విరిగిపడతాయి. కానీ ఈసారి చాలా ఎక్కువగా వర్షాలు పడ్డాయి. కొండ చరియలు విరిగిపడటంతో మా ఇల్లు కూలిపోయింది. మా అమ్మానాన్నలు ఆ శిథిలాల్లో ఇరుక్కుపోయారు. అంతిమ సంస్కారాలు చేయడానికి వాళ్ల మృతదేహాలు కూడా నాకు దొరకలేదు’ అంటూ శాలి అనే యువతి కన్నీరు పెట్టుకుంది.
ఇడుక్కిలో ఇంటర్నెట్ సేవలు లేకపోవడంతో ఆఫీసుకు వార్తలు పంపించేందుకు నేను మూడో రోజున కోచీ వెళ్లాను. ఆ ఉదయం వార్తా పత్రికను తెరిచి చూస్తే... ఇడుక్కిలో నేను ఉన్న ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడిన ఫొటో కనిపించింది. నేను అపాయింట్‌మెంట్ ఫిక్స్ చేసుకున్న కొందరు వ్యక్తుల్ని కలిసేందుకు ఆ వరదలోనే కారులో బయల్దేరా.
కంపెనిపాడీ మెట్రో స్టేషన్ మొత్తం వరదలో చిక్కుకుంది. మా ఆఫీసుకు ఆ సమాచారాన్ని అందించా. గత 90ఏళ్లలో కోచీ నగరం వరదలకు గురికావడం ఇదే తొలిసారి. స్థానికులు వాటిని ఎదుర్కోవడానికి సిద్ధం కాలేకపోయారు.
‘ధనవంతులు కొందరు తమ ఇళ్లను వదిలి రావడానికి ఇష్టపడలేదు. వాళ్లు తమ ప్రాణాలకంటే ఆస్తులకే ఎక్కువ విలువిస్తున్నారు. వాళ్లను ఒప్పించడం మా వల్ల కాలేదు’ అని ఓ అధికారి చెప్పారు.
సహాయక సిబ్బంది చేతుల్లో చిన్నచిన్న పిల్లలున్నారు. కొందరు వృద్ధులైతే తమకు కనీసం మందులు తెచ్చుకోవడానికి కూడా సమయం దొరకలేదని కన్నీళ్లతో చెప్పారు.
నేను తిరిగి నా హోటల్‌కు చేరుకునేసరికి, మళ్లీ బయటకు వెళ్లడం కుదరదని, హోటల్ చుట్టూ వరద నీరు చేరిందని చెప్పారు. కానీ నాలుగో రోజున ధైర్యం చేసి అతి కష్టమ్మీద సమీపంలోని సురక్షిత కేంద్రాల్లో పరిస్థితి తెలుసుకునేందుకు వెళ్లాను.
అక్కడ మినీ ఎల్డోరా అనే పంచాయతీ సర్పంచ్ బాధితుల మంచి చెడులు తెలుసుకుంటూ కనిపించారు. ‘వరదల ధాటికి తమ ఇళ్లను కోల్పోయిన వైద్యులు కూడా ఈ శిబిరంలో తలదాచుకుంటున్నారు. ఈ ప్రాంతంలో ఎంతమంది సురక్షితంగా ఉన్నారో తెలీదు. వందలాది చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది తమ కుటుంబ సభ్యులకు దూరమయ్యారు. మానసికంగా బలహీనులయ్యారు’ అని మినీ బాధగా చెప్పారు.
అక్కడ పెట్రోలు బంక్ దొరకడం కూడా కష్టంగా మారింది. ఆ వరదలోనే కారులో ఒక్కో ఇంచు ముందుకు కదిలాం. కానీ ఐదో రోజున హోటల్ వదిలి బయటకు రాలేకపోయాం. హోటల్ మొదటి అంతస్తు మెట్ల దాకా నీళ్లు వచ్చేశాయి. విద్యుత్ సరఫరా ఆగిపోయింది. జనరేటర్ల సాయంతో హోటల్ వాళ్లు ఉదయం అరగంట, సాయంత్రం అరగంట విద్యుత్‌ను అందిస్తున్నారు. అప్పుడే మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవాలి.
ప్రజలను తరలించేందుకు చాలా లారీలు ప్రయాణిస్తున్నాయి. కానీ కళ్ల ముందు కనిపించే దృశ్యాలను డ్రైవర్లు నమ్మలేని పరిస్థితి. దాంతో స్థానికులు ఇచ్చే సూచనల ఆధారంగానే వాళ్లు లారీలను ముందుకు కదిలిస్తున్నారు. నీళ్లలో చిక్కుకోకుండా ఉండేందుకు చాలా లారీలు రివర్స్‌లో ప్రయాణిస్తూ కనిపించాయి.
ఆరో రోజున హోటల్‌లో మంచినీళ్లు కూడా అయిపోయాయి. నేను మంచినీళ్ల కోసం ఎదురుచూస్తూనే ఇదంతా రాస్తున్నాను. ‘చుట్టూ నీళ్లున్నా ఒక్క చుక్క కూడా తాగడానికి పనికిరాదు’ అనే మాట ఇప్పుడు నాకు గుర్తొస్తోంది.
కానీ ఈ కథనం ద్వారా ఇక్కడివారి బాధల్ని అందరితో పంచుకునే అవకాశం దొరికినందుకు మాత్రం సంతోషంగా ఉంది.
ఇవి కూడా చదవండి.
- ‘ఆ మాటలు విన్న తర్వాత పిల్లలను కనాలంటేనే సిగ్గుగా ఉంటుంది’
- నా ఎముకలు విరిచేసి పోలీసులకు అప్పగించాలని ఆ విద్యార్థులు ప్లాన్ చేశారు
- అటల్ బిహారీ వాజ్‌పేయి చితికి నిప్పంటించిన నమిత ఎవరు?
- పాకిస్తాన్‌లోని అత్యంత కట్టుదిట్టమైన జైలు నుంచి భారత పైలట్లు ఎలా తప్పించుకున్నారు?
- పగలు లాయర్లు... రాత్రుళ్లు బార్లో ‘డ్రాగ్’ డాన్సర్లు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)