You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బ్రిటన్‌లో 15 నెలలుగా నౌకలో చిక్కుపడిన భారత నావికుడు
ఓ న్యాయపరమైన వివాదం కారణంగా బ్రిటన్‌లోని నార్‌ఫొక్ కౌంటీలో ఒక భారత నావికుడు 15 నెలలకు పైగా నౌకలోనే ఉంటున్నాడు.
భారత్‌కు చెందిన ఈ 'మాలవీయ ట్వెంటీ' నౌక 2016 జూన్‌లో ఇంగ్లాండ్ తూర్పు తీరంలోని గ్రేట్ యార్మౌత్‌కు చేరుకుంది. అప్పట్నుంచి నౌక అక్కడి అధికారుల అదుపులోనే ఉంది.
2017 ఫిబ్రవరిలో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ ప్రకారం నౌకలోని 13 మంది సిబ్బందిలో 43 ఏళ్ల కెప్టెన్ నికేష్ రస్తోగీ ఒకరు.
2015 అక్టోబర్ నుంచి ఈ నౌకలో 33 మంది సిబ్బంది పని చేశారనీ, వారికి వేతనాలు ఇవ్వలేదని అంతర్జాతీయ రవాణా కార్మికుల సమాఖ్య చెబుతోంది.
"నేను నౌకను వదిలి వచ్చేస్తే అది నా విధుల పట్ల బాధ్యతారాహిత్యం అవుతుంది. అలాగే నౌకను వేరే వాళ్లెవరైనా దాన్ని స్వాధీనం చేసుకోవచ్చు" అని ముంబైకి చెందిన కెప్టెన్ రస్తోగీ అంటారు.
"నౌక యజమానులు దివాలా తీశారు. 2017 జనవరిలో సిబ్బంది ఆ నౌకను ఇక నడపించలేం అన్నారు" అని కెప్టెన్ రస్తోగీ చెప్పారు.
నౌక సిబ్బంది అందరూ తిరిగి భారత్ చేరుకోగా, రస్తోగీ ఒక్కరే అందులో ఉండిపోయారు. నిరుడు సెప్టెంబరులో ముగ్గురు సిబ్బంది ఆయనకు తోడయ్యారు.
గత ఏడాది నుంచి తమ నలుగురికీ వేతనాలు చెల్లించలేదని ఆయన చెప్పారు.
ఐటీఎఫ్ ఈ నౌకను 2016 నవంబరులో, గ్రేటర్ యార్మౌత్‌లో నిర్బంధించింది. భారత్‌లోని ఐసీఐసీఐ బ్యాంకుకు చెల్లించాల్సిన 688,000 డాలర్లు (రూ.4,60,51,280) విడుదల చేసేవరకూ నౌకను హామీగా ఉంచుకుంది.
ఈ మొత్తంలో 2017 ఫిబ్రవరి నుంచి చెల్లించని వేతనాలు కూడా ఉన్నాయని ఐటీఎఫ్ చెప్పింది.
"నౌకను స్వాధీనం చేసుకుని దాన్ని అమ్మడం వల్ల, ఈ వివాదంలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరికీ డబ్బు చెల్లించవచ్చు, లోపల ఉన్న నలుగురు సిబ్బందిని తిరిగి స్వదేశానికి పంపించవచ్చు" అని ఐటీఎఫ్ ఇన్‌స్పెక్టర్ పాల్ కీనన్ చెప్పారు.
కానీ, నౌకను ఆపేసిన గ్రేట్ యార్మౌత్ రేవు అధికారులు మాత్రం, "19వ శతాబ్దానికి చెందిన చట్టం ప్రకారం, తమకు చెల్లించాల్సిన మొత్తానికి మూడు రెట్లు అదనంగా ఇవ్వాలి" అంటున్నారని ఆయన తెలిపారు.
కాగా, రేవును నిర్వహిస్తున్న పీల్ పోర్ట్ ప్రతినిధి "కొనసాగుతున్న ఈ చట్టపరమైన వివాదం"పై మాట్లాడేందుకు నిరాకరించారు.
ఇదే సంస్థకు చెందిన మాలవీయ 7 నౌకలోని సిబ్బందిని, స్కాట్లాండ్‌లోని అబెర్‌దీన్ రేవులో నిర్బంధించారు. వారిని నవంబరులో తిరిగి స్వదేశానికి పంపించారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)