You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఉగాండా: వాట్సాప్, ఫేస్‌బుక్‌లపై రోజుకు మూడు రూపాయల పన్ను
ఉగాండాలో సోషల్ మీడియాను ఉపయోగించే వారిపై పన్ను విధించనున్నారు. ఇటీవలే ఉగాండా పార్లమెంట్ ఈ వివాదాస్పద పన్ను ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
ఈ కొత్త చట్టం కింద ఫేస్‌బుక్, వాట్సాప్, వైబర్ లేదా ట్విటర్‌లను ఉపయోగించే వారిపై రోజుకు రూ. 3 పన్ను విధిస్తారు.
ఈ ప్రతిపాదనను మొదట అధ్యక్షుడు యోవెరి ముసెవెని తీసుకువచ్చారు. సోషల్ మీడియా వ్యర్థ ప్రసంగాలను ప్రోత్సహిస్తోందనేది ఆయన ప్రధాన ఆరోపణ.
ముసెవెని గత మార్చిలోనే సోషల్ మీడియా వినియోగంపై పన్ను విధించే ప్రతిపాదన తెచ్చారు. పన్ను వల్ల వచ్చే ఆదాయాన్ని వ్యర్థ ప్రసంగాల వల్ల జరిగే నష్టాలకు పరిహారంగా ఉపయోగించుకుంటామని అన్నారు.
జులై 1 నుంచి ఈ చట్టం అమలులోకి రానుంది. అయితే అన్ని మొబైల్ ఫోన్ సిమ్ కార్డులను రిజిష్టర్ చేయడానికే ప్రభుత్వం తిప్పలు పడుతుండగా, సోషల్ మీడియాపై రోజువారీ పన్నును ఎలా విధిస్తారు, ఎలా వసూలు చేస్తారు అని నిపుణులతో పాటు ఉగాండాలోని ప్రధాన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వం ఇదే చట్టంలో మొబైల్ లావాదేవీలపై కూడా 1 శాతం పన్నును విధించేలా సవరణలు చేసింది. దీని వల్ల బ్యాంకింగ్ సేవలను ఎక్కువగా ఉపయోగించుకోని పేదలపై భారం పడుతుందని ఉగాండాలోని పౌర సామాజిక సంస్థలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
అయితే ఉగాండా సహాయ ఆర్థిక మంత్రి డేవిడ్ బహాతి మాత్రం పెరిగిపోతున్న అప్పులను తీర్చడానికి ఇలాంటి పన్నులు ఉపయోగపడతాయని అన్నారు.
ఉగాండాలో సుమారు 2.36 కోట్ల మొబైల్ ఫోన్ వినియోగదారులు ఉన్నారు. వారిలో కేవలం 1.7 కోట్ల మంది మాత్రమే ఇంటర్నెట్ వినియోగిస్తున్నారని రాయిటర్స్ వార్తాసంస్థ పేర్కొంది. అందువల్ల సోషల్ మీడియాను ఉపయోగించే వారిని ఎలా గుర్తిస్తారన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు.
సోషల్ మీడియా పన్ను ప్రతిపాదనను విమర్శకులు తప్పుపడుతున్నారు. అది భావప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోవడమే అని అంటున్నారు.
ఉగాండాలో ప్రభుత్వ, ప్రతిపక్షాలకు సోషల్ మీడియా అన్నది ఒక ముఖ్యమైన రాజకీయ పరికరంగా మారిపోయింది. 2016 ఎన్నికల్లో 'అబద్ధపు ప్రచారాలను అడ్డుకొనేందుకు' సోషల్ మీడియాపై నిషేధం విధించారు.
ఉగాండాతో పాటు పలు ఇతర తూర్పు ఆఫ్రికా దేశాలు కూడా భావప్రకటనా స్వేచ్ఛను హరించే చట్టాలను చేస్తున్నాయి.
గత నెల 29న టాంజానియా ప్రభుత్వం బ్లాగర్ల నుంచి లైసెన్స్ ఫీజు వసూలు చేసే కేసులో విజయం సాధించింది.
గత నెల 30వ తేదీ నుంచి కెన్యాలో నూతన సైబర్ క్రైం చట్టం అమలులోకి వచ్చింది. అయితే ఆ చట్టంలోని కొన్ని భాగాలను తొలగించడంలో మాత్రం జర్నలిస్టులు, బ్లాగర్లు విజయం సాధించారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)