You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
#వన్ పైసా జోక్ #వన్ పైసా ఇన్సల్ట్ # వన్ పైసా కట్
పెట్రోల్ ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గత రెండు వారాలుగా పెరిగిన ధరలపై ఆన్‌లైన్‌లో చర్చలు నడుస్తున్నాయి.
అయితే.. బుధవారం పెట్రోల్, డీజిల్ ధరలపై ఒక పైసా తగ్గింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మొదలుకుని సామాన్యుడి వరకూ పలువురు కేంద్రంపై విరుచుకుపడ్డారు.
''ప్రియమైన ప్రధాని గారూ,
పెట్రోల్, డీజిల్ ధరలపై మీరు ఒక్క పైసా తగ్గించారు. ''ఒక్క పైసా??''
ఒకవేళ పరిహాసం చేయాలనుకునే ఈ ఆలోచన మీదే అయితే, ఇది చాలా పిల్లతనంగా అనిపిస్తోంది.
గత వారంలో నేను విసిరిన 'ఫ్యూయెల్ చాలెంజ్'కు ఇది సరైన స్పందన కాదు'' అని రాహుల్ గాంధీ ఘాటుగా ట్వీట్ చేశారు.
అయితే.. పెట్రో, డీజిల్‌పై తగ్గిన 'ఒక్క పైసా'తో మేం ఏంచేయాలి? ఏం కొనుక్కోవాలి? ఇల్లు కొనుక్కోవాలా, కారు కొనుక్కోవాలా? అని ప్రజలు చమత్కరిస్తున్నారు.
ఇలా ఒక్క పైసా తగ్గించడం అన్నది పుండుపై కారం చల్లినట్లుందని ఒకరు ట్వీట్ చేస్తే, నిన్నటి వరకూ నా కారును వాడరాదని నిర్ణయించుకున్నా. కానీ ఈరోజు ఒక్క పైసా తగ్గించడంతో ఎంతో రిలీఫ్ అనిపించింది. నా నిర్ణయాన్ని వెంటనే మార్చుకున్నా అని మరొకరు వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
ప్రభుత్వం తగ్గించిన ఒక్క పైసాతో కలిగే ఆదాయాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడిగా పెడతానంటూ ఒకరు ట్వీట్ చేస్తే, మరొకరు ఏకంగా ఒకపైసా, రెండు పైసలు, ఐదు, పది పైసల నాణేల ఫోటోలను.. ‘మోదీ దార్శనికత’ అంటూ పోస్ట్ చేశారు.
‘థాంక్యూ.. కొత్త ఫోన్ కొనుక్కోవడానికి డబ్బుల్లేకపోయె. ఇప్పుడు ఒక్క పైసా తగ్గించడంతో కొత్త ఫోన్‌కు సరిపడా డబ్బులను ఆదే చేయగలిగా..’ అని మోనిష్ అనే వ్యక్తి కామెంట్ చేశాడు.
ఇలా ట్విటర్‌లో ‘వన్ పైసా ఇన్సల్ట్, వన్ పైసా జోక్, వన్ పైసా కట్’ వంటి హ్యాష్‌ట్యాగ్స్ ప్రత్యక్షమయ్యాయి.
కర్నాటక ఎన్నికల పుణ్యమా అని పెరగని పెట్రోలు ధరలు ఎన్నికల తర్వాత పరుగులు పెట్టాయని, ఇప్పుడు ఒక్క పైసా తగ్గడం పండగే. అచ్ఛేదిన్ అంటే ఇదే మరి.. అంటూ వీరభద్ర అనే వ్యక్తి ట్వీట్ చేశారు.
అయితే.. తగ్గిన పెట్రోల్ ధరల అంశం ఎప్పుడో మరచిపోయిన ‘ఒక పైసా’కు సోషల్ మీడియాలో మళ్లీ ప్రాణం పోసింది.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)