You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జింబాబ్వే సంక్షోభం: ‘రాజ్యాంగేతర శక్తిగా మారేందుకు భార్యకు అవకాశం ఇచ్చిన ముగాబే’
దేశాధ్యక్షుడి పదవి నుంచి రాబర్ట్ ముగాబేను తప్పించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు జింబాబ్వే అధికార జను పీఎఫ్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం అభిశంసన తీర్మానం పెడుతున్నట్లు తెలిపింది.
ముగాబే ‘తన భార్య రాజ్యాంగేతర శక్తిగా మారేందుకు అనుమతించారు’ అన్న అభియోగంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పార్టీ ప్రతినిధి పౌల్ మన్గవన చెప్పారు.
ముగాబేను గద్దె దింపే ప్రక్రియ రెండురోజుల్లోనే ముగుస్తుందని, బుధవారం ఆయన్ను అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తామని వివరించారు.
సోమవారం నాటికల్లా రాజీనామా చేయాలంటూ ముగాబేకు విధించిన గడువు ముగిసిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.
93 ఏళ్ల రాబర్ట్ ముగాబేకు వయసుమీద పడటంతో ఆయన స్థానంలో దేశాధ్యక్ష బాధ్యతలను చేపట్టాలని, ముగాబేకు రాజకీయ వారసురాలు కావాలని 52 ఏళ్ల గ్రేస్ ముగాబే పోటీపడ్డారు. కానీ వారం రోజుల కిందట సైన్యం జోక్యం చేసుకుని పరిపాలనను తమ చేతుల్లోకి తీసుకుంది.
తీవ్రమైన దుష్ప్రవర్తన, రాజ్యాంగ ఉల్లంఘన, రాజ్యాంగానికి కట్టుబడటంలో విఫలమవటం, రాజ్యాంగాన్ని సంరక్షించలేకపోవటం, సామర్థ్యం లేకపోవటం వంటి అంశాలపై ఆధారపడి అధ్యక్షుడిని పదవి నుంచి తప్పించేందుకు జింబాబ్వే రాజ్యాంగం అవకాశం కల్పిస్తోంది.
రాజ్యాంగాన్ని అమలు చేయటంలో కూడా ముగాబే విఫలమయ్యారని మన్గవన చెప్పారు. అలాగే పెరిగిన వయసు రీత్యా కూడా విధులు నిర్వర్తించేందుకు ముగాబే సమర్థులు కారని తెలిపారు.
‘‘ముగాబే మొండి మనిషి. ప్రజల నినాదాలను ఆయన వినగలరు. కానీ వినటానికి ఇష్టపడటం లేదు’’ అని మన్గవన వివరించారు.
జాతీయ అసెంబ్లీ, సెనెట్‌ల్లో అభిశంసన తీర్మానంపై మంగళవారం ఓటింగ్ జరిగే అవకాశం ఉంది.
అనంతరం ఉభయ సభలు అధ్యక్షుడిని తొలగించే అంశంపై దర్యాప్తు జరపటానికి ఒక సంయుక్త కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
ఆ కమిటీ అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించాలని సిఫార్సు చేస్తే.. ఉభయ సభలు రెండింట మూడొంతుల మెజార్టీతో ఈ తీర్మానిన్ని బలపర్చాలి. అప్పుడే అధ్యక్షుడి అభిశంసన సాధ్యమవుతుంది.
‘‘బుధవారం నాటికల్లా పార్లమెంటులో ఓటింగ్ పూర్తవుతుందని మేం భావిస్తున్నాం’’ అని మన్గనవ చెప్పారు.
‘‘ప్రభుత్వాన్ని నడిపేందుకు హక్కు లేనప్పుడు తన భార్య రాజ్యాంగేతర శక్తిగా మారేందుకు ముగాబే అనుమతించారన్నదే ఆయనపై ప్రధాన అభియోగం. ఆమె తన రాజకీయ ప్రసంగాల్లో ఉపాధ్యక్షుడిని, అధికారుల్ని అవమానిస్తోంది. సైన్యాన్ని కూడా కించపరుస్తున్నారు. ఇవే వారిపై అభియోగాలు’’ అని వెల్లడించారు.
గత 37 ఏళ్లుగా జింబాబ్వే అధ్యక్షుడిగా ముగాబే కొనసాగుతున్నారు. అయితే, ఆయన వైదొలగాలంటూ గత వారం రోజులుగా ప్రజలు వీధుల్లో నిరసనలు చేస్తున్నారు. అధికార జను పీఎఫ్ పార్టీ సైతం ముగాబేను వ్యతిరేకిస్తోంది.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)