వాజ్‌పేయి: దహన సంస్కారాలు నిర్వహించిన దత్త పుత్రిక

మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి అంత్యక్రియలు దేశ రాజధాని దిల్లీలోని స్మృతిస్థల్‌లో జరిగాయి. వాజ్‌పేయి దత్త పుత్రిక నమిత దహన సంస్కారాలు నిర్వహించారు.

భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉంచిన వాజ్‌పేయి భౌతికకాయాన్ని ఉదయం నుంచి పార్టీ ప్రముఖులు, కార్యకర్తలు సందర్శించుకుని నివాళులు అర్పించారు.

భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి గురువారం నాడు దిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 93 ఏళ్ళు.

మధ్యాహ్నం రెండు గంటలకు దిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి అంతిమ యాత్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న యమునా తీరంలోని స్మృతి స్థల్‌ వరకు సాగింది.

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, భూటాన్ నుంచి రాజు జిగ్మే వాంగ్చుక్ తదితరులు వాజ్‌పేయీకి నివాళులర్పించారు.

కాంగ్రెస్ నేత సోనియా గాంధీ, అధ్యక్షుడు రాహుల్ గాంధీలు బిజెపి ప్రధాన కార్యాలయానికిచేరుకుని వాజ్‌పేయి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.

పార్టీ కార్యకర్తలు కడసారిగా తమ నేతను చూసుకోవడానికి పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో పార్టీ ప్రముఖులు కొందరు కాలినడకన అంతిమయాత్రలో పాల్గొన్నారు.

అభిమానుల నినాదాల మధ్య కొనసాగిన అంతిమయాత్ర

అటల్ జీ అమర్ రహే అంటూ అంతిమ యాత్ర సాగుతున్నంత సేపూ నినాదాలు మిన్నంటాయి.

వాజ్‌పేయి దత్తపుత్రిక నమిత పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటుగా స్మృతిస్థల్‌కు చేరుకున్నారు.

యమునాతీరంలో రాజకీయ ప్రముఖులు, అభిమానులు, కార్యకర్తల సమక్షంలో నమిత చేతుల మీదుగా వాజ్‌పేయి భౌతిక కాయానికి దహన సంస్కారాలు పూర్తయ్యాయి.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.