You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జింబాబ్వే సంక్షోభం: నాలుగు రోజుల తర్వాత బయటికొచ్చిన ముగాబే
సైనిక చర్య కారణంగా గృహ నిర్బంధంలో ఉన్న జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే శుక్రవారం నాడు తొలిసారి ఇంటి నుంచి బయటికొచ్చారు. దేశ రాజధాని హరారేలో జరిగిన జింబాబ్వే ఓపెన్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు.
నాలుగు రోజులుగా గృహ నిర్బంధంలో ఉన్న ముగాబే మిలటరీ భద్రత నడుమ ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. జింబాబ్వే ఓపెన్ యూనివర్సిటీకి ముగాబేనే ఛాన్స్‌లర్.
ఏటా జరిగే ఈ స్నాతకోత్సవానికి దేశాధ్యక్షుడు హాజరవడం ఆనవాయితీ. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ముగాబే ఆ కార్యక్రమానికి వస్తారని చాలామంది ఊహించలేదు. ముగాబే చేతి నుంచి పట్టా అందుకున్న వాళ్లలో నాలుగు రోజుల క్రితం ఆయన్ని నిర్బంధించిన మిలటరీ జనరల్ భార్య మ్యారీ షివెంగా కూడా ఉన్నారు.
ముగాబే భార్య గ్రేస్, విద్యా శాఖ మంత్రి, గ్రేస్‌కి సన్నిహితుడైన జొనాథన్ మాయో ఆ కార్యక్రమానికి హాజరుకాలేదు.
మరోపక్క దేశ పాలనకు సంబంధించి ముగాబేతో చర్చలు ఫలవంతంగా సాగుతున్నాయనీ, వీలైనంత త్వరగా వాటి ఫలితాల్ని ప్రజల ముందుంచుతామనీ ఆ దేశ మిలటరీ చెబుతోంది.
దేశమంతా మిలటరీ అధీనంలో ఉన్నా, తమకు మాత్రం ఎలాంటి ఇబ్బందులూ లేవని జింబాబ్వే పౌరులు చెబుతున్నారు.
దుకాణాలు ఎప్పటిలానే తెరుచుకుంటున్నాయనీ, రాజధాని వీధుల్లోనూ ప్రజలు తిరుగుతున్నారనీ సోషల్ మీడియా ద్వారా కొందరు పరిస్థితులను పంచుకుంటున్నారు.
ఇంకొందరు ‘బీబీసీ’తో మాట్లాడుతూ, ఒక నియంతృత్వ నేతను తప్పించే ప్రయత్నం మొదలుపెట్టినందుకు ఆర్మీకి కృతజ్ఞతలు చెప్పారు.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)