ఇండోనేషియా: భారీ కొండచిలువను చంపి కోసుకొని తిన్న గ్రామస్తులు

ఫొటో సోర్స్, AFP/Getty Images
ఇండోనేషియాలో ఒక సెక్యూరిటీ గార్డు 26 అడుగుల (7.8 మీటర్ల) పొడవైన భారీ కొండచిలువతో పోరాడి, దానిని చంపేశాడు.
శనివారం సుమత్రా ప్రాంతంలోని బాతంగ్ గన్సల్ జిల్లాలో పామాయిల్ తోటకు వెళ్లే దారిలో రాబర్ట్ నబాబన్‌కు ఈ కొండ చిలువ కనిపించింది. పట్టుకోవడానికి అతడు ప్రయత్నించగా, అది అతడిపై దాడి చేసింది. అతడు గాయపడ్డాడు.
తర్వాత నబాబన్ కొండచిలువపై ఎదురుదాడి చేశాడు. దానికీ, అతడికీ మధ్య పోరాటం సాగింది. కొంత మంది గ్రామస్థుల సాయంతో చివరకు అతడు దానిని చంపేశాడు. నబాబన్‌కు 37 సంవత్సరాలు.
తన చేతిని కొండ చిలువ కరిచిందని ఇండోనేషియా వార్తాసంస్థ డెటిక్‌తో నబాబన్ చెప్పాడు.
ఎడమ చేతికి తీవ్ర గాయాలైన అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. క్రమంగా కోలుకొంటున్నాడు.

ఫొటో సోర్స్, AFP/Getty Images
నబాబన్ చెయ్యి దాదాపు తెగిపోయేంత తీవ్రంగా కొండచిలువ దాడి చేసిందని పోలీసులు ఏఎఫ్‌పీ వార్తాసంస్థతో చెప్పారు.
అతడి చేతిని వైద్యులు తొలగించాల్సి రావచ్చేమోనని బాతంగ్ గన్సల్ జిల్లా ఉన్నతాధికారి ఎలినార్యన్ బీబీసీకి తెలిపారు.
ప్రదర్శనకు ఉంచిన గ్రామస్తులు
చనిపోయిన కొండచిలువను స్థానికులు గ్రామంలో ప్రదర్శనకు ఉంచారు. తర్వాత కోసుకొని, మాంసాన్ని వండుకొని తిన్నారు.
కొండచిలువను తాను ఎందుకు పట్టుకోవాలనుకున్నాడో నబాబాన్ స్పష్టంగా చెప్పలేదు. అయితే కొండచిలువ భయంతో కొందరు గ్రామస్థులు అది ఉన్న చోట రోడ్డు దాటడానికి భయపడేవారని తెలిపాడు.
బాతంగ్ గన్సల్ జిల్లాలో భారీ కొండచిలువలు కనిపించడం సాధారణమేనని ఎలినార్యన్ చెప్పారు.
కొండచిలువ మాంసాన్ని స్థానికులు తినడం తనకు ఆశ్చర్యకరమేమీ కాదని, దీని మాంసం రుచిగా ఉంటుందని తన స్నేహితులు చెప్పారని ఆయన తెలిపారు. కొండచిలువ రక్తంలో ఔషధ గుణాలు ఉంటాయని కొంత మంది నమ్ముతారని పేర్కొన్నారు.
పామాయిల్ తోటల్లో ఎలుకలు ఎక్కువగా ఉంటాయని, వాటి కోసం కొండచిలువలు తిరుగుతుంటాయని ఆయన వివరించారు. వాటితో పోరాడటం ప్రమాదకరమన్నారు.
నబాబన్‌లాగే మార్చిలోనూ ఇండోనేషియాలో ఒక గ్రామీణుడు కొండచిలువతో పోరాడాడు. అయితే అప్పుడు అది అతన్ని మింగేసింది.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)








