You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
టోక్యో ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన జపాన్ బాలిక, 13 ఏళ్లకే పసిడి పతకం
టోక్యో ఒలింపిక్స్‌లో 13 ఏళ్ల జపాన్ క్రీడాకారిణి మోమిజి నిషియా చరిత్ర సృష్టించింది.
మహిళల స్ట్రీట్ స్కేట్ బోర్డింగ్ పోటీల్లో అరంగేట్రంలోనే స్వర్ణ పతకం సాధించి ఈ ఘనత సొంతం చేసుకుంది.
'నేను గెలుస్తానని అనుకోలేదు, కానీ నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి ప్రోత్సాహంతో లక్ష్యాన్ని సాధించినందుకు సంతోషిస్తున్నాను' అని మోమిజి నిషియా చెప్పింది.
తన తొలి ఒలింపిక్ పతకాన్ని జపాన్‌లో సాధించడం కూడా ఆనందంగా ఉందని చెప్పింది.
మోమిజి నిషియా వయసు 13 ఏళ్ల 330 రోజులు.
రజత పతకం సాధించిన బ్రెజిల్‌కు చెందిన లియాల్ రేసా వయసు 13 ఏళ్ల 203 రోజులు.
కాంస్య పతకం గెలిచిన జపాన్ అమ్మాయి నకయామా ఫనా వయసు 16 ఏళ్లు.ఈ ఒలింపిక్స్‌లో తొలిసారిగా ప్రవేశపెట్టిన ఐదు క్రీడలలో మహిళల స్ట్రీట్ స్కేట్ బోర్డింగ్ కూడా ఒకటి.
వ్యక్తిగత పోడియం సగటు వయసు విషయంలో కూడా ఈ మహిళల స్ట్రీట్ స్కేట్‌బోర్డింగ్ పోటీలు ఒలింపిక్స్ చరిత్రను తిరగరాశాయి.
ఈ క్రీడలో పతకాలు సాధించిన వారి సగటు వయసు 14 సంవత్సరాల 191 రోజులు మాత్రమే.
1936లో బెర్లిన్‌లో జరిగిన స్ప్రింగ్‌బోర్డ్ డైవింగ్ పోటీల్లో స్వర్ణం సాధించిన మార్జోరీ గెస్ట్రింగ్ ఒలింపిక్స్‌లో పతకం నెగ్గిన అతి పిన్న వయస్కురాలు.
పతకం సాధించినప్పుడు ఆమె వయసు 13 సంవత్సరాల 267 రోజులు. నిషియా కంటే కేవలం 63 రోజులు చిన్నది.
ఇక పురుషుల స్ట్రీట్ స్కేటింగ్ విభాగంలో కూడా అతిథ్య దేశానికి చెందిన 22 ఏళ్ల యుటో హారిగోమ్ పసిడి పతకాన్ని అందుకున్నారు.
నిషియా తన తొలి రెండు ట్రిక్స్‌లో అనుకున్నంతగా రాణించలేకపోయినా, చివరి మూడు ట్రిక్స్‌లలో అద్భుత ప్రదర్శన ఇచ్చి మొత్తం 15.26 స్కోరు నమోదు చేసింది.
దీంతో బ్రెజిల్‌కు చెందిన లియాల్ రేసా నమోదు చేసిన 14.64 స్కోరును అధిగమించి అగ్రస్థానానికి దూసుకెళ్లింది.
ఒసాకాకు చెందిన నిషియా తన అన్నయ్య స్ఫూర్తితో ఐదేళ్ల వయసులోనే స్కేట్ బోర్డింగ్‌లోకి అడుగుపెట్టింది. రెండో స్థానంలో నిలిచిన బ్రెజిల్‌కు చెందిన లియాల్ రేసా పతకాన్ని సాధించిన పిన్న వయస్కుల జాబితాలో నిలిచారు.
'నా కల, మా నాన్న కలను సాకారం చేసుకోగలిగాను' అని వెండి పతాకాన్ని సాధించిన ఆనందంలో లియాల్ రేసా అన్నారు.
బాలికలు స్కేట్ చేయలేరని చెప్పే వారికి మీరిచ్చే సమాధానం ఏంటి అని ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు 'క్రీడల్లో లింగ అడ్డంకులు ఉండకూడదు, స్కేట్ బోర్డింగ్ అందరికీ అని నేను అనుకుంటున్నాను' అని బదులిచ్చారు.
ఇక, టోక్యో విశ్వక్రీడల్లో పాల్గొన్నవారిలో అతిపిన్న వయస్కురాలైన సిరియన్ టేబుల్ టెన్నిస్ స్టార్ హెండ్ జాజా(12) గత శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రియాకు చెందిన లియు జియా చేతిలో ఓటమిపాలై ఇంటిదారి పట్టారు.
జపాన్‌కు చెందిన కోకోనా హిరాకి (12 సంవత్సరాలు 343 రోజులు) కూడా ఇదే పోటీల్లో పాల్గొంటున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నవారిలో రెండవ, జపాన్ తరఫున అతి పిన్న వయస్కురాలిగా ఉన్నారు.
13 సంవత్సరాల 28 రోజుల వయసున్న స్కై బ్రౌన్ బ్రిటన్ తరపున ఈ ఒలింపిక్‌లో పాల్గొంటున్న అతిపిన్న వయస్కురాలు. ఆమె ఆగస్టు 4న మహిళల పార్క్ స్కేట్ బోర్డింగ్‌లో పాల్గొంటారు.
ఇవి కూడా చదవండి:
- టోక్యో ఒలింపిక్స్: ఏ దేశానికి ఎన్ని పతకాలు? ఇదీ జాబితా
- మీరాబాయి చానూ: రియో ఒలింపిక్స్‌లో ఓటమి నుంచి టోక్యోలో విజయం వరకు
- ఒకప్పటి భారతదేశానికి ఇప్పటి ఇండియాకు తేడా ఇదే
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
- దానిష్ సిద్దిఖీ: పులిట్జర్ ప్రైజ్ అందుకున్న భారత ఫొటో జర్నలిస్ట్ తీసిన మరపురాని ఛాయా చిత్రాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)