‘అత్యున్నత నైపుణ్యం’ కలిగిన వారికి చైనా 10 ఏళ్ల వీసా ఆఫర్

ఫొటో సోర్స్, Getty Images
'అత్యున్నత నైపుణ్యం' కలిగిన విదేశీయులను ఆకర్షించడానికి చైనా దీర్ఘకాలిక వీసాలను జారీ చేస్తోంది.
ఈ మల్టీ ఎంట్రీ వీసాలు ఐదు నుంచి పదేళ్ల పాటు చెల్లుబాటు అవుతాయని ప్రభుత్వ మీడియా వర్గాలు తెలిపాయి.
ఎంట్రప్రెన్యూర్లు, సైంటిస్టులు, టెక్నాలజీ లీడర్లలాంటి వారు వీటి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం చైనా లక్ష్యాలను నిర్దేశించుకుంది. వాటిని సాధించడానికి విదేశాల నుంచి నిపుణులను రిక్రూట్ చేసుకోవాలని భావిస్తోంది.
ఈ పథకం ద్వారా కనీసం 50 వేల మంది విదేశీ నిపుణులకు చైనాలో అవకాశం లభిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
నోబెల్ విజేతలకు స్వాగతం
ఈ దీర్ఘకాలిక వీసాల కోసం ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి పూర్తిగా ఉచితం. వాటిని వేగంగా ప్రాసెస్ చేస్తామని చైనా ప్రభుత్వం తెలిపింది.
ఈ వీసాలు ఉన్నవారు దేశంలో ఏకకాలంలో 180 రోజుల పాటు ఉండవచ్చు. తమ భాగస్వాములను, పిల్లలను కూడా వారు తమ వెంట తీసుకురావచ్చు.
2016లో చైనా ర్యాంకింగ్ పద్ధతిని ప్రవేశపెట్టింది. దీని ద్వారా నైపుణ్యాలను గుర్తించి, దేశంలోకి వస్తున్న తక్కువ నైపుణ్యం కలిగిన విదేశీయుల సంఖ్యను తగ్గిస్తారు.
ఆ సందర్భంగా విడుదల చేసిన ఒక డాక్యుమెంట్‌లో, 'అత్యున్నత విదేశీ నైపుణ్యం' విభాగంలో నోబెల్ విజేతలు, విజయాలు సాధించిన ఒలెంపిక్ అథ్లెట్లు, ప్రపంచ ప్రఖ్యాత సంగీత, ఫైన్ ఆర్ట్స్ కళాశాలల డైరెక్టర్లు ఉన్నారు.
ప్రముఖ సైంటిస్టులు, ప్రధాన ఆర్థిక సంస్థల అధినేతలు, అత్యున్నత స్థాయి యూనివర్సిటీల ప్రొఫెసర్లకు కూడా చైనా రెడ్ కార్పెట్ పరుస్తోంది.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








