నిజామాబాద్, ఆదిలాబాద్: 124 రూపాయలతో పెళ్లి, తెలంగాణలోని ఈ తెగ చాలా స్పెషల్

వీడియో క్యాప్షన్, తెలంగాణ: 124 రూపాయలతో పెళ్లి

కేవలం 124 రూపాయల ఖర్చుతో పెళ్లి.. పైగా పెళ్లి బాధ్యతంతా వరుడు తరపు వాళ్లదే. ఇక వారిలో ఆడపిల్ల పెళ్లి చెయ్యాలన్నా కష్టపడాల్సిన పని అసలే లేదు.

మథుర తెగ అని పిలుచుకునే ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో కనిపించే మారు మూల గిరిజన సమూహం ఇది. ఈ గిరిజనులు ఒకప్పుడు ఉత్తరభారతం నుంచి వలసవచ్చిన ఈ సంచార జీవులు, ఇప్పుడు ఇక్కడ స్థిరపడ్డారు. ఆచార సంప్రదాయాల్లోనే కాదు, వేష భాషల్లో కూడా వీళ్లు ప్రత్యేకమే. వీళ్లను 'జుట్టు లంబాడీ', 'ఖాయితీ లంబాడీ', 'మురికి లబాన్' ఇలా రకరకాల పేర్లతో కూడా పిలుస్తారు.మథుర జాతిలో మహిళలది ప్రత్యేక స్థానం. కులవృత్తి అయిన పశుపోషణలో సింహ భాగం పనులను వీరే చేస్తారు.

నిలువు కొప్పు వేసి అలంకరణ చేసుకోవడం వీరి ప్రత్యేకం. దీన్నే "చుండా" అని పిలుస్తారు.

వీరి ఆభరణాలు కూడా ప్రత్యేకమైనవే. వాటిలో తలపై నుంచి 'చుండా' పడిపోకుండా బ్యాలెన్స్ చేసే "డోరా"తో పాటు మెడ, చెవులు, కాళ్లకు ధరించే రాఖిడీ, ఖాటీ, బీడ్, చూడా, పాడీ చాలా ముఖ్యమైనవి.వీరికంటూ 'లబానా' అనే ఓ ప్రత్యేక భాష ఉంది. ప్రత్యేక నృత్య రీతులు కూడా ఉన్నాయి. మగవారు ప్రదర్శించే కోలాటాన్ని 'హోరీ వాడియో' అని, మహిళలు ప్రదర్శించే నృత్యాన్ని 'జాయో జాయో' అని పిలుస్తారు.

ఈ జాతిలో 'చోపట్' అనే పాచికలాటకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఉమ్మడి కుటుంబ జీవనానికి ప్రాముఖ్యం ఇస్తారు. ఆడపిల్లలు కుటుంబానికి బరువుకాదనే సందేశం వీరి ఆచార సంప్రదాయాల్లో అంతర్లీనంగా కనిపిస్తుంది. వరకట్న సంప్రదాయానికి ప్రాముఖ్యం చాలా తక్కువ. దాదాపుగా తీసుకోరు. పురిటి ఖర్చులు కూడా అత్తవారి బాధ్యతే.

పెళ్లికి ఎంత ఖర్చు చేయాలన్నదానికి ప్రత్యేక విధానం ఉంది. ఆ ఖర్చు బాధ్యత వరుడిదే. ఆడపెళ్లి వారింట విడిది సందర్భంగా బాత్.. అంటే భోజనం ఖర్చు, రాత్.. అంటే రాత్రి బసకు అయ్యే ఖర్చు, మూట్.. అంటే పెళ్లి కూతురు, ఆమె తండ్రికి ఇచ్చే కొంత నగదుగా దీన్ని విభజించారు. ఈ మూడింటికి కలిపి 124 రూపాయల ఖర్చుతో పెళ్లి తంతు నిర్వహిస్తార

శ్రీకృష్ణుడు, వేంకటేశ్వర స్వామి, పూరి జగన్నాథులను నమ్మే వీరి పూజల్లో సిక్కు ప్రార్థనలు కూడా ఉంటాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)