మలేసియా: 60 ఏళ్లుగా పాలిస్తున్న కూటమిని ఓడించి.. 92 ఏళ్ల వయస్సులో మళ్లీ ప్రధాని అవుతున్నారు

మలేసియా సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ప్రధాని మహతిర్ మొహమద్ చారిత్రక విజయం సాధించారు.

దేశంలో గత 60 ఏళ్లకు పైగా అధికారంలో కొనసాగుతున్న బారిసన్ నేషనల్ కూటమి ప్రభుత్వాన్ని 92 ఏళ్ల మహతిర్ ఓడించారు.

రాజకీయాల నుంచి రిటైర్ అయిన మహతిర్.. తన మాజీ సహచరుడు, అవినీతి, ఆశ్రిత పక్షపాతం ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధానమంత్రి నజీబ్ రజాక్‌పై పోటీ చేసేందుకు మళ్లీ బరిలో దిగారు. నజీబ్‌కు రాజకీయ గురువు మహతిర్.

‘‘మేం ప్రతీకారం తీర్చుకోవాలనుకోవటం లేదు. న్యాయాన్ని పునరుద్ధరించాలనుకుంటున్నాం’’ అని మహతిర్ విలేకరులతో అన్నారు.

మొత్తం 222 పార్లమెంటు సీట్లకు గాను ప్రభుత్వ ఏర్పాటుకు 112 సీట్లు అవసరం కాగా.. మహతిర్ నాయకత్వంలోని పకటన్ హరపన్ కూటమి 115 సీట్లలో విజయం సాధించిందని ఎన్నికల సంఘం తెలిపింది. ప్రస్తుత ప్రధాని నజీబ్ రజాక్ నేతృత్వంలోని బీఎన్ కూటమికి 79 సీట్లు దక్కాయి.

‘ప్రపంచ రికార్డు’

ప్రమాణ స్వీకారం గురువారం జరగొచ్చని మహతిర్ చెప్పారు. ప్రపంచంలో ఎన్నికైన ప్రభుత్వాధినేతల్లో అత్యధిక వయస్కుడు ఆయనే కానున్నారు.

మహతిర్ గతంలో బీఎన్ కూటమిలో ఉండేవారు. 1981 నుంచి 2003 వరకు 22 ఏళ్లపాటు ఆయన ప్రధానిగా చేశారు.

2016లో బీఎన్ కూటమి నుంచి బయటకొచ్చారు. అనంతరం పకటన్ హరపన్‌లో చేరారు.

అధికార బీఎన్ కూటమి ప్రభుత్వంలో నజీబ్ రజాక్‌కు చెందిన యునైటెడ్ మలేస్ నేషనల్ ఆర్గనైజేషన్ (యూఎంఎన్ఓ) ప్రధాన పార్టీ. బ్రిటన్ నుంచి 1957లో స్వాతంత్ర్యం లభించినప్పటి నుంచి ఈ కూటమి మలేసియా రాజకీయాలపై ఆధిపత్యం కొనసాగించింది. అయితే, గత కొద్ది సంవత్సరాలుగా ఈ కూటమి ప్రజాకర్షణ తగ్గింది.

ఎన్నికల ఫలితాలు స్పష్టం కావడంతో మహతిర్ మద్దతుదారులంతా వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. గురు, శుక్రవారాలను జాతీయ సెలవు దినాలుగా ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు.

నజీబ్‌పై అవినీతి ఆరోపణలు

అవినీతి, ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి అధికార బారిసన్ నేషనల్ కూటమి ప్రభుత్వంపై చాలా ఆరోపణలు వచ్చాయి.

2015లో ప్రభుత్వ పెట్టుబడి నిధి నుంచి 700 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.4700 కోట్ల)ను తన వ్యక్తిగత బ్యాంకు ఖాతాకు మళ్లించారన్న ఆరోపణలు నజీబ్ ప్రతిష్ఠను దెబ్బతీశాయి. ఈ ఆరోపణల్ని ఆయన కొట్టిపారేశారు. ప్రభుత్వ వ్యవస్థలు ఆయనకు క్లీన్‌చిట్ ఇచ్చాయి. అయితే, కీలక అధికారుల్ని తొలగించి ఈ దర్యాప్తును నీరుగార్చారని నజీబ్‌పై ఆరోపణలున్నాయి.

పెట్టుబడి నిధిపై ఇప్పటికీ పలు దేశాలు దర్యాప్తు జరుపుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)