కేరళ వరదలు: వందేళ్లలో కనీవినీ ఎరుగని విధ్వంసం

కేరళలో వరదలు సృష్టించిన విధ్వంసానికి వందల మంది ప్రాణాలు కోల్పోయారు.

రుతుపవనాలు మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఇక్కడ వరదలు, వర్షాల వల్ల జరిగిన ఇతర ప్రమాదాల్లో 324 మంది చనిపోయారని సమాచారం.

వరదల్లో చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక దళాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు.

కొండచరియలు విరిగిపడటంతో ఆ మట్టిలో కూరుకుపోవడం వల్ల ఎక్కువ మంది చనిపోయారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రమంతటా రెడ్ అలర్ట్ ప్రకటించారు. కోచి విమానాశ్రయాన్ని ఈ నెల 26 వరకు మూసివేస్తున్నట్లు తెలిసింది.

వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు వందలాది సహాయక దళాలను రంగంలోకి దింపారు. హెలికాప్టర్లు, లైఫ్‌బోట్లతో బాధితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.

సహాయక చర్యల కోసం 300లకు పైగా బోట్లను వినియోగిస్తున్నారని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తెలిపింది.

'ఇంతటి విపత్తును ఎన్నడూ చూడలేదు'

లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయాలంటూ ఇచ్చిన హెచ్చరికలను ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిన వేలాది మందికి ప్రభుత్వం ఆహార పదార్థాలు పంపిణీ చేస్తోంది.

శతాబ్ద కాలంలో కేరళలో ఎన్నడూ ఇంతటి వరద విపత్తు సంభవించలేదని ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు.

"ప్రస్తుతం రాష్ట్రంలోని దాదాపు అన్ని డ్యామ్‌లూ తెరిచి ఉన్నాయి. చాలా వరకు నీటి శుద్ధి కేంద్రాలు వరదల్లో మునిగిపోయాయి. మోటార్లు పాడైపోయాయి" అని ఆయన తెలిపారు.

ఓ డ్యామ్ నుంచి నీటిని వదిలేయడంలో తమిళనాడు ప్రభుత్వం విఫలమవ్వడం వల్ల పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారిందని ఆయన అన్నారు.

ప్రస్తుతం 1500 అత్యవసర సహాయక కేంద్రాల్లో 2,23,000 మందికి పైగా ఆశ్రయం పొందుతున్నారని ముఖ్యమంత్రి వెల్లడించారు.

రోడ్లు చెరువులయ్యాయి

రాష్ట్ర వాణిజ్య రాజధాని నగరం కోచి నీటిలోనే ఉంది. పర్యాటకానికి పేరుగాంచిన ఈ రాష్ట్రంలో అనేక చోట్ల రోడ్లు, రైలు మార్గాలు దెబ్బతిన్నాయి.

వరదలతో తీవ్రంగా నష్టపోయిన కేరళను కేంద్ర ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని ప్రధాని మోదీ, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చారు.

రాష్ట్రంలోని మొత్తం 14 జిల్లాల్లో పాఠశాలలు మూసివేశారు. భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని జిల్లాల్లో పర్యాటకులను నిషేధించారు.

కోచి శివారులో ఏర్పాటు చేసిన ఓ పునరావాస కేంద్రంలో 100 మంది చిన్నారులు సహా 450 మంది ఆశ్రయం పొందుతున్నారు. వారికి ఇన్ఫెక్షన్లు సోకకుండా అధికారులు వేడి వేడి ఆహార పదార్థాలు, మందులు పంపిణీ చేస్తున్నారు.

"ఇక్కడ ఏటా వర్షాలు పడతాయి. కానీ.. కోచి నగరాన్ని వరదలు ఎన్నడూ ఇంతగా ముంచెత్తలేదు" అని జిల్లా అధికారిణి మిని ఎల్డో అన్నారు. ప్రస్తుతం ఆమె కూడా పునరావాస కేంద్రంలోనే ఉంటున్నారు.

చాలా మంది ప్రజలు తమ విలువైన వస్తువులను వదిలి వెళ్లలేక, ఇళ్లలోనే ఉంటున్నారని ఆమె అన్నారు.

తెలుగు రాష్ట్రాల సాయం

వరదలతో అతలాకుతలమైన కేరళకు తెలంగాణ రాష్ట్రం తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 25 కోట్ల తక్షణ సాయం ప్రకటించారు. వరదల వల్ల నీరు కలుషితం అవుతున్నందున నీటిని శుద్ధి చేసేందుకు రూ.2.5 కోట్ల విలువైన ఆర్వో యంత్రాలను కేరళకు పంపాలని అధికారులను ఆదేశించారు.

మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.10 కోట్ల సాయం ప్రకటించారు. వస్తు రూపేణా, ఇతరత్రా సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.