You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కామన్వెల్త్ గేమ్స్: 2014లో కాంస్యం, 2018లో రజతం గెలిచిన పీవీ సింధు ఈసారి బంగారు పతకం తెస్తారా?
- రచయిత, చంద్రశేఖర్ లూథరా
- హోదా, బీబీసీ కోసం
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకాలు సాధించి పెడతారని గట్టి నమ్మకమున్న క్రీడాకారుల్లో బ్మాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మొదటి వరుసలో ఉంటారు.
కొన్ని వారాల క్రితం సింగపూర్ ఓపెన్ టైటిల్‌ను సింధు కైవసం చేసుకున్న తర్వాత ఈ నమ్మకం మరింత బలపడింది. అది ఆమె కెరియర్‌లో తొలి సూపర్ 500 టైటిల్ కావడంతో తర్వాత జరగబోతున్న కామన్వెల్త్ గేమ్స్‌పై అంచనాలు మరింత పెరిగాయి.
ఆ మ్యాచ్ తర్వాత పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలవడంపై దృష్టి పెడతానని 27ఏళ్ల సింధు చెప్పారు. మరోవైపు బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారం పతకాన్ని గెలిచేందుకు కృషి చేస్తానని అన్నారు.
సింగపూర్ ఓపెన్‌లో చైనా టాప్ క్రీడాకారిణి వాంగ్ జీని ఓడించిన తర్వాత సింధు ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. ప్రస్తుతం విమెన్స్ సింగిల్స్‌తోపాటు మిక్స్‌డ్ ఈవెంట్‌లోనూ స్వర్ణాన్ని సాధించాలని ఆమె లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.
గత ఏడాది అంతంత మాత్రంగా..
ఈ ఏడాదికి ముందు పీవీ సింధు ఆట తీరు ఆశించిన స్థాయిలో కనిపించలేదు. కొన్ని టోర్నమెంట్లలో ఆమెకు నిరాశాజనక ఫలితాలు ఎదురయ్యాయి. వీటిలో ఉబెర్ కప్ కూడా ఒకటి.
కానీ, ఈ ఏడాది జనవరిలో జరిగిన సయ్యిద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌లో సింధు టైటిల్ గెలిచారు. ఆ తర్వాత స్విస్ ఓపెన్‌లోనూ మంచి ఆటతీరు కనబరిచారు.
2018 కామన్వెల్త్ గేమ్స్‌లో ఆడేందుకు నాలుగేళ్ల క్రితం గోల్డ్ కోస్ట్‌కు వెళ్లినప్పుడు కూడా సింధూ స్టార్ ప్లేయరే.
అప్పటికి రెండేళ్ల ముందు అంటే, 2016 రియో ఒలింపిక్స్‌లో సింధు రజత పతకాన్ని గెలిచారు. దీంతో 2018లో ఆమె బంగారం పతకం గెలుస్తారని భావించారు. మరోవైపు అప్పట్లో చైనా, జపాన్‌ల నుంచి అగ్ర క్రీడాకారులు కూడా బరిలో లేరు.
కానీ, సింధు స్వర్ణ పతకాన్ని గెలవలేదు. సొంత దేశానికి చెందిన సైనా నెహ్వాల్ చేతిలో ఆమె ఓటమికి గురయ్యారు.
ఆ తర్వాత మిక్సెడ్ టీమ్ ఫైనల్ నుంచి కూడా సింధు గాయం వల్ల వెనుదిరగాల్సి వచ్చింది. మిక్స్‌డ్ టీంలో మలేసియా, ఇంగ్లండ్ జట్లు ఆధిపత్యం కనబరుస్తుంటాయి.
అయితే, గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో సైనా నెహ్వాల్‌తోపాటు ఇతర క్రీడాకారులు మంచి ప్రదర్శనతో ముందుకు వెళ్లారు. అప్పట్లో సింధు లేకుండానే భారత్‌కు బంగారం పతకం వచ్చింది.
మైండ్ గేమ్‌లో వెనుక
సైనాతో పోలిస్తే, సింధు ఆట తక్కువ కాదు. సింధూ తప్పులు కూడా తక్కువ చేసేది. అయితే, మైండ్ గేమ్‌లో సింధు కాస్త వెనుకబడేది.
దీంతో తల్లి పీ విజయ.. సింధుకు సూచనలు ఇచ్చేవారు. నిగ్రహంతో ఆడాలని, మ్యాచ్‌లో ఎక్కువ ఆవేశాన్ని ప్రదర్శించొద్దని ఆమె సూచించేవారు. సింధు ఇలా ఆవేశంతో ఆడేటప్పుడు సైనా ధీటుగా స్పందిస్తూ మ్యాచ్‌లు గెలిచేది.
సైనా చేతిలో ఓటమి తర్వాత, కొన్ని నెలలకే సింధు మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. ఈ సారి కీలకమైన సమయాల్లో మరింత నిగ్రహంతో సింధూ ఆడుతూ కనిపించింది.
ఈ విధానంతో సింధూకు చాలా మేలు జరిగింది. 2019లో ఆమె వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో ఆమె బంగారు పతకాన్ని గెలిచింది. మరోవైపు టోక్యో ఒలింపిక్స్‌లోనూ కాంస్య పతకం వచ్చింది. మరోవైపు సైన్యా నెహ్వాల్ ఆట నెమ్మదిగా మసకబారింది. ర్యాంకింగ్ పడిపోవడంతో బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్‌కు ఆమె అర్హత సాధించలేకపోయారు.
విజయానికి బ్రేకులు..
వరల్డ్ ఛాంపియన్‌షిప్ గెలిచిన తర్వాత సింధు విజయానికి కూడా బ్రేకులు పడ్డాయి. వర్ధమాన క్రీడాకారుల చేతిలోనూ ఆమె ఓటమి పాలవుతూ కనిపించారు. తైవాన్‌కు చెందిన తై జు యింగ్ చేతిలో ఆమె వరుస ఓటములను చవిచూశారు. ఈ కొత్త క్రీడాకారిణి స్టైల్ భిన్నంగా ఉండటమూ సింధు ఓటమికి ఒక కారణం.
ఆమె ఫామ్ కోల్పోయిందని ఆమె అభిమానులు అప్పట్లో ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె చేస్తున్న తప్పులు కొన్ని చాలా చిన్నవైనప్పటికీ ఆటపై ప్రభావం చూపించేవి.
అయితే, మొత్తానికి కొరియా కోచ్ పార్క్ తే సంగ్, తన బృందం సాయంతో మళ్లీ సింధు ఫామ్‌లోకి వచ్చారు. అసిస్టెంట్ కోచ్ శ్రీకాంత్ వర్మ, ఫిజియోథెరపిస్ట్ ఇవాంజలీన్ కూడా ఆమెకు సాయం చేశారు. ఇప్పుడు మళ్లీ ఆమె బంగారు పతకం తెస్తారని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
సింగపూర్ ఓపెన్ తర్వాత సింధూ కూడా బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం తెచ్చేందుకు వంద శాతం కృషి చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచ నంబరు-7గా ఉన్న సింధు.. కెనడాకు చెందిన మిషెల్ లీ (నంబరు 13), స్కాట్లండ్‌కు చెందిన క్రిస్టీ గిల్మోర్న్ (నంబరు 18), సింగపూర్‌కు చెందిన యో జియా మిన్ (నంబరు 19)లను దాటుకు రావాల్సి ఉంటుంది.
2014లో కాంస్యం, 2018లో రజతం, 2022లో బంగారుమేనా?
ప్రస్తుత బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధు టాప్ సీడ్‌గా ఉన్నారు. అయితే, ఆమె బంగారు పతకాన్ని తీసుకొస్తారా? లేదా అనేదే అసలు ప్రశ్న.
2014 గ్లాస్గో గేమ్స్‌లో ఆమె కాంస్య పతకాన్ని గెలిచారు. 2018 గోల్డ్‌కోస్ట్ గేమ్స్‌లో రజతాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో ఇప్పుడు బంగారు పతకం తెస్తారా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
క్వార్టర్ ఫైనల్స్‌లో మలేసియాకు చెందిన మాజీ జూనియర్ ఛాంపియన్ జిన్ వేయితో సింధు తలపడే అవకాశముంది.
మిక్స్‌డ్ ఈవెంట్‌లో పాకిస్తాన్ జట్టుపై శుక్రవారం సింధు మెరుగైన ఆటతీరు కనబరిచారు. పాకిస్తానీ టాప్ ప్లేయర్ మహూర్ షాజాద్‌ను 21-7, 21-6 తేడాతో ఆమె ఓడించారు.
సింధు ఇప్పటివరకు రెండు ఒలింపిక్ పతకాలు, ఐదు ప్రపంచ చాంపియన్స్ పతకాలు గెలిచింది. ఇప్పుడు ఆమె బంగారు పతకం తెస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఓఆర్ఎస్: డయేరియా నుంచి ప్రాణాలు కాపాడే సంజీవని ఇది, నిర్లక్ష్యం చేస్తున్నామా
- వరల్డ్ హెపటైటిస్ డే: సెక్స్ ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుందా... ఇది సోకిందో లేదో ఎలా తెలుసుకోవాలి?
- కామన్వెల్త్ గేమ్స్ 2022: పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ ఈసారి మెడల్స్ తెస్తారా?
- ‘నీకంటే ముందు నేనే ప్రాణాలు వదిలేస్తాను.. నేను చనిపోతే కన్నీరు కార్చకు సంతోషంగా సాగనంపు’
- రణ్వీర్ సింగ్ న్యూడ్ ఫొటోల వివాదం మన నైతిక విలువల గందరగోళాన్ని సూచిస్తోందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)