You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జింబాబ్వే సంక్షోభం: ముగాబే దంపతుల భవిష్యత్తు ఏమిటి?
- రచయిత, లెబొ దెసికో
- హోదా, బీబీసీ న్యూస్
జింబాబ్వే అధ్యక్ష పదవి నుంచి దిగిపోవడానికి విధించిన తుది గడువును రాబర్ట్ ముగాబే పట్టించుకోకపోవడంతో ఆయనపై అభిశంసన చర్యలకు మద్దతివ్వాలని అధికార జను-పీఎఫ్ పార్టీ ప్రణాళిక రచిస్తోంది.
అధ్యక్ష పదవి నుంచి తాను వైదొలగబోనని, పదవిలోనే కొనసాగుతానని, డిసెంబర్‌లో జరగబోయే పార్టీ శిఖరాగ్ర సదస్సుకు అధ్యక్షత వహిస్తానని ముగాబే ఆదివారం రాత్రి దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో స్పష్టంచేయడంతో జింబాబ్వే ప్రజలు నిర్ఘాంతపోయారు.
ఒకవైపు తాను కుట్ర చేయలేదంటున్న సైన్యం.. మరోవైపు పదవి నుంచి తప్పుకోవడానికి ససేమిరా అంటున్న ముగాబే.. ఈ పరిస్థితుల్లో జింబాబ్వే అధ్యక్ష పదవి నుంచి ఆయనను దించడానికి గల అవకాశాలేమిటి?
ఐదు మార్గాలకు అవకాశముంది.. అవి:
1. అభిశంసన
మంగళవారం పార్లమెంటు సమావేశమైనపుడు రాబర్ట్ ముగాబే మీద అభిశంసన చర్యలు ప్రారంభిస్తామని అధికార జింబాబ్వే ఆఫ్రికన్ నేషనల్ యూనియన్- పేట్రియాటిక్ ఫ్రంట్ (జను-పీఎఫ్) చెప్తోంది.
అభిశంసన అంటే పార్లమెంటు ద్వారా అధ్యక్షుడిని తొలగించే ప్రక్రియ.
అధ్యక్షుడికి వ్యతిరేకంగా సాధారణ మెజారిటీ ఓట్లతో తీర్మానాన్ని ఆమోదించినట్లయితే.. జాతీయ శాసనసభ, సెనేట్ - ఉభయ సభలూ అభిశంసన చర్యలు ప్రారంభించవచ్చు.
అభిశంసన విజయవంతం కావాలంటే ఉభయ సభల్లోనూ మూడింట రెండు వంతుల మెజారిటీ మద్దతు అవసరం.
జను-పీఎఫ్ పార్టీకి జాతీయ శాసనసభలో మూడింట రెండు వంతుల మెజారిటీ ఉంది కానీ సెనేట్‌లో లేదు.
ఈ అభిశంసన ప్రక్రియ మంగళవారం లాంఛనంగా మొదలవుతుందని భావిస్తున్నారు. కానీ అది పూర్తవడానికి ఎంత కాలం పడుతుందనేది తెలియదు.
ఈ ప్రక్రియ వల్ల సైన్యానికి లాభమేమిటంటే.. అధ్యక్షుడిని రాజ్యాంగబద్ధంగా తొలగించినట్లు సైనిక జనరల్‌లు చెప్పడానికి అవకాశం లభిస్తుంది. తద్వారా ఇది కుట్ర కాదంటూ వారు చేస్తున్న ప్రకటనకు నైతిక బలం దొరుకుతుంది.
అయితే.. తదుపరి అధ్యక్షుడిగా సైనిక జనరల్‌లు కోరుకుంటున్నారని భావిస్తున్న వ్యక్తికి ఆ పదవి నేరుగా లభిస్తుందన్న గ్యారంటీ ఈ ప్రక్రియలో ఉండదు. ఇది సైన్యానికి ప్రతికూల అంశం.
అధికార పార్టీ ఉపాధ్యక్ష పదవి నుంచి ఎమర్సన్ నాన్‌గాగ్వాను తొలగించడంతో జింబాబ్వేలో సైనిక చర్య మొదలైన విషయం తెలిసిందే. అయితే.. అభిశంసన ద్వారా ముగాబేను అధ్యక్ష పదవి నుంచి తప్పించినట్లయితే.. నాన్‌గాగ్వా తక్షణమే అధ్యక్షుడు కాలేరు. ఎందుకంటే.. రాజ్యాంగం ప్రకారం ప్రస్తుత ఉపాధ్యక్షుడు అధ్యక్ష పదవిని భర్తీ చేయాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ఫెలెకెజెలా ఫోకో ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ప్రథమ మహిళ గ్రేస్ ముగాబేకు విధేయుడు. జను-పీఎఫ్ పార్టీ నుంచి ఆయనను ఆదివారం నాడు బహిష్కరించారు కూడా.
అయితే.. అధ్యక్ష పదవి నుంచి ముగాబే దిగిపోయేలోగా సైన్యం ఆయన ద్వారా తమకు ఇష్టమైన అభ్యర్థిని ఉపాధ్యక్షుడిగా నియమించుకునేలా ఒత్తిడి చేయగలదా అనేది వేచిచూడాలి.
సైనిక జనరల్‌లు ముగాబేతో ఈ విషయాన్నే చర్చించి ఉండొచ్చని.. ఇందులో ముగాబే తురుపు ముక్క కూడా ఈ అంశమే కావచ్చునని కొందరు విశ్లేషకులు చెప్తున్నారు.
కానీ ముగాబేను గద్దె దించడమే ఇంత కష్టంగా ఉన్న నేపథ్యంలో ఆయన మరింతగా పట్టు సడలించేలా ఒప్పించగల అవకాశాలు ఇంకా తగ్గిపోతున్నాయి.
2. డిసెంబర్ వరకూ ముగాబే కొనసాగుతారు
ముగాబే ఆదివారం టెలివిజన్ ద్వారా ప్రసంగించినపుడు చాలా పట్టుదలగా ఉన్నారు.
జను-పీఎఫ్ తనను పదవి నుంచి తప్పించినా కూడా.. ‘‘పార్టీ శిఖరాగ్ర సదస్సు మరి కొన్ని వారాల్లో జరగనుంది. ఆ సమావేశానికి నేను అధ్యక్షత అధ్యక్షత వహిస్తాను’’ అని ఆయన చెప్పారు.
సైనిక చర్యను క్షమించడానికి తాను సుముఖంగా ఉన్నానని ఆయన సూచించారు. ‘‘వారు (సైన్యం) తమ ఆపరేషన్‌ను ఎలా అమలు చేశారనేదాని మంచి చెడులు ఎలా ఉన్నప్పటికీ కమాండర్-ఇన్-చీఫ్‌గా నేను వారి ఆందోళనలను గుర్తిస్తున్నాను’’ అని ముగాబే పేర్కొన్నారు.
అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి ముగాబే అంగీకరించారని తొలుత వార్తలు వచ్చాయి.
అయితే ఆయన తన మనసు మార్చుకున్నారా? ఈ వార్తలు నిజమేనా? అన్నది అస్పష్టంగా ఉంది. కానీ ఈ పరిణామం సైన్యం బలహీనంగా ఉన్నట్లు కనిపించేలా చేస్తుందని బీబీసీ ఆఫ్రికా ఎడిటర్ ఫెర్గల్ కీన్ చెప్తున్నారు.
పార్టీ పదవి నుంచి తనను తొలగించడాన్ని ముగాబే తిరస్కరించడానికి జను-పీఎఫ్ నిబంధనల్లోనే అవకాశాలు ఉండొచ్చునని కొందరు అంటున్నారు.
రాబర్ట్ ముగాబేకి చతురుడిగానూ మొండిఘటంగానూ పేరుంది. కాబట్టి ఆయన దగ్గర మరో తురుపు ముక్క ఉండి ఉండొచ్చు.
3. ముగాబే దేశం విడిచి వెళ్లే పరిస్థితి
ముగాబే అధ్యక్ష పదవి నుంచి స్వయంగా దిగిపోయిన తర్వాత ఆయన దేశంలోనే ఉండేలా అనుమతించేందుకు ఒప్పందం చేసుకోవాలని సైన్యం ప్రయత్నిస్తున్నట్లు తొలుత భావించారు.
కానీ ప్రస్తుతం నెలకొన్న ప్రతిష్టంభనలో ఆ అవకాశం చాలా తక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది.
ముగాబే, ఆయన భార్య వైపు నుంచి చూస్తే.. విచారణ నుంచి ఆయనకు మినహాయింపు ఇచ్చి రక్షణ కల్పిస్తామని ఒకవేళ ప్రస్తుతానికి హామీ ఇచ్చినా కూడా, భవిష్యత్తు ప్రభుత్వం ఏదైనా దానిని తొలగించవచ్చునన్న భయం ఉంది.
కాబట్టి ముగాబే దేశం విడిచి ప్రవాసం వెళ్లాల్సిన బలవంతపు పరిస్థితి రావచ్చు.
పొరుగున ఉన్న దక్షిణాఫ్రికా ఆయన ఉండడానికి అనుకూలంగా ఉండేది. అక్కడ ముగాబే పట్ల చాలా గౌరవం ఉంది. అందుకు ప్రధాన కారణం గతంలో అక్కడ వివక్షా పాలనకు వ్యతిరేక పోరాటానికి ఆయన ఇచ్చిన మద్దతు.
నిజానికి.. ‘‘అధ్యక్షుడు ముగాబేకు రాజకీయ ఆశ్రయం కల్పిస్తూ స్వాగతించానికి సిద్ధంకండి’’ అంటూ ప్రభుత్వానికి ప్రతిపక్ష ఈఎఫ్‌ఎఫ్ పార్టీ పిలుపునిచ్చింది కూడా.
దక్షిణాఫ్రికాలో ముగాబే దంపతులకు పలు ఆస్తులు ఉన్నట్లు కూడా చెప్తారు.
అయితే గ్రేస్ ముగాబే విషయం ఏమవుతుంది అనేది చాలా ఆసక్తికరమైన అంశం.
ఆమె గత ఆగస్టులో జొహెనెస్‌బర్గ్‌లో ఒక హోటల్ గదిలో ఒక మోడల్ మీద దాడిచేసినట్లు ఆరోపణ వచ్చిన తర్వాత ఆమెకు దౌత్య రక్షణ కల్పించారు.
కానీ ఆ దౌత్య రక్షణ ఉత్తర్వును రద్దు చేయించడానికి సదరు మోడల్ గాబ్రియేలా ఏంగెల్స్ ప్రయత్నిస్తున్నారు. అందులో ఆమె సఫలమైతే.. గ్రేస్ ముగాబే దక్షిణాఫ్రికాకు వెళ్లినప్పుడు అక్కడ ఆమె విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
మరి దక్షిణాఫ్రికా కాకపోతే.. ఎక్కడికి వెళతారు?
సింగపూర్, మలేసియాలు ప్రత్యామ్నాయ అవకాశాలుగా భావిస్తున్నారు. ఆ దేశాల్లో కూడా ముగాబేలకు ఆస్తులు ఉన్నాయని చెప్తారు.
4. జాతీయ సమైక్య ప్రభుత్వం, ఎన్నికలు
ప్రతిపక్ష మూవ్‌మెంట్ ఫర్ డెమొక్రటిక్ చేంజ్-స్వాంగిరాయ్ (ఎండీసీ-టీ) పార్టీ నాయకుడు దక్షిణాఫ్రికాలో కేన్సర్ చికిత్స చేయించుకుని హరారే తిరిగివచ్చారు. దీంతో సమైక్య ప్రభుత్వ ఏర్పాటు కోసం చర్చలు జరుగుతాయన్న ఊహాగానాలు మొదలయ్యాయి.
ఇలాంటి పరిస్థితిని పశ్చిమ ప్రపంచంలోని చాలా దేశాలతో పాటు జింబాబ్వే ప్రతిపక్షం కూడా కోరుకుంటుంది.
జాతీయ సమైక్య ప్రభుత్వంలో సాంగిరాయ్ ఉన్నట్లయితే అందులో తాను చేరుతానని మరో ప్రతిపక్ష నాయకుడు టెండాయ్ బిటీ పేర్కొన్నారు.
5. మరో కొత్త ముగాబే?
కానీ జింబాబ్వే పాలనను సైన్యం తన చేతుల్లోకి తీసుకోవడం.. ప్రభుత్వం మారడం కాదు. అధికార జను-పీఎఫ్‌లో అంతర్గత వివాదమది. ఆ పార్టీ ఇంకా అధికారంలోనే ఉంది.
నిజానికి జింబాబ్వే సైన్యం చాలా వరకూ జను-పీఎఫ్ సాయుధ విభాగమే.
ఇక సైన్యం మద్దతిస్తున్న ఎమర్సన్ నాన్‌గాగ్వా కూడా.. ముగాబే అత్యంత వివాదాస్పద విధానాలు కొన్నిటిని అమలు చేయడానికి సాయం చేశారు.
ఆయన కూడా మరింత క్రూరుడని కొందరు చెప్తారు.
కాబట్టి ముగాబేను పదవీచ్యుతుడ్ని చేయడం వల్ల జింబాబ్వేలో సాధారణ పౌరుల జీవితాలు మెరుగుపడతాయన్న భరోసా లేదు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)