You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ముగాబే పాలన ముగిసింది, ఇప్పుడు జింబాబ్వే మారిపోతుందా?
- రచయిత, ఫెర్గల్ కీన్
- హోదా, ఆఫ్రికా ఎడిటర్
జింబాబ్వే పార్లమెంటు సమావేశం ఇప్పటివరకూ అనుకున్నట్లుగానే జరిగింది. ఒకరి తర్వాత ఒకరు ఎంతమంది మాట్లాడినా అందరూ ముగాబే, ఆయన భార్య గ్రేస్ చర్యలను ఖండిస్తూనే మాట్లాడారు.
"ముగాబే రాజీనామా చేయాలి" అంటూ ప్రకటన చేయగానే సభ్యులంతా బల్లలపై చరుస్తూ ఆనందాన్ని వ్యక్తం చేయడమే కాకుండా, పాటలు పాడుతూ నృత్యాలు చేశారు.
పార్లమెంటు ప్రాంగణమంతా సందడి కనిపించింది.
సరిగ్గా వారం క్రితం విదేశీ జర్నలిస్టులందరిపై జింబాబ్వే నిషేధం విధించింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా అధికారపక్ష సభ్యులు కొంత మంది బీబీసీతో మాట్లాడటానికి ఆసక్తి చూపించారు.
"నిజమైన ప్రజాస్వామ్యానికి ఇప్పుడే పునాది పడబోతోంది" అని ఎంపీ కీత్ గుజా వ్యాఖ్యానించారు. ముగాబే పాలన ముగిసిందని, తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు.
ఎలాంటి హింసకూ తావు లేకుండా జింబాబ్వేలో పరిస్థితులు మారడం పట్ల తనకు చాలా ఆనందంగా ఉందని మరో సభ్యుడు తెలిపారు.
బీబీసీ ప్రతినిధులు హరారే వీధుల్లో పర్యటిస్తుండగా, ఎటు చూసినా సంబరాలు చేసుకుంటున్న ప్రజలు గుంపులుగుంపులుగా కనిపించారు.
జాతీయ జెండాలను చేతబట్టి, "చూడండి, మేం చరిత్ర సృష్టించబోతున్నాం" అని కేకలు వేస్తూ తిరుగుతున్నారు.
భూమినంతటినీ కోల్పోయిన ఓ రైతుతో మాట్లాడాను. ఆయన ఇప్పటివరకు ఎన్నో రకాల హింసను భరించాడు. ఇలాంటి వారంతా ముగాబే పాలన అంతం ఎప్పుడా అని ఎదురుచూసినవాళ్లే.
ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తున్న భయం, బాధల నుంచి వాళ్లు పొందిన స్వాతంత్ర్యం ఇది.
ఎమర్సన్ నాంగాగ్వా ఈ పోరాటంలో నాయకుడిగా అవతరించారు. గ్రేస్ అధ్యక్ష పీఠం ఎక్కకుండా ఆయనొక్కరే ఎన్నో ఏళ్లుగా అడ్డుకున్నారు.
అయితే, కొత్త అధ్యక్షుడికి పాలన పూలబాటేమీ కాదు. వ్యవస్థలో సమూల మార్పు తీసుకురావడం అంత సులభమేమీ కాదు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం, అంతర్జాతీయ సహాయాన్ని పొందడం ఎమర్సన్ ముందున్న పెద్ద సవాళ్లుగా చెప్పవచ్చు.
ముగాబే అంత శక్తిమంతుడు కాకపోవడం ఎమర్సన్‌కు ఒకరకంగా ఇబ్బందే అనుకోవచ్చు. జను-పీఎఫ్ పాత్రను ఇక్కడ పక్కనపెట్టలేం. అయితే ప్రజల వైఖరి, ఆలోచనలే ప్రధానం. వాళ్లంతా 40 ఏళ్లుగా ఈ రోజు కోసం ఎదురుచూస్తున్నారు.
మొదటిసారిగా వాళ్లంతా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు. వారి అభిప్రాయాలను చెప్పగలుగుతున్నారు. వీధుల్లో తిరుగుతూ సంబరాలు చేసుకుంటున్నారు.
ఎన్నో ఏళ్లుగా బలహీనంగా ఉన్న ప్రతిపక్షం కూడా ఇప్పుడు ఉత్సాహంగా కనిపిస్తోంది. కొద్దిగా బలం పుంజుకునేందుకు ప్రయత్నిస్తోంది.
వచ్చే సంవత్సరం ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా అప్పుడే ప్రచారాన్ని మొదలుపెట్టేసింది.
జింబాబ్వే ప్రజల ఆశలను ఎమర్సన్ ఎంతవరకు నెరవేరుస్తారనేది కాలమే చెప్పగలదు!
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)