You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బాలిలో దట్టమైన పొగను ఎగజిమ్ముతున్న'అగుంగ్' అగ్నిపర్వతం
భయం..భయం.. ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయం. బాలిలోని అగుంగ్ అగ్ని పర్వతం, ఆ పరిసర ప్రాంతాల ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.
ఇండోనేషియా అధికారులు ఇప్పటికే హైఅలర్ట్ ప్రకటించారు. బాలి విమానాశ్రయాన్ని మూసేశారు. విమాన సర్వీసులు రద్దు చేశారు. దీంతో విహార యాత్రకు వెళ్లిన విదేశీ పర్యాటకులు అక్కడే చిక్కుకుపోయారు.
అగ్నిపర్వతం 11,150 అడుగుల ఎత్తు వరకు దట్టమైన పొగ ఎగచిమ్ముతోంది. పేలుడు శబ్ధాలు సుమారు 12 కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తున్నాయని 'నేషనల్ బోర్డ్ ఫర్ డిజాస్టర్ మెనేజ్‌మెంట్' అధికారులు చెప్పారు.
బూడిద, దట్టమైన పొగతో పాటు మంటలు కూడా కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు.
అధికారులు నాలుగో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అగ్నిపర్వతం పేలే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
అగ్నిపర్వతం నుంచి 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. స్థానికులకు మాస్కులు పంపిణీ చేస్తున్నారు.
వర్షాల వల్ల చల్లని లావా మరింత పెరిగే ప్రమాదం ఉందని నేషనల్ డిజాస్టర్ మెనేజ్‌మెంట్ ప్రతినిధి సుటుపో పుర్వో చెప్పారు. నది పరిసరాల్లో సంచరించొద్దని కూడా ఆయన సూచించారు.
అగ్నిపర్వతం ఉపరితలంపై మాగ్మా, కరిగిన రాళ్ల ఆనవాళ్లు ఉన్నట్లు నిపుణులు తేల్చారు.
అగ్నిపర్వతం నుంచి లావా ఎగిసిపడటానికి సిద్ధంగా ఉందని అడిలైడ్ యూనివర్శిటీ భూగర్భశాస్త్ర నిపుణుడు మార్క్ తింగై అంచనా వేస్తున్నారు. అయితే, ఏం జరుగుతుందో ముందే ఊహించడం కష్టమని కూడా ఆయన చెప్పారు.
ముందు జాగ్రత్త చర్యగా బాలి విమానాశ్రయాన్ని మూసివేశారు. అన్ని విమాన సర్వీసులను రద్దు చేశారు.
అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న బూడిత లొంబక్ నగరం అంతటా పడుతోంది. సుమారు 25వేల మంది ప్రజలు తాత్కాలిక సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. దాదాపు లక్ష 40వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.
నిజానికి గత సెప్టెంబర్‌లోనే అధికారులు తొలిసారి ముందస్తు హెచ్చరిక జారీ చేశారు. అప్పటి నుంచి స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం ప్రారంభించారు. కానీ అక్టోబర్‌లో హెచ్చరిక తీవ్రతను తగ్గించడంతో కొందరు తిరిగి తమ స్వస్థలాలకు చేరుకున్నారు.
ఇండోనేషియాలో 130 చురుకైన అగ్నిపర్వతాలు ఉన్నాయి. 1963లో 'అగుంగ్' అగ్నిపర్వతం పేలడంతో 1000 మంది చనిపోయారు.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)