ఇరాన్‌‌లో నిరసన ప్రదర్శనలకు మూలాలేంటి?

ఇరాన్‌లో 2009 తర్వాత అత్యంత తీవ్ర స్థాయి ఆందోళనలు ఇప్పుడు జరుగుతున్నాయి. నాడు అధ్యక్ష ఎన్నికలు వివాదాస్పదమైనప్పుడు, వాటిని తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ప్రజలు వీధుల్లోకి పోటెత్తారు. నాటి ఆందోళనలు దేశ రాజధాని టెహ్రాన్ కేంద్రంగా జరగ్గా, ప్రస్తుత నిరసనలు ఆ దేశమంతటా కొనసాగుతున్నాయి.

ఈ ఆందోళనలకు కారణాలేంటి? ఎక్కడ మొదలయ్యాయి?

నిరసనకారుల డిమాండ్లు ఏమిటి? ఎవరు నాయకత్వం వహిస్తున్నారు? ప్రభుత్వం ఏం చెబుతోంది?

అంతర్జాతీయ సమాజం ఏమంటోంది? - ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈ కథనంలో...

ధరల పెరుగుదల, నిరుద్యోగం, 'అవినీతి', 'రాజకీయ అణచివేత'లకు నిరసనగా సుమారు 50 నగరాలు, పట్టణాల్లో భారీయెత్తున ప్రజలు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. వేల మంది వీధుల్లోకి వచ్చి, మొత్తం వ్యవస్థ తీరునే నిరసిస్తున్నారు.

అనేక చోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. భద్రతా దళాలు, నిరసనకారుల మధ్య ఘర్షణలు చోటుచేసుకొంటున్నాయి. వీటిలో ఇప్పటివరకు 21 మంది చనిపోయారు. వందల మందిని అధికారులు అరెస్టు చేశారు.

మషద్‌లో మొదలు

టెహ్రాన్ తర్వాత ఇరాన్‌లో అత్యధిక జనాభా ఉండే మషద్ నగరంలో డిసెంబరు 28న ఆందోళనలు మొదలయ్యాయి. నిత్యావసరాలు, ఇతర ప్రాథమిక అవసరాలను తీర్చే వస్తువుల ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ప్రజలు వీటిని చేపట్టారు. మషద్ ఇరాన్ ఈశాన్య ప్రాంతంలోని రజావి ఖొరాసన్ రాష్ట్ర రాజధాని.

ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో, భారీగా ఉన్న నిరుద్యోగితను తగ్గించేలా ఉద్యోగావకాశాలు కల్పించడంలో, ధరలకు కళ్లెం వేయడంలో, అవినీతిని అడ్డుకోవడంలో అధ్యక్షుడు హసన్ రౌహానీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ నిరసనకారులు ఆందోళనలు మొదలుపెట్టారు.

స్వదేశంలో ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే వారి గురించి పట్టించుకోకుండా మధ్యప్రాచ్యంలోని ఇతర దేశాల్లో సంక్షోభాలకు సంబంధించి ప్రభుత్వం ఎందుకు పెద్దయెత్తున డబ్బు ఖర్చు చేస్తోందని ఆందోళనకారులు ప్రశ్నించారు.

తర్వాత వారు నేరుగా కీలక నాయకులపైనే విమర్శలు ఎక్కుపెట్టారు. 'నియంత అంతం కావాలి' అని ఆదివారం టెహ్రాన్‌లో జరిగిన ఆందోళనల్లో దేశ సర్వోన్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీని ఉద్దేశించి నినదించారు.

1979లో అంతమైన రాచరిక వ్యవస్థ తిరిగి రావాలనే డిమాండ్లు కూడా కొందరి నుంచి వినిపిస్తున్నాయి.

సోషల్ మీడియాపై ఆంక్షలు

ఆందోళనల పట్ల భద్రతా దళాలు మొదట్లో కొంత మేర సంయమనం పాటించాయి. డిసెంబరు 28న మషద్ నిరసనల్లో ఆందోళనకారులను వాటర్ క్యానన్లు ప్రయోగించి చెదరగొట్టారు. కొద్ది మందిని అరెస్టు చేశారు.

ఆందోళనలు ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందే కొద్దీ అధికార యంత్రాంగం, భద్రతా దళాల చర్యలు తీవ్రతరమవుతూ వచ్చాయి.

ఇరాన్ అధికార యంత్రాంగం ఆందోళనల నేపథ్యంలో సోషల్ మీడియా వెబ్‌సైట్లు, మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌‌లను ప్రజలు వినియోగించకుండా ఆంక్షలతో అడ్డుకుంటోంది.

ప్రజలు ఆందోళనలకు పిలుపునివ్వకుండా, సంబంధిత వీడియోలు, ఫొటోలు ఆన్‌లైన్‌లో పెట్టకుండా చూసేందుకు ఈ చర్యలు చేపడుతోంది.

పరిష్కారానికి సమయం పడుతుందన్న అధ్యక్షుడు

ఆందోళనలపై అధ్యక్షుడు హసన్ రౌహానీ స్పందిస్తూ- ప్రభుత్వాన్ని విమర్శించే స్వేచ్ఛ, నిరసనలు చేపట్టే స్వేచ్ఛ ప్రజలకు ఉందని చెబుతూనే, సమాజంలో అశాంతిని సృష్టించే, శాంతి భద్రతలకు భంగం కలిగించే, ప్రజా ఆస్తులకు నష్టం కలిగించే వారిని భద్రతా దళాలు ఉపేక్షించబోవని హెచ్చరించారు.

ఇరాన్ సమస్యల పరిష్కారానికి సమయం పడుతుందని, ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని అధ్యక్షుడు కోరారు. ఆయన ప్రకటన తర్వాత కూడా పరిస్థితులు సద్దుమణగలేదు.

అశాంతికి కారణం మీరంటే మీరంటూ సంస్కరణవాదులు, సంప్రదాయవాదులు పరస్పరం విమర్శలు చేసుకొంటున్నారు. రెండు పక్షాలూ విదేశీ శక్తుల హస్తం ఉందని కూడా ఆరోపిస్తున్నాయి.

ఇరాన్ శత్రువులు వారి డబ్బు, ఆయుధాలు, రాజకీయాలు, గూఢచర్యాన్ని ఉపయోగించి, దేశానికి సమస్యలు సృష్టిస్తున్నారని అయతొల్లా ఖమేనీ పేర్కొన్నారు.

ఎక్కువ మంది నిరుద్యోగులు, పేదలే

నినాదాలను బట్టి చూస్తే వివిధ రకాల గ్రూపులు ఆందోళనల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. జాతీయస్థాయి నాయకులెవరూ లేకుండానే ఈ ఉద్యమం సాగుతున్నట్లు కనిపిస్తోంది.

నిరసనకారుల్లో ఎక్కువగా కుటుంబాలను పోషించేందుకు అవస్థలు పడుతున్న నిరుద్యోగులు, పేదలు ఉన్నారు.

గత దశాబ్ద కాలంలో ఇరాన్‌లో పేదరికం 15 శాతం పెరిగిందని బీబీసీ పర్షియన్ ఇటీవల జరిపిన ఒక పరిశీలనలో వెల్లడైంది. బ్రెడ్, పాలు, మాంసం వినియోగం 30 నుంచి 50 శాతం తగ్గిందని తేలింది.

ప్రభుత్వ లెక్కల ప్రకారం- నిరుద్యోగిత రేటు 12.4 శాతంగా ఉంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇది 60 శాతానికి పైగా ఉందని అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రి అబ్దోల్‌రెజా రహ్‌మాని-ఫాజిల్ లోగడ చెప్పారు.

ఇరాన్ జనాభాలో సగం మందికి పైగా 30 ఏళ్లలోపువారే. ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో వీరిపై తీవ్ర ప్రభావం పడింది.

మద్దతు ప్రకటించిన ట్రంప్

ఇరాన్‌లో పరిణామాలను గమనిస్తున్నామని యూరోపియన్ యూనియన్(ఈయూ) తెలిపింది. శాంతియుతంగా ఒక చోట గుమికూడేందుకు, తమ ఆలోచనలను స్వేచ్ఛగా వ్యక్తంచేసేందుకు ఇరాన్ ప్రజలకున్న హక్కులను ఇరాన్ ప్రభుత్వం కాపాడుతుందని ఆశిస్తున్నామని వ్యాఖ్యానించింది.

ఇరాన్‌లో నిరసనలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 'ట్విటర్' వేదికగా మద్దతు పలికారు. ''ఇరాన్ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు, స్వేచ్ఛ కోసం అలమటిస్తున్నారు. ఇరాన్‌లో మార్పు రావాల్సిన సమయం వచ్చింది'' అన్నారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)