You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇరాన్ అంశంపై ఐరాసలో అమెరికాపై రష్యా ఆగ్రహం
ఇరాన్‌లో అల్లర్ల విషయంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా వ్యవహరిస్తున్న తీరును రష్యా తీవ్రంగా తప్పుబట్టింది.
ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో ఐరాస భద్రతా మండలి తలదూర్చడం మంచిది కాదని ఐక్యరాజ్య సమితిలో రష్యా రాయబారి వస్సిలీ నెబెంజియా అన్నారు.
అంతకు ముందు కొద్దిసేపటి క్రితమే ఇరాన్‌లో జరుగుతున్న ఆందోళనలను 'అత్యంత ధైర్యవంతులు చేస్తున్న పోరాటం'గా అమెరికా ప్రతినిధి నిక్కీ హేలీ అభివర్ణించారు.
అమెరికా వ్యాఖ్యలపై ఇరాన్ కూడా తీవ్రంగా అభ్యంతరం చెప్పింది.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కలిగిన అమెరికా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఇరాన్ రాయబారి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొద్దిరోజులుగా ఇరాన్‌లో జరుగుతున్న ఆందోళనల్లో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల మందిని పోలీసులు అరెస్టు చేశారు.
దేశ ఆర్థిక పరిస్థితి కుంటుపడిందంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మషద్ నగరంలో డిసెంబరు 28న ప్రారంభమైన ఆందోళనలు.. క్రమంగా ఇతర ప్రాంతాలకూ పాకాయి.
అనేక చోట్ల పరిస్థితులు హింసాత్మకంగా మారాయి. భద్రతా దళాలు, నిరసనకారుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
'ఇది తిరుగుబాటు' అని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ అధిపతి వ్యాఖ్యానించారు. తిరుగుబాటుదారులు పరాజయం పొందారని ఆయన బుధవారం ప్రకటించారు.
మరోవైపు.. ప్రభుత్వానికి మద్దతుగానూ పెద్దఎత్తున ర్యాలీలు జరుగుతున్నాయని ఇరాన్ అధికారిక మీడియా పేర్కొంది.
శుక్రవారం వేలాది మంది ప్రభుత్వ మద్దతుదారులు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపినట్టు తెలిపింది.
ఇరాన్ అల్లర్ల అంశంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశంలో అమెరికా తీరును పలు దేశాలు తప్పుబట్టాయి.
"నైతికంగా.. రాజకీయంగా.. న్యాయపరంగా.. అమెరికా తన విశ్వసనీయతను కోల్పోయింది" అని ఇరాన్ ప్రతినిధి ఘోలమాలి ఖోష్రూ అన్నారు.
ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)