గ్వాటెమాలా విషాదం: ఉప్పెనలా వచ్చిపడ్డ లావా.. 25కి పెరిగిన మృతుల సంఖ్య

గ్వాటెమలాలో భారీ అగ్నిపర్వతం పేలింది. ఈ ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు, వందల మంది గాయపడ్డారు.

దేశ రాజధాని గ్వాటెమలా నగరానికి నైరుతి వైపున 40 కిలోమీటర్ల దూరంలో ఈ అగ్నిపర్వతం ఉంది.

అగ్నిపర్వతం నుంచి వెలువడిన లావా ఉప్పెనలా ఓ గ్రామంపైకి దూసుకొచ్చింది. దాంతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. లావాలో చిక్కుకుని పలువురు ప్రాణాలు కోల్పోయారు.

లావా వేడి వల్ల మరో గ్రామానికి కూడా సహాయక సిబ్బంది వెళ్లలేకపోతున్నారని, అక్కడ కూడా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ విభాగం ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

పరిసర ప్రాంతాల్లో సహాయక దళాలను రంగంలోకి దింపినట్టు గ్వాటెమాలా అధ్యక్షుడు జిమ్మీ మొరాలెస్ తెలిపారు.

బాధితులను రక్షించేందుకు వెళ్లిన కొందరు విపత్తు నిర్వహణ విభాగం సిబ్బందిలో కూడా ఒకరు మరణించినట్టు అధికారులు వెల్లడించారు.

మృతుల్లో పలువురు చిన్నారులు కూడా ఉన్నారు.

సమీప ప్రాంతాల్లోని గ్రామాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు,

భారీగా పొగ, దుమ్ము కమ్ముకోవడంతో దేశ రాజధానిలోని విమానాశ్రయాన్ని మూసివేశారు.

1974 తర్వాత సంభవించిన అతిపెద్ద అగ్నిపర్వత పేలుడు ఇదేనని స్థానిక నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)